Ayutha Chandiyagam
-
అయుతం అద్భుతం
-
ప్రయుత చండీయాగం చేస్తా
యాగస్థలిలో సీఎం కేసీఆర్ వెల్లడి ♦ తెలంగాణ సస్యశ్యామలం కావాలి ♦ ప్రతి ఒక్కరి ముఖంలో చిరునవ్వు చూడాలి ♦ తెలంగాణ సిద్ధించినందుకే ఈ యాగం చేశా ♦ ఎప్పటికైనా ధర్మమే జయిస్తుంది.. అధర్మం నశిస్తుందని వ్యాఖ్య సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: తెలంగాణ సస్యశ్యామలమై, ప్రతి ఒక్కరి ముఖంలో చిరునవ్వు చూసినప్పుడు శృంగేరి పీఠాధిపతి అనుమతితో ప్రయుత చండీయాగం (సప్తశతీ పారాయణాలు పది లక్షలసార్లు చేయడాన్ని ప్రయుత చండీయాగం అంటారు) నిర్వహిస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. త్వరలోనే శృంగేరి పీఠానికి వెళ్లి పీఠాధిపతి భారతీ తీర్థ మహాస్వామి అనుమతి కోరతానని చెప్పారు. ఆదివారం ఎర్రవల్లిలో అయుత చండీయాగం ముగిసిన తర్వాత యాగశాల వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలు పరిపూర్ణం కావాలని, నీటిపారుదల కోసం ప్రతి ఏటా రూ.25 వేల కోట్ల బడ్జెట్ కేటాయించేలా దీవెనలు ఇవ్వాలని అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు. ‘‘2011లో శృంగేరి స్వామి వారి 60వ పుట్టిన రోజు సందర్భంగా చండీయాగం చేసినప్పుడు మేం తెలంగాణ కోసం పోరాటం చేస్తున్నాం. ఆరాట పడుతున్నాం. ఆ సమయంలో నా మిత్రుడు అష్టకాల రామ్మోహన్రావు శృంగేరి పీఠం నుంచి ప్రసాదం తెచ్చి ఇచ్చారు. ఆయన తెచ్చిన అక్షింతలు మీద చల్లుకొని తెలంగాణ రాష్ట్రం సిద్ధిస్తే 100 శాతం అయుత చండీయాగం చేస్తానని దీక్ష తీసుకున్నా. అందుకే ఈ యాగం చేశాను’’ అని ముఖ్యమంత్రి వివరించారు. మనం నిమిత్త మాత్రులమని చెప్పా.. ‘‘గడా ఓఎస్డీ హన్మంతరావు ధర్మపత్ని, నా బిడ్డ ఎదురుగా నిల్చొని ఉన్నారు. నిప్పు రగిలి మంటలు లేస్తుంటే ఆ అమ్మాయి విషణ్ణ వదనంతో నిలబడింది. అప్పుడు నేను.. ఎందుకు తల్లీ.. బాధపడుతున్నావు.. మనం కేవలం నిమిత్త మాత్రులం అన్నాను’’ అని ముఖ్యమంత్రి తెలిపారు. ‘‘మళ్లీ అందరం వెళ్లి శాంతి మంత్రాలు జపించి, పూర్ణాహుతి చేసి యాగ పరిసమాప్తి చేస్తుంటే ఆ అమ్మాయి ముఖంలో చిరునవ్వులు చూసిన. నిన్నటికే సుసంపన్నంగా కోటి జపాలు, 10 వేల పారాయణాలు పూర్తి చేసుకున్నాం. ఈ రోజు మహారుద్రయాగం నుంచి చతుర్వేద యాగాల వరకు కూడా పూర్ణాహుతి చేసుకున్నాం. అమ్మవారి 100 హోమగుండాల్లో పూర్ణాహుతి ఇవ్వడం జరిగిపోయింది. చివరి ఘట్టం మాత్రమే ఉంది.. మీరు ఆవాసానికి వెళ్లి రావచ్చని రుత్విక్కులకు చెప్పిన. ఆ సందర్భంగా చిన్న మంటలు చెలరేగితే.. నరహరి భట్టు గారు