జగదేవ్‌పూర్ (మెదక్) : ముఖ్యమంత్రి కేసీఆర్ దత్తత గ్రామమైన మెదక్ జిల్లా జగదేవ్‌పూర్ మండలం ఎర్రవల్లిని తెలంగాణ జిల్లాలకు చెందిన ట్రెయినీ ఐఏఎస్‌లు గురువారం సందర్శించారు. ఇక్కడ నిర్మించిన డబుల్ బెడ్‌రూమ్ నమూనా ఇళ్లను పరిశీలించారు. ట్రెయినీ ఐఏఎస్‌లు సిక్తాపట్నాయక్ (నల్లగొండ), సందీప్‌కుమార్‌జా (వరంగల్), గౌతమ్ (కరీంనగర్), ముసరఫ్‌అలీ ఫారూక్ (ఖమ్మం), కృష్ణ ఆదిత్య (మెదక్)లు ఎర్రవల్లిలో నమూనా కోసం నిర్మించిన రెండు ఇళ్లలో కలియదిరిగారు. నిర్మించిన తీరు, కల్పించిన వసతులను తెలుసుకున్నారు. అదే గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి పనులనూ పరిశీలించారు.
అభివృద్ధి పనులపై స్థానికుల అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణం అత్యద్భుతమని కొనియాడారు. ఈ పథకం దేశంలో నంబర్‌వన్‌గా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు. కేసీఆర్ కలలుగన్న బంగారు తెలంగాణ వైపు అడుగులు వేసే దిశగా ఈ ఇళ్ల నిర్మాణం జరిగిందన్నారు. రోజూ రాష్ట్రంలో ఏదో ఒక జిల్లాలో పర్యటిస్తున్నామని చెప్పారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలు కూడా అద్భుతమని కొనియాడారు.