ఎర్రవల్లిలో వేదఘోష
* అంగరంగ వైభవంగా రెండోరోజూ అయుత చండీయాగం
* గులాబీ వర్ణ వస్త్రధారణతో కార్యక్రమాలు నిర్వహించిన రుత్విక్కులు
* 22 వందల సప్తశతి పారాయణాలు, 33 లక్షల చండీ నవార్ణ మంత్ర జపాలు
* భక్తిశ్రద్ధలతో పూజలు చేసిన సీఎం కేసీఆర్ దంపతులు
* గౌరీదేవీ కుంకుమార్చనలో భారీగా పాల్గొన్న మహిళలు
* హాజరైన కేంద్రమంత్రులు వెంకయ్య, దత్తాత్రేయ, సుప్రీం జడ్జి జస్టిస్ చలమేశ్వర్
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ఎర్రవల్లి రెండోరోజూ వేదఘోషతో మార్మోగింది. పారాయణాలు, జపాలు, వేద మంత్రోచ్ఛరణలతో యాగక్షేత్రం హోరెత్తింది. ఆసాంతం ఆధ్యాత్మిక శోభను పంచింది.
భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. విశ్వమానవ శ్రేయస్సును కాంక్షిస్తూ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మెదక్ జిల్లా ఎర్రవల్లిలోని తన ఫాంహౌస్‌లో చేపట్టిన అయుత చండీయాగం గురువారం రెండోరోజుకు చేరింది. తొలిరోజు మాదిరే శృంగేరి శారదా పీఠం శిష్యులు పురాణం మహేశ్వర శర్మ, ఫణి శశాంక శర్మ, గోపీకృష్ణశర్మ బృందం పంచగవ్యప్రాశన, గోమూత్ర, గోమయ, గోఘృత, గోదధి, గోక్షీరము కలిపి ప్రాశనములు చేసి యాగశాల మంటపాన్ని శుద్ధి చేసి, విఘ్నేశ్వర పూజలు చేశారు. ఉదయం 9.20 గంటలకు సీఎం కేసీఆర్ దంపతులు యాగశాలకు చేరుకోవడంతో రెండో రోజు క్రతువు మొదలైంది.
‘శ్రీ సచ్చిదానంద.. చంద్రశేఖర భారతీ తీర్థ.. విద్యాతీర్థగురుంబాజే.. వందే గురు పరంపర.. సాష్టాంగ ప్రమాణ సమర్పయామి’ అంటూ యాగ నిర్వాహకులు ముఖ్యమంత్రి కేసీఆర్‌తో సహా రుత్విక్కులంతా గురు ప్రార్థన చేసి యాగం మొదలు పెట్టారు. కేసీఆర్ యాగశాల చుట్టూ రెండు ప్రదక్షిణలు చేశారు. రుత్విక్కులు హోమగుండం చుట్టూ కూర్చుని పారాయణ జపాలు ప్రారంభించారు. కుటుంబ సభ్యులతో కలిసి కేసీఆర్ దంపతులు.. గోపూజ, మహాగణపతి, శతుషష్టి యోగినీ బలి, రాజశ్యామల పురశ్ఛరణ చతుర్వేద యాగం, కుమారి, సుహాసిని, మహా సాకం, ఉక్తదేవతా జపములు తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
11.15కు దుర్గామాతకు మహా మంగళ హారతి సమర్పించారు. 200 మంది రుత్విక్కులతో మహా రుద్రయాగం యాగశాలలోని మరో మండపంలో 200 మంది రుత్విక్కులు మహారుద్రయాగం, కుమారస్వామి పూజ నిర్వహించారు. మరో మండపంలో ముత్తయిదువలు లలితా సహస్ర నామాలతో గౌరీదేవీకి కుంకుమార్చన చేశారు. అర్చన కోసం వినియోగిస్తున్న కుంకుమను శృంగేరి శారదా పీఠం నుంచి తీసుకువచ్చారు. ఈ పూజలో హరీశ్‌రావు, కేటీఆర్ సతీమణులు పాల్గొన్నారు.
అర్చనలో రోజుకు 3 క్వింటాళ్ల కుంకుమ వాడుతున్నట్లు బ్రాహ్మణులు తెలిపారు. యాగ కార్యక్రమంలో పురాణం మహేశ్వర శర్మ, ఫణి శశాంక శర్మ, పట్లూరు మాణిక్య సోమయాజులు, శృంగేరీ భావి పీఠాధిపతి విధుశేఖర భారతీ మహాస్వామి, ఆయన తండ్రి కుప్ప శివసుబ్రహ్మణ్యం, కుప్పగోపాల వాజ్‌పేయి తదితరులు కేసీఆర్‌ను ఆశీర్వదించారు.
ప్రముఖుల రాక..
సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చలమేశ్వర్, హెటిరో డ్రగ్స్ చైర్మన్ పార్థసారథి, డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మంత్రులు టి.హరీశ్‌రావు, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి, ఎంపీలు కొత్త ప్రభాకర్‌రెడ్డి, బాల్క సుమన్, కేశవరావు, డీజీపీ అనురాగ్‌శర్మ, ఐజీ నవీన్‌చంద్, ఎమ్మెల్యేలు సోలిపేట రామలింగారెడ్డి, నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్, మెదక్ జెడ్పీ చైర్‌పర్సన్ రాజమణి మురళీయాదవ్ తదితరులు యాగానికి తరలివచ్చారు.
గులాబీ వర్ణ వస్త్రాల్లో
యాగం రెండోరోజు రుత్విక్కులు గులాబీ వర్ణ వస్త్రాలను ధారణ చేసి 100 హోమ గుండాల చుట్టూ 1,100 మంది ఆశీనులయ్యారు. అనంతరం ఏకోత్తర వృద్ధి సంప్రదాయంతో ఒక్కొక్కరు రెండు సప్తశతి పారాయణాలు, 3 వేల చండీ నవార్ణ మంత్ర జపాలు చేశారు. రెండోరోజు యాగంలో రుత్విక్కులంతా కలిసి 22 వందల సప్తశతి పారాయణాలు, 33 లక్షల చండీ నవార్ణ మంత్ర జపాలు చేశారు.
11:40 గంటలకు సర్వభాష రుత్విక్కులు ఏకకంఠంతో చండీయాగ పారాయణాలు ప్రారంభించి నిర్విరామంగా మధ్యాహ్నం 1:20 వరకు కొనసాగించారు. మధ్యాహ్నం 12.12 గంటలకు కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, బండారు దత్తాత్రేయ యాగస్థలికి వచ్చారు. వారికి పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు.
చండీయాగం.. క్షణక్షణం
ఉదయం 9:26: యాగస్థలికి చేరుకున్న కేసీఆర్ దంపతులు
10:11: యాగశాల చుట్టూ ప్రదక్షిణలు
10:57: దుర్గామాతకు అఖండ మంగళ హారతి
11:20: కుంకుమార్చనలో దంపతి, సుహాసిని పూజలు
11:40: ఏక కంఠంతో పారాయణాలు ప్రారంభించిన 1,100 మంది రుత్విక్కులు
మధ్యాహ్నం 12:12: యాగస్థలికి వచ్చిన కేంద్ర మంత్రులు వెంకయ్య, బండారు దత్తాత్రేయ
1:20: 2,200 పారాయణాలు, 33 లక్షల నవార్ణ మంత్ర జపాలు పూర్తిచేసిన రుత్విక్కులు
1:40: రుత్విక్కులకు భోజన విరామం
2:10: భోజన విరామానికి వెళ్లిన కేసీఆర్
4:55: యాగశాలలోకి పునఃప్రవేశం
రాత్రి 8:30 గంటలు: సాయంత్రం నుంచి కొనసాగిన ప్రవచనాలు
- సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి