ఆలుగడ్డ సాగు ఎలా ఉంది? | CM KCR Meets Farmers At Erravalli Farmhouse | Sakshi
Sakshi News home page

ఆలుగడ్డ సాగు ఎలా ఉంది?

Published Sun, Jun 7 2020 4:34 AM | Last Updated on Sun, Jun 7 2020 4:34 AM

CM KCR Meets Farmers At Erravalli Farmhouse - Sakshi

జహీరాబాద్‌: ‘ఆలుగడ్డ విత్తనం ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు.. పంట దిగుబడులు ఎలా ఉన్నాయి. గిట్టుబాటు అవుతుందా?’అని సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌ ప్రాంతానికి చెందిన కొందరు రైతులను ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రశ్నించారు. ఆలుగడ్డ, అల్లం పంటల సాగు విధానం, రైతులు సాధిస్తున్న దిగుబడులు, మార్కెటింగ్‌ విధానం గురించి ఆయన ఆరా తీసినట్లు తెలిసింది. శుక్రవారం సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి ఫాంహౌస్‌లో కొందరు రైతులు కేసీఆర్‌ను కలిశారు. దాదాపు నాలుగు గంటల పాటు వారు సీఎంతో గడిపారు. జహీరాబాద్‌ మండలం రంజోల్‌ గ్రామానికి చెందిన రైతులు వెంకట్‌రాంరెడ్డి, నాగేశ్వర్‌రెడ్డి, బద్ది రామ్‌రెడ్డి, బద్రేశ్, కోహీర్‌ మండలం పైడిగుమ్మల్‌ గ్రామానికి చెందిన రైతు వై.జయసింహారెడ్డి సీఎంను కలసిన వారిలో ఉన్నారు.

అయితే.. ముఖ్యమంత్రే స్వయంగా వారిని పిలిపించుకున్నట్లు తెలిసింది. రైతులతో పాటు సంగారెడ్డి జిల్లా ఉద్యానవన అధికారి సునీత, జహీరాబాద్‌ అధికారి అనూషలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జహీరాబాద్‌ ప్రాం తంలో సాగవుతున్న పంటల గురించి ముఖ్యమంత్రి రైతులను అడిగి తెలుసుకున్నారు. ఆలుగడ్డ సాగుపై ఆరా తీసిన కేసీఆర్‌.. ఈ పంట మరింత విస్తరించాల్సిన ఆవసరం ఉందని అభిప్రాయపడినట్లు తెలిసింది. గత సంవత్సరం తగినంత మేర వర్షాలు లేక ఆలుగడ్డ పంట సాగు భారీగా పడిపోయిందని రైతులు సీఎంకు వివరించారు. కాగా, ఆలుగడ్డ, అల్లం పంటలను మార్కెట్‌కు తరలిస్తే కమీషన్‌ ఏజెంట్లు 10 శాతం మేర కమీషన్‌ వసూలు చేస్తున్నారని రైతులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దీనికి ఆయన స్పందిస్తూ.. రైతుల ఇబ్బందులను దూరం చేసేందుకే క్లస్టర్లను ఏర్పాటు చేస్తున్నామని, దీంతో రైతులకు రానున్న రోజుల్లో తగిన మేలు కలుగుతుందని చెప్పినట్లు తెలిసింది.

రెండేళ్లలో రైతుల కష్టాలకు చెక్‌
రైతులను దళారీ వ్యవస్థ నుంచి బయట పడేసేందుకు వీలుగా క్లస్టర్‌ వ్యవస్థ పని చేస్తుందని, రానున్న రెండేళ్లలో రైతుల కష్టాలు తీరుతాయని ముఖ్యమంత్రి చెప్పినట్లు సమాచారం. రైతులు పండించిన పంటను నేరుగా రైతుల వద్దకే వచ్చి కొనుగోలు చేసుకుని వెళ్లే పరిస్థితి రానున్న రోజుల్లో వస్తుందని చెప్పినట్లు తెలిసింది. కొన్ని సందర్భాల్లో ఆలుగడ్డ పంట చేతికి అందివచ్చినప్పుడు ధరలు ఉండడం లేదని, తమ ప్రాంతంలో కోల్డ్‌ స్టోరేజీ ఏర్పాటు చేస్తే పంటను నిల్వ చేసుకునే అవకాశం ఉంటుందని రైతులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు.

తెలంగాణ వ్యాప్తంగా కోల్డ్‌ స్టోరేజీల సౌకర్యం కల్పించాల్సి ఉందని, ఈ దిశలో తమ ప్రభుత్వం తగిన చర్యలు చేపడుతుందని సీఎం పేర్కొన్నారు. జహీరాబాద్‌ ప్రాంతంలో నీటి వసతులు లేవని, దీంతో తగిన మేర పంటలను సాగుచేయలేకపోతున్నట్లు రైతులు వివరించారు. ఇందుకు సీఎం స్పందిస్తూ.. సింగూరు నుంచి జహీరాబాద్‌తో పాటు జిల్లాలోని పలు నియోజకవర్గాలకు సాగునీటిని అందించే ప్రయత్నం జరుగుతోందని చెప్పారు. రాష్ట్రంలో వ్యవసాయరంగాన్ని అన్నివిధాలుగా అభివృద్ధి చేయడంతోపాటు సాగునీటి వసతులను కల్పించేందుకు ప్రాజెక్టుల నిర్మాణం చేపడుతున్నట్లు సీఎం రైతులతో చెప్పారు.

చెరకు పంట సాగుపై ఆరా 
కాగా, చెరకు పంట సాగు ఏ మేరకు ఉంది.., ఎంత వరకు దిగుబడులు వస్తున్నాయని కేసీఆర్‌ రైతులను అడిగి తెలుసుకున్నారు. ఎకరాకు సుమారుగా 40 నుంచి 50 టన్నుల మేర పంట దిగుబడి వస్తున్నట్లు వారు వివరించారు. జిల్లాలో ఏయే పంటలు ఎంత విస్తీర్ణంలో సాగవుతున్నా యనే విషయమై సీఎం ఉద్యానవన శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అరటి, బొప్పాయి, కూరగాయల సాగుపై ఆయన ఆరా తీశారు. ఈ సందర్భంగా తాము పండించిన అల్లం, పసుపు పంటను రైతులు సీఎం కేసీఆర్‌కు అందజేశారు. రైతులు పండించిన అల్లం పంట నాణ్యత బాగా ఉందని సీఎం మెచ్చుకున్నట్లు సమాచారం.  

సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని ఫాంహౌస్‌లో సీఎం కేసీఆర్‌ను కలసిన జహీరాబాద్‌ ప్రాంత రైతులు  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement