గ్రామజ్యోతి ఎలా నడుస్తోంది?
ఎర్రవల్లి గ్రామస్తులతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరా
* బాగా చేయండి.. నేనే వస్తా.. శ్రమదానం చేస్తా
జగదేవ్‌పూర్: గ్రామజ్యోతి కార్యక్రమం ఎలా నడుస్తోందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆరా తీశారు. బుధవారం సాయంత్రం హైదరాబాద్ నుంచి ఆయన తన కాన్వాయ్ ద్వారా గణేశ్‌పల్లి, నర్సన్నపేట, ఎర్రవల్లి గ్రామాల మీదుగా ఫాంహౌస్‌కు చేరుకున్నారు. ఎర్రవల్లి మీదుగా వెళ్తున్న క్రమంలో స్థానిక వాటర్‌ట్యాంకు దగ్గర గ్రామ సర్పంచ్ భాగ్యబాల్‌రాజు, గ్రామ ప్రజలు గుమికూడటంతో అక్కడ ముఖ్యమంత్రి ఐదు నిమిషాల పాటు ఆగారు. గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై ఆరా తీశారు.
‘మీ ఊర్లో గ్రామ జ్యోతి ఎలా నడుస్తోంది... బాగా చేయండి.. నేనూ పాల్గొని శ్రమదానం చేస్తా.. గ్రామజ్యోతిని బ్రహ్మాండంగా నిర్వహిద్దాం.. గురువారం లేదా ఆదివారం ప్రతి వాడలో పర్యటిస్తా’ అని కేసీఆర్ ఉత్సాహపరిచారు. అనంతరం ముఖ్యమంత్రి తన కాన్వాయ్ ద్వారా గ్రామ సమీపంలోని ఫాంహౌస్‌కు చేరుకున్నారు. ఆయనకు కలెక్టర్ రోనాల్డ్‌రాస్, గడా అధికారి హన్మంతరావు స్వాగతం పలికారు. ఫాంహౌస్‌కు చేరుకోగానే జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులపై సీఎం ఆరా తీసినట్లు తెలిసింది. తన క్షేత్రంలో జరుగుతున్న వ్యవసాయ పనుల గురించి అడిగి తెలుసుకున్నట్లు సమాచారం.
నేడు మూడు గ్రామాల్లో పర్యటన!
ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం మండలంలోని ఎర్రవల్లి, తిగుల్, మునిగడప గ్రామాల్లో పర్యటించే అవకాశాలు ఉన్నట్టు సమాచారం. ఈ క్రమంలో ఎర్రవల్లిలో గడా అధికారి హన్మంతరావు బుధవారం వివిధ పనులను దగ్గరుండి మరీ పర్యవేక్షించారు. తిగుల్ గ్రామంలో కూడా పర్యటించనున్నారని తెలిసింది. దీంతో గ్రామ సర్పంచ్ సుధాకర్‌రెడ్డి.. తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. ఉదయం ఏడు నుంచి మధ్యాహ్నం ఒంటి గంట మధ్యలో సీఎం ఎప్పుడైనా గ్రామానికి వచ్చే అవకాశం ఉందని తెలిసింది. మునిగడపలో సైతం పర్యటిస్తారని పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. మొత్తానికి ఆదివారం వరకు సీఎం ఫాంహౌస్‌లో ఉంటారని సమాచారం.