వైదికంగా జరగాల్సిన పూర్ణాహుతిని ఒంటికాలుపై నిలబడి పరిసమాప్తి చేశారు. తెలియని వాళ్లు కొందరు గాబరా పడ్డా.. నేను గాబరా పడలేదు. యాగాలు చేయడం నాకు కొత్త కాదు. దాదాపు 25 సంవత్సరాలుగా చేస్తున్నా. కొందరు అవాకులు, చవాకులు పేలారు. నేను పట్టించుకోలేదు’’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ధర్మం జయిస్తుంది.. తెలంగాణ ప్రజలు చిరునవ్వుతో బతకాలని కోరుకుంటున్నా. ధర్మం తప్పక జయిస్తుంది. అధర్మం నశిస్తుంది..’’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. సిద్ధాంతి శర్మకు రవీంధ్రభారతిలో సన్మానం చేయాలని నిర్ణయించామని, వారు శతాధిక యజ్ఞాలు చేశారని చెప్పారు. ‘‘కొందరు మిత్రులు మన సంప్రదాయంపై దాడి జరుగుతోందని నాతో అన్నారు. మన సంప్రదాయం గురించి బాధపడాల్సిన పనిలేదని వారికి చెప్పాను. తల్లి పిల్లవాడికి చనుబాలు ఇస్తూ జోలపాట పాడుతున్నప్పుడే పిల్లవాడికి మన సంస్కృతిని ఎక్కిస్తుంది. జో అచ్చుతానందా... జోజో ముకుంద... రామ పరమానంద లాలి గోవిందా... అంటదే తప్ప జో కంస... జో దుర్యోధన... జో కుంభకర్ణ... జో రావణా అని ఏ తల్లీ అనదు. మన సంప్రదాయంలో, మన సంస్కారంలో అంతటి మహోన్నతమైన విశిష్టత ఉంది. నా బోటి చిన్నవాళ్లు భవిష్యత్‌లో ఇంకా ఎంతో మంది పుడుతారు. బ్రాహ్మణోత్తములు, రుత్వికోత్తములు కార్య నిర్వహణ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మన సంప్రదాయం, సంస్కారం సుసంపన్నంగా, సుభిక్షంగా ఉంటది. ధర్మం ఎల్లవేళలా విస్తరిస్తూనే ఉంటది. నా మనుమడు ఉన్నడు.. నేను సాష్టాంగ నమస్కారం చేస్తే ఆ అబ్బాయి కూడా సాష్టాంగ నమస్కారం చేస్తున్నాడు. నిన్న నాకు అయ్యవార్లు చెప్పారు. నీ మనమవడికి కూడా మీ సంస్కారం నేర్పిస్తున్నారు.. శుభం అని అన్నారు. చాలా సంతోషం అనిపించింది. నా మనవడికి కూడా మీ అందరి ఆశీస్సులు లభించాయి’’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. -
అమ్మవారు అనుగ్రహిస్తే ప్రయుత చండీయాగం నిర్వహిస్తా
-
మూడోరోజుకు చేరిన అయుత చండీయాగం
-
ఎర్రవల్లిలో బారులు తీరిన భక్తులు
ఎర్రవల్లి: మెదక్ జిల్లా ఎర్రవల్లిలో తెలంగాణ సీఎం కేసీఆర్ నిర్వహిస్తున్న అయుత చండీయాగానికి ప్రజలు భారీగా తరలివస్తున్నారు. శుక్రవారం నుంచి వరుస సెలవులు కావడంతో ఉదయం 5 గంటల నుంచే భక్తుల రద్దీ ప్రారంభమైంది. ఉదయం 10 గంటల కల్లా దాదాపు 30 వేల మందికి పైగా భక్తులు ఎర్రవల్లి వచ్చారు. ఎర్రవల్లికి వెళ్లే మార్గంలో 5 కిలోమీటర్ల మేర భక్తులు బారులు తీరారు. భక్తుల రద్దీకి అనుగుణంగా నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. మంత్రి హరీశ్‌రావు, జిల్లా కలెక్టర్ రొనాల్డ్‌రోస్ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు గజ్వేల్ నియోజకవర్గంలోని ములుగు, వర్గల్, తూప్రాన్, కొండపాక, జగదేవ్‌పూర్, గజ్వేల్ మండలాలతో పాటు రంగారెడ్డి, హైదరాబాద్, నల్లగొండ, వరంగల్ తదితర జిల్లాల నుంచి ప్రజలు విచ్చేస్తున్నారు. ఈ సందర్భంగా రాజీవ్ రహదారితో పాటు జగదేవ్‌పూర్-నల్లగొండ ప్రధాన మార్గం సైతం రద్దీగా మారింది. దీంతో పోలీసులు ట్రాఫిక్ క్రమబద్దీకరణకు చర్యలు తీసుకుంటున్నారు. -
మూడోరోజుకు చేరిన అయుత చండీయాగం
ఎర్రవల్లి: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన అయుత చండీయాగం మూడోరోజు కొనసాగుతోంది. శుక్రవారం ఉదయం గురుప్రార్ధనతో మూడోరోజు అయుత చండీ యాగం ప్రారంభమైంది. వేద మంత్రాల మధ్య పూజలు ప్రారంభమయ్యాయి. శ్వేత వర్ణ దుస్తుల్లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ యాగస్థలికి చేరుకున్నారు. గురు ప్రార్థనతో ప్రారంభమైన చండీయాగం, గోపూజ, త్రిసహస్ర చండీ పారాయణములు, నవార్ణ పూజ, నవగ్రహ హోమం, తదితరాలతో పాటు మహా మంగళహారతి నిర్వహిస్తున్నారు. మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్.విద్యాసాగర్ యాగాన్ని తిలకించేందుకు వచ్చారు. ఆయనకు కేసీఆర్ సాదరంగా ఆహ్వానం పలికారు. మరోవైపు ఈ చండీయాగానికి వీఐపీల నుంచి సామాన్య ప్రజలు, భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఇవాళ రాత్రి 10 గంటల వరకూ ఆధ్యాత్మిక కార్యక్రమాలు కొనసాగనున్నాయి. భక్తులు ఉదయం నుంచి రాత్రి పది గంటల వరకూ యాగశాలను సందర్శించే అవకాశం ఉంది. నేటి సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా అన్నమయ్య భావనా వాహిణి వ్యవస్థాపకురాలు శోభారాజ్ అన్నమయ్య కీర్తనలు ఆలపిస్తారు. త్రిదండి శ్రీమన్నారాయణ చిన జీయర్ స్వామి, ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు, ఏపీ శాసనమండలి చైర్మన్ చక్రపాణి తదితర ప్రముఖలు ఈ చండీయాగంలో పాల్గొంటారు. ఇక గజ్వేల్ నియోజకవర్గంలోని ములుగు, వర్గల్, తూప్రాన్, కొండపాక, జగదేవ్‌పూర్, గజ్వేల్ మండలాలతో పాటు రంగారెడ్డి, హైదరాబాద్, నల్లగొండ, వరంగల్ తదితర జిల్లాల నుంచి ప్రజలు విచ్చేస్తున్నారు. ఈ సందర్భంగా రాజీవ్ రహదారితో పాటు జగదేవ్‌పూర్-నల్లగొండ ప్రధాన మార్గం సైతం రద్దీగా మారింది. దీంతో పోలీసులు ట్రాఫిక్ క్రమబద్దీకరణకు చర్యలు తీసుకుంటున్నారు. -
ఇంత జనం వస్తే ఎలా?
