ఇంత జనం వస్తే ఎలా?
భక్తుల తాకిడిపై పోలీసుల్లో ఆందోళన
సాక్షి, హైదరాబాద్: ఎర్రవల్లి.. ఇప్పుడో పుణ్యక్షేత్రం. పర్యాటక ప్రాంతం. అన్ని దారులే అటే. గతంలో కనీసం పేరు కూడా వినిఉండని ధార్మిక వేడుక కావటం, 1,500 మంది రుత్విజులు ఏకధాటిగా చండీ సప్తశతి పారాయణంతో నిర్వహించే మహా యాగం కావడం, స్వయంగా సీఎం నిర్వహిస్తుండటంతో భక్తుల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది. దీంతో తొలిరోజే భక్తులు పోటెత్తారు. రెండోరోజు వారి సంఖ్య రెట్టింపైంది. శుక్రవారం నుంచి వరుసగా మూడు రోజులు సెలవు కావటంతో వారి సంఖ్య మరింత పెరగనుంది.
ఇప్పుడిదే అధికారుల్లో ఆందోళనకు కారణమవుతోంది. భారీ సంఖ్యలో భక్తులు పోటెత్తితే నియంత్రించటం కష్టమవుతుందని పోలీసు అధికారులు ఆందోళన చెందుతున్నారు. వచ్చే రోజుల్లో అయుత చండీయాగానికి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఏపీ సీఎం చంద్రబాబు సహా పలువురు ప్రముఖులు రానుండటంతో భక్తుల నియంత్రణ సవాల్‌గా మారుతుందని భావిస్తున్నారు. దీంతో భక్తుల రద్దీని నియంత్రించక తప్పదని ఇతర విభాగాల అధికారులతో పోలీసులు పేర్కొంటున్నారు.
ఇందులో భాగంగా ఆర్టీసీకి ప్రత్యేకంగా విన్నవించారు. ప్రస్తుతం వివిధ ప్రాంతాల నుంచి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతోంది. వరుసగా సెలవులు ఉండటంతో బస్సులు పెంచాలని ఆర్టీసీ తొలుత నిర్ణయించింది. కానీ పెంచి తే ఎర్రవల్లికి తాకిడి భారీగా ఉంటుందని, బస్సులు తగ్గించాలని పోలీసులు ఆర్టీసీని కోరారు.
ఉదయం భారీగా తగ్గించి.. కొన్నిం టిని మాత్రమే మధ్యాహ్నం, సాయంత్రం నడపాలని సూచించా రు. ఒకే సమయంలో ఎక్కువమంది రాకుండా.. సాయంత్రానికి మళ్లించాలనేది వారి ఆలోచన. దీంతో బస్సుల సంఖ్యను తగ్గించి పరిమితంగానే నడపాలని ఆర్టీసీ నిర్ణయించింది.