* 1.50 లక్షల మంది రాక.. అందులో 80 వేల మంది మహిళలే
* పోలీసుల ఓవరాక్షన్‌తో ఇబ్బందులు పడుతున్న సామాన్యులు
* కుంకుమార్చన మండపం వద్ద తొక్కిసలాట, సొమ్మసిల్లిన భక్తుడు
* భోజనశాల వద్ద కూడా తోపులాట
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: వరుసగా నాలుగు రోజులు సెలవులు రావడంతో అయుత చండీయాగానికి గురువారం భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు. 40 వేల వాహనాల్లో 1.50 లక్షల మంది భక్తులు వచ్చినట్లుగా అధికారులు అంచనా వేస్తున్నారు.
వచ్చే రెండ్రోజులు కూడా భక్తుల తాకిడి ఉండవచ్చని భావిస్తున్నారు. యాగశాల ప్రాంగణంలో పోలీసుల అత్యుత్సాహం సామాన్య ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. వీఐపీలకు రెడ్ కార్పెట్ పరుస్తున్న పోలీసులు సామాన్య భక్తులను చిన్నచూపు చూస్తున్నారు. వీవీఐపీ గేటు వద్ద ఉన్న పోలీసు అధికారులు తమకు పరిచయం ఉన్న వారినే వీవీఐపీగా గుర్తించడం విమర్శలకు తావిస్తోంది. ఎమ్మెల్సీ, జిల్లా పరిషత్ చైర్మన్ స్థాయి ప్రజాప్రతినిధులను పక్కన పెట్టారు.
మెదక్ జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ రాజమణి మురళీయాదవ్ సాధారణ భక్తులతో పాటే చండీయాగాన్ని వీక్షించారు. ఆమె జిల్లా పరిషత్ చైర్మన్ అని స్థానిక నేతలు పోలీసులకు సర్దిచెప్పే ప్రయత్నం చేసినా.. వినిపించుకోకుండా ఆమెను సాధారణ గ్యాలరీలోకి పంపించారు. ఒక్కో వీఐపీని దగ్గరుండి మరీ మండపం వద్దకు తీసుకు వెళ్తున్న పోలీసులు.. సాధారణ భక్తులను మాత్రం గాలికి వదిలేశారు. క్యూలైన్ ద్వారా భక్తులు మండపానికి చేరుకోవడానికి గంటల తరబడి సమయం పట్టింది. కుంకుమార్చన మండపం సమీపంలో స్వల్పంగా తొక్కిసలాట జరిగింది.
కొందరు మహిళలు గాయపడ్డారు. ఈ తొక్కిసలాటలో హైదరాబాద్‌కు చెందిన ఓ భక్తుడు కిందపడి సొమ్మసిల్లిపోవడంతో 108లో ఆసుపత్రికి తరలించారు. యాగం పూర్తి కాగానే భక్తులందరూ భోజనశాల వైపు ఒకేసారి వెళ్లడంతో అక్కడా తొక్కిసలాట జరిగింది. లక్ష మందికిపైగా భక్తులు తరలిరావడంతో భోజనం వడ్డించే వారు చేతులెత్తేశారు. మొత్తం లక్షన్నర మంది భక్తుల్లో.. 80 వేల మందికిపైగా మహిళలే ఉన్నారు. కుంకుమార్చనలో పాల్గొనడానికి 10 వేల మందికిపైగా మహిళలు రాగా కేవలం 5 వేల మందికే అవకాశం దొరికింది.
పోటెత్తిన భక్తజనం
Published Fri, Dec 25 2015 3:01 AM | Last Updated on Wed, Aug 15 2018 9:30 PM
Advertisement
Advertisement