భక్తుల తాకిడిపై పోలీసుల్లో ఆందోళన సాక్షి, హైదరాబాద్: ఎర్రవల్లి.. ఇప్పుడో పుణ్యక్షేత్రం. పర్యాటక ప్రాంతం. అన్ని దారులే అటే. గతంలో కనీసం పేరు కూడా వినిఉండని ధార్మిక వేడుక కావటం, 1,500 మంది రుత్విజులు ఏకధాటిగా చండీ సప్తశతి పారాయణంతో నిర్వహించే మహా యాగం కావడం, స్వయంగా సీఎం నిర్వహిస్తుండటంతో భక్తుల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది. దీంతో తొలిరోజే భక్తులు పోటెత్తారు. రెండోరోజు వారి సంఖ్య రెట్టింపైంది. శుక్రవారం నుంచి వరుసగా మూడు రోజులు సెలవు కావటంతో వారి సంఖ్య మరింత పెరగనుంది. ఇప్పుడిదే అధికారుల్లో ఆందోళనకు కారణమవుతోంది. భారీ సంఖ్యలో భక్తులు పోటెత్తితే నియంత్రించటం కష్టమవుతుందని పోలీసు అధికారులు ఆందోళన చెందుతున్నారు. వచ్చే రోజుల్లో అయుత చండీయాగానికి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఏపీ సీఎం చంద్రబాబు సహా పలువురు ప్రముఖులు రానుండటంతో భక్తుల నియంత్రణ సవాల్‌గా మారుతుందని భావిస్తున్నారు. దీంతో భక్తుల రద్దీని నియంత్రించక తప్పదని ఇతర విభాగాల అధికారులతో పోలీసులు పేర్కొంటున్నారు. ఇందులో భాగంగా ఆర్టీసీకి ప్రత్యేకంగా విన్నవించారు. ప్రస్తుతం వివిధ ప్రాంతాల నుంచి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతోంది. వరుసగా సెలవులు ఉండటంతో బస్సులు పెంచాలని ఆర్టీసీ తొలుత నిర్ణయించింది. కానీ పెంచి తే ఎర్రవల్లికి తాకిడి భారీగా ఉంటుందని, బస్సులు తగ్గించాలని పోలీసులు ఆర్టీసీని కోరారు. ఉదయం భారీగా తగ్గించి.. కొన్నిం టిని మాత్రమే మధ్యాహ్నం, సాయంత్రం నడపాలని సూచించా రు. ఒకే సమయంలో ఎక్కువమంది రాకుండా.. సాయంత్రానికి మళ్లించాలనేది వారి ఆలోచన. దీంతో బస్సుల సంఖ్యను తగ్గించి పరిమితంగానే నడపాలని ఆర్టీసీ నిర్ణయించింది. -
పోటెత్తిన భక్తజనం
* 1.50 లక్షల మంది రాక.. అందులో 80 వేల మంది మహిళలే * పోలీసుల ఓవరాక్షన్‌తో ఇబ్బందులు పడుతున్న సామాన్యులు * కుంకుమార్చన మండపం వద్ద తొక్కిసలాట, సొమ్మసిల్లిన భక్తుడు * భోజనశాల వద్ద కూడా తోపులాట సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: వరుసగా నాలుగు రోజులు సెలవులు రావడంతో అయుత చండీయాగానికి గురువారం భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు. 40 వేల వాహనాల్లో 1.50 లక్షల మంది భక్తులు వచ్చినట్లుగా అధికారులు అంచనా వేస్తున్నారు. వచ్చే రెండ్రోజులు కూడా భక్తుల తాకిడి ఉండవచ్చని భావిస్తున్నారు. యాగశాల ప్రాంగణంలో పోలీసుల అత్యుత్సాహం సామాన్య ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. వీఐపీలకు రెడ్ కార్పెట్ పరుస్తున్న పోలీసులు సామాన్య భక్తులను చిన్నచూపు చూస్తున్నారు. వీవీఐపీ గేటు వద్ద ఉన్న పోలీసు అధికారులు తమకు పరిచయం ఉన్న వారినే వీవీఐపీగా గుర్తించడం విమర్శలకు తావిస్తోంది. ఎమ్మెల్సీ, జిల్లా పరిషత్ చైర్మన్ స్థాయి ప్రజాప్రతినిధులను పక్కన పెట్టారు. మెదక్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ రాజమణి మురళీయాదవ్ సాధారణ భక్తులతో పాటే చండీయాగాన్ని వీక్షించారు. ఆమె జిల్లా పరిషత్ చైర్మన్ అని స్థానిక నేతలు పోలీసులకు సర్దిచెప్పే ప్రయత్నం చేసినా.. వినిపించుకోకుండా ఆమెను సాధారణ గ్యాలరీలోకి పంపించారు. ఒక్కో వీఐపీని దగ్గరుండి మరీ మండపం వద్దకు తీసుకు వెళ్తున్న పోలీసులు.. సాధారణ భక్తులను మాత్రం గాలికి వదిలేశారు. క్యూలైన్ ద్వారా భక్తులు మండపానికి చేరుకోవడానికి గంటల తరబడి సమయం పట్టింది. కుంకుమార్చన మండపం సమీపంలో స్వల్పంగా తొక్కిసలాట జరిగింది. కొందరు మహిళలు గాయపడ్డారు. ఈ తొక్కిసలాటలో హైదరాబాద్‌కు చెందిన ఓ భక్తుడు కిందపడి సొమ్మసిల్లిపోవడంతో 108లో ఆసుపత్రికి తరలించారు. యాగం పూర్తి కాగానే భక్తులందరూ భోజనశాల వైపు ఒకేసారి వెళ్లడంతో అక్కడా తొక్కిసలాట జరిగింది. లక్ష మందికిపైగా భక్తులు తరలిరావడంతో భోజనం వడ్డించే వారు చేతులెత్తేశారు. మొత్తం లక్షన్నర మంది భక్తుల్లో.. 80 వేల మందికిపైగా మహిళలే ఉన్నారు. కుంకుమార్చనలో పాల్గొనడానికి 10 వేల మందికిపైగా మహిళలు రాగా కేవలం 5 వేల మందికే అవకాశం దొరికింది. -
ఆధ్యాత్మిక వల్లి
* యతీశ్వరులు, తపోమూర్తులు నడయాడిన గడ్డ * ఇటీవలి తవ్వకాల్లో బయటపడిన యజ్ఞశాలలు, వైదిక సంస్కృతి సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ఎర్రవల్లి.. యతీశ్వరులు, తపోమూర్తులు నడయాడిన ప్రాంతమిది! గతంలో యజ్ఞయాగాలు జరిగిన చోటు. ఇటీవలే పురాతత్వ శాస్త్రవేత్తల తవ్వకాల్లో 3 వేల సంవత్సరాల చారిత్రక నేపథ్యంగల యజ్ఞశాలలు, వైదిక సంస్కృతి చిహ్నాలు ఇక్కడ బయటపడ్డాయి. జగదేవ్‌పూర్‌లో బ్రహ్మశ్రీ ఆదరాసుపల్లి యజ్ఞరామ సోమయాజులు సోమయాగం నిర్వహించినట్లు ఆధారాలున్నాయి. ఇక్కడికి సమీపంలోని కుకునూర్‌పల్లిలో బ్రహ్మశ్రీ కాసు నరసింహసోమయాజుల వారు అత్యంత నిష్టాగరిష్టుడైన యజ్ఞకర్తగా పేరెన్నికగన్నారు. అంకిరెడ్డిపల్లికి చెందిన శ్రీరామానందులు, జయానందులు వంటి సర్వసంఘ పరిత్యాగులు ఈ ప్రాంతం వారే. ఇటీవల జరిపిన తవ్వకాల్లో.. యాగస్థలికి కూతవేటు దూరంలో ఉన్న శివారు వెంకటాపూర్‌లో వందలాది ఆదిమానవుల సమాధులు, యజ్ఞశాలలు, వైదిక సంస్కృతి చిహ్నాలు బయటపడ్డాయి. నిజాం కాలంలో ప్రజల్లో ధార్మిక చింతనను రగిలించి భాగవత సప్త ప్రవాహారాలతో భక్తిభావాన్ని నింపిన భావానంద భారతీస్వామివారు మర్కుక్ శ్రీ పాండురంగాశ్రమం కేంద్రంగా భక్తి ఉద్యమాన్ని నడిపించారు. 40 ఏళ్ల కిందట పాండురంగాశ్రమం వ్యవస్థాపకులైన భావానంద భారతీస్వామివారి ప్రేరణతో ఎర్రవల్లిలో కృష్ణ భజన సంఘం ఏర్పడింది. ఓపక్క అపర కాంచీపురం అనదగిన వరదరాజస్వామి మందిరం, మరోవైపు శ్రీపాండురంగ ఆశ్రమాల పరిధిలోని ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్ అయుత చండీయాగం చేయడం కార్యాకారణ సంబంధమేనని, దీని వెనుక దైవిక ప్రేరణ, ఆయా మహాత్ముల ఆంతరంగిక స్పందన ఉందని పండితులు అంటున్నారు. వందేళ్ల క్రితం మైసూరు మహారాజు చేసిన అద్భుత యాగం మళ్లీ ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. నేడు రాత్రి 10 వరకు కార్యక్రమాలు * యాగానికి రానున్న చినజీయర్ స్వామి సాక్షి, హైదరాబాద్: అయుత చండీయాగంలో భాగంగా మూడో రోజైన శుక్రవారం రాత్రి 10 గంటల వరకు ఆధ్యాత్మిక కార్యక్రమాలు కొనసాగనున్నాయి. భక్తులు ఉదయం నుంచి రాత్రి 10 గంటల వరకు యాగశాలను సందర్శించే అవకాశం ఉంది. శుక్రవారం నాటి సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా రాత్రి అన్నమయ్య భావనా వాహిణి వ్యవస్థాపకురాలు శోభారాజ్ అన్నమయ్య కీర్తనలు ఆలపిస్తారు. త్రిదండి శ్రీమన్నారాయణ చిన జీయర్ స్వామి శుక్రవారం చండీయాగానికి హాజరవనున్నారు. మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావు, ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్‌రావు, ఏపీ శాసన మండలి చైర్మన్ చక్రపాణి తదితర ప్రముఖులు చండీయాగంలో పాల్గొననున్నారు. -
ఎర్రవల్లిలో వేదఘోష
* అంగరంగ వైభవంగా రెండోరోజూ అయుత చండీయాగం * గులాబీ వర్ణ వస్త్రధారణతో కార్యక్రమాలు నిర్వహించిన రుత్విక్కులు * 22 వందల సప్తశతి పారాయణాలు, 33 లక్షల చండీ నవార్ణ మంత్ర జపాలు * భక్తిశ్రద్ధలతో పూజలు చేసిన సీఎం కేసీఆర్ దంపతులు * గౌరీదేవీ కుంకుమార్చనలో భారీగా పాల్గొన్న మహిళలు * హాజరైన కేంద్రమంత్రులు వెంకయ్య, దత్తాత్రేయ, సుప్రీం జడ్జి జస్టిస్ చలమేశ్వర్ సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ఎర్రవల్లి రెండోరోజూ వేదఘోషతో మార్మోగింది. పారాయణాలు, జపాలు, వేద మంత్రోచ్ఛరణలతో యాగక్షేత్రం హోరెత్తింది. ఆసాంతం ఆధ్యాత్మిక శోభను పంచింది. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. విశ్వమానవ శ్రేయస్సును కాంక్షిస్తూ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మెదక్ జిల్లా ఎర్రవల్లిలోని తన ఫాంహౌస్‌లో చేపట్టిన అయుత చండీయాగం గురువారం రెండోరోజుకు చేరింది. తొలిరోజు మాదిరే శృంగేరి శారదా పీఠం శిష్యులు పురాణం మహేశ్వర శర్మ, ఫణి శశాంక శర్మ, గోపీకృష్ణశర్మ బృందం పంచగవ్యప్రాశన, గోమూత్ర, గోమయ, గోఘృత, గోదధి, గోక్షీరము కలిపి ప్రాశనములు చేసి యాగశాల మంటపాన్ని శుద్ధి చేసి, విఘ్నేశ్వర పూజలు చేశారు. ఉదయం 9.20 గంటలకు సీఎం కేసీఆర్ దంపతులు యాగశాలకు చేరుకోవడంతో రెండో రోజు క్రతువు మొదలైంది. ‘శ్రీ సచ్చిదానంద.. చంద్రశేఖర భారతీ తీర్థ.. విద్యాతీర్థగురుంబాజే.. వందే గురు పరంపర.. సాష్టాంగ ప్రమాణ సమర్పయామి’ అంటూ యాగ నిర్వాహకులు ముఖ్యమంత్రి కేసీఆర్‌తో సహా రుత్విక్కులంతా గురు ప్రార్థన చేసి యాగం మొదలు పెట్టారు. కేసీఆర్ యాగశాల చుట్టూ రెండు ప్రదక్షిణలు చేశారు. రుత్విక్కులు హోమగుండం చుట్టూ కూర్చుని పారాయణ జపాలు ప్రారంభించారు. కుటుంబ సభ్యులతో కలిసి కేసీఆర్ దంపతులు.. గోపూజ, మహాగణపతి, శతుషష్టి యోగినీ బలి, రాజశ్యామల పురశ్ఛరణ చతుర్వేద యాగం, కుమారి, సుహాసిని, మహా సాకం, ఉక్తదేవతా జపములు తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. 11.15కు దుర్గామాతకు మహా మంగళ హారతి సమర్పించారు. 200 మంది రుత్విక్కులతో మహా రుద్రయాగం యాగశాలలోని మరో మండపంలో 200 మంది రుత్విక్కులు మహారుద్రయాగం, కుమారస్వామి పూజ నిర్వహించారు. మరో మండపంలో ముత్తయిదువలు లలితా సహస్ర నామాలతో గౌరీదేవీకి కుంకుమార్చన చేశారు. అర్చన కోసం వినియోగిస్తున్న కుంకుమను శృంగేరి శారదా పీఠం నుంచి తీసుకువచ్చారు. ఈ పూజలో హరీశ్‌రావు, కేటీఆర్ సతీమణులు పాల్గొన్నారు. అర్చనలో రోజుకు 3 క్వింటాళ్ల కుంకుమ వాడుతున్నట్లు బ్రాహ్మణులు తెలిపారు. యాగ కార్యక్రమంలో పురాణం మహేశ్వర శర్మ, ఫణి శశాంక శర్మ, పట్లూరు మాణిక్య సోమయాజులు, శృంగేరీ భావి పీఠాధిపతి విధుశేఖర భారతీ మహాస్వామి, ఆయన తండ్రి కుప్ప శివసుబ్రహ్మణ్యం, కుప్పగోపాల వాజ్‌పేయి తదితరులు కేసీఆర్‌ను ఆశీర్వదించారు. ప్రముఖుల రాక.. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చలమేశ్వర్, హెటిరో డ్రగ్స్ చైర్మన్ పార్థసారథి, డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మంత్రులు టి.