ఎర్రవల్లి పనులపై సీఎం కేసీఆర్ ఆరా..
శనివారం సాయంత్రమే హైదరాబాద్‌కు పయనం
జగదేవ్‌పూర్: గత రెండు రోజులుగా ఎర్రవల్లిలో పర్యటించిన సీఎం కేసీఆర్ మూడోరోజైన శనివారం మాత్రం ఫాంహౌస్‌లోనే ఉన్నారు. ఉదయం వ్యవసాయక్షేత్రంలో తిరిగి పంటలను పరిశీలించిన ఆయన.. అక్కడి నుంచే ఎర్రవల్లిలో జరుగుతున్న పనులపై ఆరా తీసినట్లు తెలిసింది. ఆ పనులను తొందరగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను సీఎం ఆదేశించినట్లు సమాచారం. కాగా, సీఎం కేసీఆర్ తిరిగి శనివారం సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్‌కు వెళ్లారు. సీఎం గ్రామం మీదుగా వెళ్తారనే సమాచారంతో నర్సన్నపేట గ్రామస్తులు కొందరు రోడ్డుపై నిలబడ్డారు.
సీఎం.. వారి వద్ద తన కాన్వాయ్ ఆపించి, వారితో మాట్లాడారు. గజ్వేల్ పట్టణానికి చెందిన వ్యాపారి దత్తాద్రి.. కేసీఆర్‌కు వినతి పత్రం అందించారు. గజ్వేల్ పట్టణంలో జూనియర్ కళాశాల ముందు భాగంలో డబ్బాలను పెట్టుకొని 35 ఏళ్లుగా జీవిస్తున్నామని, వాటిని తొలగిస్తే ఉపాధి కోల్పోతామని విన్నవించారు. అలాగే వరంగల్‌కు చెందిన మరో వ్యక్తి వినతిపత్రం ఇవ్వగానే, అతనిని తన కాన్వాయ్‌లో ఎక్కించుకొని వెళ్లారు. కాగా సీఎంను కలవడానికి కొందరు బీడీ కార్మికులు రాగా, వారిని పోలీసులు ఆపడంతో కలుసుకోలేకపోయారు.