మూడోరోజుకు చేరిన అయుత చండీయాగం
ఎర్రవల్లి: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన అయుత చండీయాగం మూడోరోజు కొనసాగుతోంది. శుక్రవారం ఉదయం గురుప్రార్ధనతో మూడోరోజు అయుత చండీ యాగం ప్రారంభమైంది. వేద మంత్రాల మధ్య పూజలు ప్రారంభమయ్యాయి. శ్వేత వర్ణ దుస్తుల్లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ యాగస్థలికి చేరుకున్నారు.
గురు ప్రార్థనతో ప్రారంభమైన చండీయాగం, గోపూజ, త్రిసహస్ర చండీ పారాయణములు, నవార్ణ పూజ, నవగ్రహ హోమం, తదితరాలతో పాటు మహా మంగళహారతి నిర్వహిస్తున్నారు. మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్.విద్యాసాగర్ యాగాన్ని తిలకించేందుకు వచ్చారు. ఆయనకు కేసీఆర్ సాదరంగా ఆహ్వానం పలికారు.
మరోవైపు ఈ చండీయాగానికి వీఐపీల నుంచి సామాన్య ప్రజలు, భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఇవాళ రాత్రి 10 గంటల వరకూ ఆధ్యాత్మిక కార్యక్రమాలు కొనసాగనున్నాయి. భక్తులు ఉదయం నుంచి రాత్రి పది గంటల వరకూ యాగశాలను సందర్శించే అవకాశం ఉంది. నేటి సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా అన్నమయ్య భావనా వాహిణి వ్యవస్థాపకురాలు శోభారాజ్ అన్నమయ్య కీర్తనలు ఆలపిస్తారు. త్రిదండి శ్రీమన్నారాయణ చిన జీయర్ స్వామి, ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు, ఏపీ శాసనమండలి చైర్మన్ చక్రపాణి తదితర ప్రముఖలు ఈ చండీయాగంలో పాల్గొంటారు.
ఇక గజ్వేల్ నియోజకవర్గంలోని ములుగు, వర్గల్, తూప్రాన్, కొండపాక, జగదేవ్పూర్, గజ్వేల్ మండలాలతో పాటు రంగారెడ్డి, హైదరాబాద్, నల్లగొండ, వరంగల్ తదితర జిల్లాల నుంచి ప్రజలు విచ్చేస్తున్నారు. ఈ సందర్భంగా రాజీవ్ రహదారితో పాటు జగదేవ్పూర్-నల్లగొండ ప్రధాన మార్గం సైతం రద్దీగా మారింది. దీంతో పోలీసులు ట్రాఫిక్ క్రమబద్దీకరణకు చర్యలు తీసుకుంటున్నారు.