హరీశ్‌రావు, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి, ఎంపీలు కొత్త ప్రభాకర్‌రెడ్డి, బాల్క సుమన్, కేశవరావు, డీజీపీ అనురాగ్‌శర్మ, ఐజీ నవీన్‌చంద్, ఎమ్మెల్యేలు సోలిపేట రామలింగారెడ్డి, నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్, మెదక్ జెడ్పీ చైర్పర్సన్ రాజమణి మురళీయాదవ్ తదితరులు యాగానికి తరలివచ్చారు. గులాబీ వర్ణ వస్త్రాల్లో యాగం రెండోరోజు రుత్విక్కులు గులాబీ వర్ణ వస్త్రాలను ధారణ చేసి 100 హోమ గుండాల చుట్టూ 1,100 మంది ఆశీనులయ్యారు. అనంతరం ఏకోత్తర వృద్ధి సంప్రదాయంతో ఒక్కొక్కరు రెండు సప్తశతి పారాయణాలు, 3 వేల చండీ నవార్ణ మంత్ర జపాలు చేశారు. రెండోరోజు యాగంలో రుత్విక్కులంతా కలిసి 22 వందల సప్తశతి పారాయణాలు, 33 లక్షల చండీ నవార్ణ మంత్ర జపాలు చేశారు. 11:40 గంటలకు సర్వభాష రుత్విక్కులు ఏకకంఠంతో చండీయాగ పారాయణాలు ప్రారంభించి నిర్విరామంగా మధ్యాహ్నం 1:20 వరకు కొనసాగించారు. మధ్యాహ్నం 12.12 గంటలకు కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, బండారు దత్తాత్రేయ యాగస్థలికి వచ్చారు. వారికి పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. చండీయాగం.. క్షణక్షణం ఉదయం 9:26: యాగస్థలికి చేరుకున్న కేసీఆర్ దంపతులు 10:11: యాగశాల చుట్టూ ప్రదక్షిణలు 10:57: దుర్గామాతకు అఖండ మంగళ హారతి 11:20: కుంకుమార్చనలో దంపతి, సుహాసిని పూజలు 11:40: ఏక కంఠంతో పారాయణాలు ప్రారంభించిన 1,100 మంది రుత్విక్కులు మధ్యాహ్నం 12:12: యాగస్థలికి వచ్చిన కేంద్ర మంత్రులు వెంకయ్య, బండారు దత్తాత్రేయ 1:20: 2,200 పారాయణాలు, 33 లక్షల నవార్ణ మంత్ర జపాలు పూర్తిచేసిన రుత్విక్కులు 1:40: రుత్విక్కులకు భోజన విరామం 2:10: భోజన విరామానికి వెళ్లిన కేసీఆర్ 4:55: యాగశాలలోకి పునఃప్రవేశం రాత్రి 8:30 గంటలు: సాయంత్రం నుంచి కొనసాగిన ప్రవచనాలు - సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి -
రెండో రోజు అయుత చండీయాగం
-
రెండో రోజు ప్రారంభమైన చండీయాగం
-
రెండో రోజు ప్రారంభమైన చండీయాగం
మెదక్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహిస్తున్న అయుత చండీయాగం గురువారం రెండో రోజుకు చేరుకుంది. ఉదయం 8.00 గంటలకు ఈ యాగం ప్రారంభమైంది. యాగంలో భాగంగా ఈరోజు గురు ప్రార్థన, గోపూజ, ద్విసహస్ర చండీ పారాయణం... కోటి సహస్రనామ పూజ, మహాధన్వంతరీ యాగం, శ్రీచక్ర పూజను రుత్వికులు నిర్వహించనున్నారు. ఈ రోజు ఈ యాగానికి కేంద్రమంత్రులు ఎం.వెంకయ్యనాయుడు, బండారు దత్తాత్రేయ, సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ జె. చలమేశ్వర్ హాజరుకానున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మెదక్ జిల్లా జగదేవ్‌పూర్ మండలం ఎర్రవల్లిలోని తన ఫాంహౌస్‌లో అయుత చండీయాగం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ యాగం బుధవారం ప్రారంభమైంది.