అయుత చండీయాగంలో భాగంగా మూడో రోజైన శుక్రవారం రాత్రి 10 గంటల వరకు ఆధ్యాత్మిక కార్యక్రమాలు కొనసాగనున్నాయి.
* యతీశ్వరులు, తపోమూర్తులు నడయాడిన గడ్డ
* ఇటీవలి తవ్వకాల్లో బయటపడిన యజ్ఞశాలలు, వైదిక సంస్కృతి
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ఎర్రవల్లి.. యతీశ్వరులు, తపోమూర్తులు నడయాడిన ప్రాంతమిది! గతంలో యజ్ఞయాగాలు జరిగిన చోటు. ఇటీవలే పురాతత్వ శాస్త్రవేత్తల తవ్వకాల్లో 3 వేల సంవత్సరాల చారిత్రక నేపథ్యంగల యజ్ఞశాలలు, వైదిక సంస్కృతి చిహ్నాలు ఇక్కడ బయటపడ్డాయి. జగదేవ్‌పూర్‌లో బ్రహ్మశ్రీ ఆదరాసుపల్లి యజ్ఞరామ సోమయాజులు సోమయాగం నిర్వహించినట్లు ఆధారాలున్నాయి.
ఇక్కడికి సమీపంలోని కుకునూర్‌పల్లిలో బ్రహ్మశ్రీ కాసు నరసింహసోమయాజుల వారు అత్యంత నిష్టాగరిష్టుడైన యజ్ఞకర్తగా పేరెన్నికగన్నారు. అంకిరెడ్డిపల్లికి చెందిన శ్రీరామానందులు, జయానందులు వంటి సర్వసంఘ పరిత్యాగులు ఈ ప్రాంతం వారే. ఇటీవల జరిపిన తవ్వకాల్లో.. యాగస్థలికి కూతవేటు దూరంలో ఉన్న శివారు వెంకటాపూర్‌లో వందలాది ఆదిమానవుల సమాధులు, యజ్ఞశాలలు, వైదిక సంస్కృతి చిహ్నాలు బయటపడ్డాయి.
నిజాం కాలంలో ప్రజల్లో ధార్మిక చింతనను రగిలించి భాగవత సప్త ప్రవాహారాలతో భక్తిభావాన్ని నింపిన భావానంద భారతీస్వామివారు మర్కుక్ శ్రీ పాండురంగాశ్రమం కేంద్రంగా భక్తి ఉద్యమాన్ని నడిపించారు. 40 ఏళ్ల కిందట పాండురంగాశ్రమం వ్యవస్థాపకులైన భావానంద భారతీస్వామివారి ప్రేరణతో ఎర్రవల్లిలో కృష్ణ భజన సంఘం ఏర్పడింది.
ఓపక్క అపర కాంచీపురం అనదగిన వరదరాజస్వామి మందిరం, మరోవైపు శ్రీపాండురంగ ఆశ్రమాల పరిధిలోని ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్ అయుత చండీయాగం చేయడం కార్యాకారణ సంబంధమేనని, దీని వెనుక దైవిక ప్రేరణ, ఆయా మహాత్ముల ఆంతరంగిక స్పందన ఉందని పండితులు అంటున్నారు. వందేళ్ల క్రితం మైసూరు మహారాజు చేసిన అద్భుత యాగం మళ్లీ ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
నేడు రాత్రి 10 వరకు కార్యక్రమాలు
* యాగానికి రానున్న చినజీయర్ స్వామి
సాక్షి, హైదరాబాద్: అయుత చండీయాగంలో భాగంగా మూడో రోజైన శుక్రవారం రాత్రి 10 గంటల వరకు ఆధ్యాత్మిక కార్యక్రమాలు కొనసాగనున్నాయి. భక్తులు ఉదయం నుంచి రాత్రి 10 గంటల వరకు యాగశాలను సందర్శించే అవకాశం ఉంది. శుక్రవారం నాటి సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా రాత్రి అన్నమయ్య భావనా వాహిణి వ్యవస్థాపకురాలు శోభారాజ్ అన్నమయ్య కీర్తనలు ఆలపిస్తారు.
త్రిదండి శ్రీమన్నారాయణ చిన జీయర్ స్వామి శుక్రవారం చండీయాగానికి హాజరవనున్నారు. మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావు, ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్‌రావు, ఏపీ శాసన మండలి చైర్మన్ చక్రపాణి తదితర ప్రముఖులు చండీయాగంలో పాల్గొననున్నారు.