ప్రయుత చండీయాగం చేస్తా
యాగస్థలిలో సీఎం కేసీఆర్ వెల్లడి
♦ తెలంగాణ సస్యశ్యామలం కావాలి
♦ ప్రతి ఒక్కరి ముఖంలో చిరునవ్వు చూడాలి
♦ తెలంగాణ సిద్ధించినందుకే ఈ యాగం చేశా
♦ ఎప్పటికైనా ధర్మమే జయిస్తుంది.. అధర్మం నశిస్తుందని వ్యాఖ్య
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: తెలంగాణ సస్యశ్యామలమై, ప్రతి ఒక్కరి ముఖంలో చిరునవ్వు చూసినప్పుడు శృంగేరి పీఠాధిపతి అనుమతితో ప్రయుత చండీయాగం (సప్తశతీ పారాయణాలు పది లక్షలసార్లు చేయడాన్ని ప్రయుత చండీయాగం అంటారు) నిర్వహిస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. త్వరలోనే శృంగేరి పీఠానికి వెళ్లి పీఠాధిపతి భారతీ తీర్థ మహాస్వామి అనుమతి కోరతానని చెప్పారు. ఆదివారం ఎర్రవల్లిలో అయుత చండీయాగం ముగిసిన తర్వాత యాగశాల వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలు పరిపూర్ణం కావాలని, నీటిపారుదల కోసం ప్రతి ఏటా రూ.25 వేల కోట్ల బడ్జెట్ కేటాయించేలా దీవెనలు ఇవ్వాలని అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు. ‘‘2011లో శృంగేరి స్వామి వారి 60వ పుట్టిన రోజు సందర్భంగా చండీయాగం చేసినప్పుడు మేం తెలంగాణ కోసం పోరాటం చేస్తున్నాం. ఆరాట పడుతున్నాం. ఆ సమయంలో నా మిత్రుడు అష్టకాల రామ్మోహన్‌రావు శృంగేరి పీఠం నుంచి ప్రసాదం తెచ్చి ఇచ్చారు. ఆయన తెచ్చిన అక్షింతలు మీద చల్లుకొని తెలంగాణ రాష్ట్రం సిద్ధిస్తే 100 శాతం అయుత చండీయాగం చేస్తానని దీక్ష తీసుకున్నా. అందుకే ఈ యాగం చేశాను’’ అని ముఖ్యమంత్రి వివరించారు.
మనం నిమిత్త మాత్రులమని చెప్పా..
‘‘గడా ఓఎస్డీ హన్మంతరావు ధర్మపత్ని, నా బిడ్డ ఎదురుగా నిల్చొని ఉన్నారు. నిప్పు రగిలి మంటలు లేస్తుంటే ఆ అమ్మాయి విషణ్ణ వదనంతో నిలబడింది. అప్పుడు నేను.. ఎందుకు తల్లీ.. బాధపడుతున్నావు.. మనం కేవలం నిమిత్త మాత్రులం అన్నాను’’ అని ముఖ్యమంత్రి తెలిపారు. ‘‘మళ్లీ అందరం వెళ్లి శాంతి మంత్రాలు జపించి, పూర్ణాహుతి చేసి యాగ పరిసమాప్తి చేస్తుంటే ఆ అమ్మాయి ముఖంలో చిరునవ్వులు చూసిన. నిన్నటికే సుసంపన్నంగా కోటి జపాలు, 10 వేల పారాయణాలు పూర్తి చేసుకున్నాం. ఈ రోజు మహారుద్రయాగం నుంచి చతుర్వేద యాగాల వరకు కూడా పూర్ణాహుతి చేసుకున్నాం.
అమ్మవారి 100 హోమగుండాల్లో పూర్ణాహుతి ఇవ్వడం జరిగిపోయింది. చివరి ఘట్టం మాత్రమే ఉంది.. మీరు ఆవాసానికి వెళ్లి రావచ్చని రుత్విక్కులకు చెప్పిన. ఆ సందర్భంగా చిన్న మంటలు చెలరేగితే.. నరహరి భట్టు గారు వైదికంగా జరగాల్సిన పూర్ణాహుతిని ఒంటికాలుపై నిలబడి పరిసమాప్తి చేశారు. తెలియని వాళ్లు కొందరు గాబరా పడ్డా.. నేను గాబరా పడలేదు. యాగాలు చేయడం నాకు కొత్త కాదు. దాదాపు 25 సంవత్సరాలుగా చేస్తున్నా. కొందరు అవాకులు, చవాకులు పేలారు. నేను పట్టించుకోలేదు’’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.
ధర్మం జయిస్తుంది..
తెలంగాణ ప్రజలు చిరునవ్వుతో బతకాలని కోరుకుంటున్నా. ధర్మం తప్పక జయిస్తుంది. అధర్మం నశిస్తుంది..’’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. సిద్ధాంతి శర్మకు రవీంధ్రభారతిలో సన్మానం చేయాలని నిర్ణయించామని, వారు శతాధిక యజ్ఞాలు చేశారని చెప్పారు. ‘‘కొందరు మిత్రులు మన సంప్రదాయంపై దాడి జరుగుతోందని నాతో అన్నారు. మన సంప్రదాయం గురించి బాధపడాల్సిన పనిలేదని వారికి చెప్పాను. తల్లి పిల్లవాడికి చనుబాలు ఇస్తూ జోలపాట పాడుతున్నప్పుడే పిల్లవాడికి మన సంస్కృతిని ఎక్కిస్తుంది. జో అచ్చుతానందా... జోజో ముకుంద... రామ పరమానంద లాలి గోవిందా... అంటదే తప్ప జో కంస... జో దుర్యోధన... జో కుంభకర్ణ... జో రావణా అని ఏ తల్లీ అనదు. మన సంప్రదాయంలో, మన సంస్కారంలో అంతటి మహోన్నతమైన విశిష్టత ఉంది.
నా బోటి చిన్నవాళ్లు భవిష్యత్‌లో ఇంకా ఎంతో మంది పుడుతారు. బ్రాహ్మణోత్తములు, రుత్వికోత్తములు కార్య నిర్వహణ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మన సంప్రదాయం, సంస్కారం సుసంపన్నంగా, సుభిక్షంగా ఉంటది. ధర్మం ఎల్లవేళలా విస్తరిస్తూనే ఉంటది. నా మనుమడు ఉన్నడు.. నేను సాష్టాంగ నమస్కారం చేస్తే ఆ అబ్బాయి కూడా సాష్టాంగ నమస్కారం చేస్తున్నాడు. నిన్న నాకు అయ్యవార్లు చెప్పారు. నీ మనమవడికి కూడా మీ సంస్కారం నేర్పిస్తున్నారు.. శుభం అని అన్నారు. చాలా సంతోషం అనిపించింది. నా మనవడికి కూడా మీ అందరి ఆశీస్సులు లభించాయి’’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు.