keshampet
-
భయ్యా.. ఇదేమయ్యా! నిన్న బీజేపీ, నేడు కాంగ్రెస్‌లో
సాక్షి, రంగారెడ్డి: కేశంపేట మండల కేంద్రంలోని కొనాయపల్లి సర్పంచ్ భయ్యా మల్లేశ్ తీరుపై స్థానికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నిర్వహించిన పాదయాత్రలో సర్పంచ్ పాల్గొన్నారు. అంతేకాకుండా కాషాయ జెండా పట్టుకుని పార్టీకి అనుకూలంగా ప్రచారం చేశారు.. శనివారం జరిగిన కాంగ్రెస్‌పార్టీ రచ్చబండలో సైతం సర్పంచ్ పాల్గొనడం గమనార్హం. కాంగ్రెస్ పార్టీ కండువా వేసుకొని పార్టీ అధికారంలోకి రావాలంటూ ప్రసగించారు. పదిహేను రోజుల వ్యవధిలోనే పార్టీలు మారడంతో గ్రామస్తులు అయోమయానికి గురవుతున్నారు. చదవండి: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఫ్లైబిగ్ విమానానికి తప్పిన ప్రమాదం. -
‘బుల్లెట్టు బండి’ పాట 22 రోజుల కష్టం: రచయిత లక్ష్మణ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ యాసలో వచ్చిన వినసొంపైన పాట ‘బుల్లెట్టు బండి’ సోషల్ మీడియాను షేక్ చేసింది. ఆ పాటకు ఓ నవ వధువు డ్యాన్స్ చేసి భర్తను సర్ప్రైజ్ చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆ పాట జనాల్లో మార్మోగుతోంది. ఏ వేడుక జరిగినా.. ఏ శుభకార్యం జరిగినా ‘బుల్లెట్టు బండి’ పాట లేనిది జరగడం లేదు. అంతగా ట్రెండింగ్ అయిన ఆ పాటను రాసిన రచయిత గురించి సర్వత్రా చర్చ జరుగుతోంది. పాట రాసింది లక్ష్మణ్ అని తెలుసు కానీ.. ఆయన ఎక్కడి వ్యక్తో... ఏం చేస్తుంటాడో తెలుసుకోండి. చదవండి: ‘బుల్లెట్టు బండి’ వధువుకు బంపర్ ఆఫర్ పాటల రచయిత కాటికె లక్ష్మణ్ స్వస్థలం రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం నిర్దవెల్లి గ్రామం. వీరిది పేద కుటుంబం. లక్ష్మణ్‌తో పాటు రామ్ కూడా జన్మించాడు. అంటే వీరిద్దరూ కవల పిల్లలు. వీరిద్దరినీ రామ్‌లక్ష్మణ్‌గా పేర్కొంటారు. రామ్ గాయకుడిగా గుర్తింపు పొందగా లక్ష్మణ్ రచయితగా రాణిస్తున్నారు. వీరిద్దరూ కలిసి జానపద పాటల ఆల్బమ్స్ చేస్తూ సోషల్ మీడియాలో గుర్తింపు పొందారు. తెలంగాణ యాసలో ఎంతో ఆకట్టుకునేలా రాయడం లక్ష్మణ్ ప్రత్యేకం. సినిమా రంగంపై ఆసక్తితో రామ్ లక్ష్మణ్ హైదరాబాద్‌కు వచ్చారు. ఉపాధి కోసం ఎన్నో ప్రైవేటు ఆల్బమ్స్, జానపద పాటలు పాడారు. లక్ష్మణ్ ఇప్పటివరకు దాదాపు 300 వరకు పాటలు రాశాడు. ఆ పాటలను రామ్ పాడాడు. ఆ పాటలు కొన్ని సినిమాల్లో కూడా వచ్చాయి. ‘నువ్వంటే పిచ్చి, గాయపడిన మనసు’ ఆల్బమ్స్‌తో ఈ సోదరులు ఎంతో గుర్తింపు పొందారు. అచ్చమైన పల్లె భాషలో రాయాలని నిర్ణయించుకున్నట్లు లక్ష్మణ్ తెలిపారు. అయితే ఒకరోజు ప్రముఖ గాయని మోహన భోగరాజు లక్ష్మణ్‌కు ఓ పాట రాయమని అడిగింది. అడిగిన కొన్ని రోజుల్లోనే ‘బుల్లెట్టు బండి’ రాసి ఇచ్చాడు. ఆ పాటను మోహన భోగరాజు పాడి యూట్యూబ్‌లో విడుదల చేయడంతో మంచి గుర్తింపు వచ్చింది. ఆ పాటకు ఓ నవ వధువు డ్యాన్స్‌తో సోషల్ మీడియానే ట్రెండింగ్‌లోకి వచ్చింది. చదవండి: ఒక్క డ్యాన్స్‌తో సెలబ్రిటీగా ‘బుల్లెట్టు బండి’ వధువు ఈ పాట తర్వాత ఆ ఇద్దరి సోదరులకు భారీగా అవకాశాలు వచ్చాయంట. మున్ముందు కూడా మరిన్ని మంచి పాటలతో ప్రేక్షకుల ముందుకు రావాలని ఆశిద్దాం. 8వ తరగతి నుంచి పాటలు రాస్తున్నాడు. చంద్రబోస్, గోరటి వెంకన్న, అందెశ్రీ పాటలు వింటూ అభిరుచి పెంచుకున్నా. ఈ పాటతో 22 రోజుల్లో ఈ పాట రాసినట్లు లక్ష్మణ్ చెప్పుకొచ్చాడు. తాను చూసిన అక్కాచెల్లెళ్లను చూస్తూ ఆ పాట రాసినట్లు తెలిపారు. ఆ నవ వధువుకు శుభకాంక్షలు తెలిపాడు. -
28న సీఎం దత్త పుత్రిక ప్రత్యూష వివాహం
సాక్షి, రంగారెడ్డి (కేశంపేట): ముఖ్యమంత్రి కేసీఆర్ దత్త పుత్రిక ప్రత్యూష వివాహం ఈ నెల 28న రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం పాటిగడ్డ గ్రామం లూర్దు మాత దేవాలయంలో జరగనుంది. ఉడుముల జైన్ మేరీ, మర్రెడ్డి దంపతుల కుమారుడు చరణ్‌రెడ్డితో ప్రత్యూష వివాహం జరగనున్నట్లు గ్రామస్తులు తెలిపారు. పినతల్లి చేతుల్లో వేధింపులకు గురై వార్తల్లో నిలిచిన ప్రత్యూషను కేసీఆర్ గతంలో దత్తత తీసుకున్నారు. -
కేజీబీవీ విద్యార్థులకు అస్వస్థత
సాక్షి, కేశంపేట : పాడైన కూరగాయలతో చేసిన వంటల కారణంగా ఇద్దరు విద్యార్థులు అస్వస్థతకు గురై ఆస్పత్రి పాలయ్యారు. పాటిగడ్డలోని కస్తూర్బా పాఠశాలలో శుక్రవారం ఈ సంఘటన చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. మండల పరిధిలోని పాటిగడ్డ కస్తూర్బా పాఠశాలలో 262 మంది చదువుకుంటున్నారు. వీరికి నిత్యం మెనూ ప్రకారం భోజనం అందించాల్సి ఉండగా.. నిర్వాహకులు మాత్రం తమ ఇష్టానుసారం వండిపెడుతన్నారు. రోజుల తరబడి నిల్వ ఉంచిన కూరగాయలతో వంటలు చేస్తున్నారు. ఈ భోజనం తిన్న బాలికలు అస్వస్థతకు గురవుతున్నారు. దీనికి తోడు స్కూల్లో అపరిశుభ్ర వాతావరణం నెలకొంది. వాష్‌బేషిన్ల వద్ద నాచు పేరుకుపోయింది. మూత్రశాలలు కంపు కొడుతున్నాయి. పాఠశాల లోపల పరిసరాలు అపరిశుభ్రంగా ఉన్నాయి. ఈ విషయమై కేజీబీవీ ప్రత్యేక అధికారి గౌసియాను అడగగా.. ఉదయం విద్యార్థినులు అస్వస్థతకు గురికావడంతో ఆయాలు వారిని ఆస్పత్రికి తీసుకెళ్లారని చెప్పారు. దీంతో మూత్రశాలలను శుభ్రం చేయలేదన్నారు. నాయకుల సందర్శన.. విద్యార్థులు ఆస్పత్రిలో చేరారన్న విషయం తెలుసుకున్న పలు కుల సంఘాల నాయకులు కేజీబీవీని సందర్శించారు. వంటలు, కిచెన్, బాత్రూంలను పరిశీలించారు. పలువురు విద్యార్థినులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. మెనూ పాటించడం లేదని, బాత్రూంలను శుభ్రం చేయడం లేదని విద్యార్థులు వీరికి వివరించారు. ఇదిలా ఉండగా బాలికలకు స్వచ్ఛమైన తాగునీటిని అందించేందుకు ప్రభుత్వం అందించిన వాటర్ ఫిల్టర్ నిరుపయోగంగా ఉంది. నిత్యం కేశంపేట, సంతాపూర్ నుంచి ఫిల్టర్ వాటర్ తెస్తున్నారు. -
రెవెన్యూ రికార్డులు మాయం!
సాక్షి, కేశంపేట: తహసీల్దార్ కార్యాలయంలో ఎంతో భద్రంగా ఉండాల్సిన రెవెన్యూ రికార్డులు మాయమయ్యాయి. భూములకు సంబంధించిన ఫైళ్లు కనిపించకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇటీవల అవినీతి కార్యకలాపాలతో వార్తల్లోకెక్కిన కేశంపేట తహసీల్దార్ కార్యాలయంలో ప్రస్తుతం కీలకమైన రికార్డులకు రెక్కలు రావడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఉద్దేశపూర్వకంగా ఫైళ్లను ఎక్కడికైనా తరలించారా? లేక నామరూపాలు లేకుండా చేశారా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అదే జరిగితే దీని వెనుక ఉన్నదెవరు.. నడిపిస్తున్నవారెవరు? పైగా రికార్డులను మాయం చేయాల్సిన అవసరం ఏముంది? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. దీనికితోడు అధికారులు సైతం నోరు మెదపకపోవడం మరిన్ని సందేహాలను రేకెత్తిస్తోంది. మా రికార్డులు ఇవ్వండి మహాప్రభో అంటూ కార్యాలయం చుట్టూ అన్నదాతలు నిత్యం తిరుగుతున్నా అధికారుల్లో స్పందన లేదు. మూడేళ్ల రికార్డులు ఎక్కడ.. భూమి కొనుగోలు చేస్తే ఆ భూమికి సంబంధించి పట్టా మార్పిడి చేయాల్సి ఉంటుంది. సదరు భూమి రైతుకు ఎలా దక్కిందో తెలిపే పహాణీలు అవసరం. అదేవిధంగా వారసత్వంగా వచ్చిన భూమిని విరాసత్ చేసుకున్న వాటికి సంబంధించిన ఫైళ్లు రెవెన్యూ కార్యాలయాల్లో ఉంటాయి. రిజిస్ట్రేషన్ చేసుకున్న భూములను మ్యూటేషన్ చేసుకోవాలంటే ఆ భూమికి చెందిన పత్రాలు రెవెన్యూ కార్యాలయంలో లభ్యమవుతాయి. ఈ కీలకమైన రికార్డులను తహసీల్దార్ కార్యాలయంలో అధికారులు భద్రపరుస్తారు. అయితే అవి కేశంపేట తహసీల్దార్ కార్యాలయంలో కనిపించడం లేదు. 2016 తర్వాత జరిగిన భూ లావాదేవీలకు సంబంధించి విరాసత్, భూ పట్టా మార్పిడి మ్యూటేషన్ తదితర రికార్డుల జాడ తెలియడం లేదు. భూ పత్రాల నకళ్ల కోసం రైతులు కార్యాలయం చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. మీరే వెతుక్కోండి.. కేశంపేట మండల పరిధిలోని పాపిరెడ్డిగూడ గ్రామానికి చెందిన ఓ రైతు తనకు 2016లో ఇచ్చిన ప్రొసీడింగ్ జిరాక్స్ కావాలని అధికారులకు రెండు నెలల క్రితం వినతిపత్రం అందజేశాడు. ఇంతవరకు అధికారుల నుంచి జిరాక్స్ కాపీ అందకపోవడంతో వారిని నిలదీశాడు. మూడేళ్ల కాలానికి సంబంధించి రికార్డులు ఈ కార్యాలయంలో అందుబాటులో లేవని అధికారులు సమాధానమిచ్చారు. ‘నీకు ఓపిక ఉంటే.. ఆఫీస్‌లో నువ్వే వెతుక్కో’ అంటూ ఉచిత సలహా ఇచ్చారు. కాగా, ఈ విషయమై ఇన్చార్జి తహసీల్దార్ ఆంజనేయులు మాట్లాడుతూ.. 2016 సంవత్సరం నుంచి ఫైళ్లు కార్యాలయంలోనే ఉన్నాయి. ఎవరికైనా భూ రికార్డుల నకలు కావాలంటే వారికి అందిస్తాం’ అని చెప్పారు. విసుగు చెందిన రైతులు.. నిలదీస్తే ఫైళ్లు లేవని బాధ్యతారహితంగా అధికారులు పేర్కొంటుండటం గమనార్హం. ఇంటి దొంగలపై అనుమానాలు.. తమ తప్పులు ఎక్కడ వెలుగులోకి వస్తాయోనన్న భయంతో రెవెన్యూ అధికారులే రికార్డులు దాచిపెట్టారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల అవినీతి సొమ్ముతో ఏసీబీకి తహసీల్దార్ లావణ్య పట్టుబడిన తర్వాతే రికార్డులు మాయమవటం అందుకు బలాన్ని చేకూరుస్తోంది. ఆమెకు సహకరించిన ఉద్యోగులే ఈ పని చేసి ఉంటారా అనే చర్చజరుగుతోంది. పైగా 2016లో లావణ్య ఇక్కడ పోస్టింగ్ పొందారు. అంటే తహసీల్దార్‌గా బాధ్యతలు తీసుకున్నాక జరిగిన లావాదేవీలకు సంబంధించిన రికార్డులు మాత్రమే కార్యాలయంలో లేకపోవడంతో ఇంటి దొంగలపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. రైతుల నుంచి డబ్బులు దండుకుని నిబంధనలకు విరుద్ధంగా ఫైళ్లు కదిలించారన్న ఆరోపణలు ఆమెపై పెద్దఎత్తున వచ్చాయి. ఈ క్రమంలోనే తహసీల్దార్ కార్యాలయంలోని కొన్ని కీలక ఫైళ్లను ఏసీబీ అధికారులు విస్తృతంగా పరిశీలించారు. మళ్లీ ఏసీబీ నుంచి ఎటువంటి ముప్పయినా రావొచ్చన్న భయంతో రెవెన్యూ సిబ్బందే రికార్డులను తరలించి ఉంటారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
అదృశ్యమై.. హీరో ఫాంహౌస్‌లో అస్థిపంజరంలా తేలాడు
అన్నంటే అతడికి ప్రాణం.. ఒకరినొకరు విడిచి క్షణమైనా ఉండే వారు కాదు.. రక్తం పంచుకొని పుట్టిన అన్న అనారోగ్యానికి గురై మృతిచెందాడు.. అన్న లేని జీవితం వ్యర్థమని.. తాను కూడా ఇక తనువు చాలిస్తానంటూ లేఖ రాసి పెట్టిన ఓ యువకుడు.. నాలుగేళ్ల కిందట ఇంట్లో నుంచి వెళ్లిపోయి.. బుధవారం అస్థి పంజరమై కనిపించాడు. ఈ సంఘటన కేశంపేట మండలం పాపిరెడ్డిగూడలో చోటుచేసుకుంది. సాక్షి, కేశంపేట (షాద్‌నగర్): నాలుగేళ్ల క్రితం ఇంట్లో నుంచి వెళ్లిపోయిన వ్యక్తి బుధవారం అస్థిపంజరమై కనిపించాడు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ మండలంలోని పాపిరెడ్డిగూడలో వెలుగుచూసింది. పోలీసుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన చిన్న అంజయ్య, అంజమ్మ దంపతులకు హన్మంత్, రాజు, కుమార్, పాండు నలుగురు కుమారులు. వీరిలో చిన్న కుమారుడు పాండు (32) నాలుగేళ్ల కిందట ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. వీరికి ఫరూఖ్‌నగర్ మండలం వెలిజర్ల గ్రామ శివారులో కొంత వ్యవసాయ పొలం ఉంది. కుమార్, పాండు మధ్య అనుబంధం విడదీయలేనిది. అయితే నాలున్నరేళ్ల కిందట కుమార్‌కు వివాహమైంది. పెళ్లయిన కొద్ది నెలలకే అనారోగ్యంతో మృతిచెందాడు. దీంతో కుటుంబం తట్టుకోలేకపోయింది. ముఖ్యంగా పాండు తన అన్న మృతితో కుంగిపోయాడు. కుమార్ వైద్యం కోసం కుటుంబసభ్యులు ఉన్న భూమిని అమ్మేశాడు. ఆ అప్పును చిన్న కుమారుడు పాండు తరచూ కుటుంబసభ్యులతో చెప్పేవాడు. అయితే అప్పులు ఎంతకీ తీరే మార్గం కనిపించకపోవడంతో తప్పని పరిస్థితుల్లో కుటుంబసభ్యులు తమ భూమిని అమ్మేశారు. ప్రాణంగా ఇష్టపడే అన్న మృతిచెందడం.. ఇటు తనకు ఇష్టమైన వ్యవసాయ భూమిని విక్రయించడాన్ని తట్టుకోలేకపోయిన పాండు తాను చనిపోతున్నానంటూ లేఖ రాసి అదృశ్యమయ్యాడు. అమ్మంటే తనకు చాలా ఇష్టమని.. ఆమెను బాగా చూసుకోవాలని లేఖలో పేర్కొన్నాడు. అన్న కుమార్ పెళ్లి సందర్భంగా తనకు తెచ్చిన దుస్తులు వేసి అంతిమసంస్కారాలు జరిపించాలని లేఖలో కోరాడు. నాలుగేళ్ల క్రితం పాండు రాసిన సూసైడ్ నోట్ నాగార్జున ఫాంహౌస్‌లో అస్థిపంజరం.. నాలుగేళ్ల క్రితం ఇంట్లో నుంచి అదృశ్యమైపోయిన పాండు హీరో నాగార్జున పాపిరెడ్డిగూడ గ్రామ శివారులో కొనుగోలు చేసిన ఫాంహౌస్‌లోని ఓ భవనంలో అస్థిపంజరమై కనిపించాడు. అయితే పాండుకు సంబంధించిన వ్యవసాయం పొలం పక్కనే నాగార్జున ఫాంహౌస్ ఉండడం, దీనికి చివరలో ఓ పాత భవనం ఉండడంతో అక్కడకు ఎవరూ వెళ్లేవారు కాదు. లేఖ రాసి పెట్టిన పాండు నేరుగా ఇక్కడకు వచ్చి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన డీసీపీ శంషాబాద్ డీసీపీ ప్రకాశ్‌రెడ్డి, చేవెళ్ల ఏసీపీ వెంకట్‌రెడ్డి, సీఐలు రామకృష్ణ, చంద్రబాబు, కేశంపేట ఎస్ఐ వెంకటేశ్వర్లు గురువారం సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతుడికి సంబంధించిన వివరాల కోసం ఆరా తీశారు. సంఘటనా స్థలంలో లభించిన ఆధార్‌కార్డులు, ఐడీ కార్డులు, చెప్పులు, ఇయర్ఫోన్లు, ఒక జత దుస్తులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతుడు పాపిరెడ్డిగూడకు చెందిన పాండుగా గుర్తించారు. ఇతను కూల్‌డ్రింక్‌లో పురుగుల మందు కలుపుకొని తాగి మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. వీఆర్వో మమత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపారు. -
కేశంపేట, కొందుర్గు తహసీల్దార్లకు నోటీసులు
సాక్షి, రంగారెడ్డి: సకాలంలో మ్యుటేషన్ కేసులను పరిష్కరించడంలో నిర్లక్ష్యం ప్రదర్శించిన ఇద్దరు తహసీల్దార్లకు షాద్‌నగర్ ఆర్డీఓ కృష్ణ షోకాజ్ నోటీసులు జారీచేశారు. 15 రోజుల్లో పరిష్కారం చేయాల్సిన ఈ కేసులను రోజుల తరబడి పెండింగ్‌లో ఉంచడంతో ఆర్డీఓ ఈ నిర్ణయం తీసుకున్నారు. 15 రోజుల్లో మ్యుటేషన్ల ప్రక్రియ పూర్తి చేయాలని అప్పటి జాయింట్ కలెక్టర్, ప్రస్తుత ఇన్చార్జి కలెక్టర్ డాక్టర్ హరీష్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ఈ నిబంధనలను అమలు చేయాల్సిన కేశంపేట ఇన్చార్జి తహసీల్దార్ బి.ఆంజనేయులు, కొందుర్గు తహసీల్దార్ ఎం.కృష్ణారెడ్డి పెడచెవిన పెట్టారు. కేశంపేటలో 216, కొందుర్గు మండలంలో 134 మ్యుటేషన్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. దీన్ని తీవ్రంగా పరిగణించిన ఆర్డీఓ ఆ ఇద్దరు తహసీల్దార్లకు నోటీసులు ఇచ్చారు. నిర్దేశిత గడువులోగా కేసులను పరిష్కరించడంలో ఎందుకు విఫలమయ్యారో పేర్కొంటూ 24 గంటల్లోగా వ్యక్తిగతంగా వివరణ ఇవ్వాలని సూచించారు. లేకుంటే శాఖా పరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
జలగలకు వల
సాక్షి, హైదరాబాద్: ఇటీవల కేశంపేట తహసీల్దార్ ఇంటిపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు చేసిన దాడిలో ఏకంగా రూ.93 లక్షల నగదు లభించిన సంగతి తెలిసిందే. అంతపెద్ద మొత్తం లెక్కపెట్టేందుకు ఏసీబీ అధికారులకు గంటపైగా సమయం పట్టింది.. ఏసీబీకే చెందిన సస్పెండ్ అయిన ఓ కానిస్టేబుల్‌ను ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. అతడి నుంచి రూ.1.5 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. - ఏసీబీ అధికారులు వలపన్ని నమోదు చేసిన కేసుల్లో అసెంబ్లీ ఉద్యోగుల నుంచి పంచాయతీ అటెండర్ వరకు దాదాపు అన్ని శాఖల ఉద్యోగులు ఉన్నారు. ఇప్పుడు నమోదవుతున్న కేసుల్లో గ్రామీణ ప్రాంతాల నుంచే అధికం. - సంక్షేమ పథకాల జారీలో ప్రతి దానికి లంచం అడగడమే ఇందుకు కారణం. ప్రస్తుతం ఏసీబీ నమోదు చేసిన కేసుల్లో అధిక శాతం రెవెన్యూ శాఖకు సంబంధించినవే. - భూ ప్రక్షాళన, పట్టాదారు పాసు పుస్తకాల జారీ విషయంలో రెవెన్యూ ఉద్యోగులు భారీగా అవినీతికి పాల్పడుతున్నారు. కిందిస్థాయి అటెండర్ నుంచి వీఆర్ఏ, వీఆర్వో, తహసీల్దార్ వరకు అంతా అవినీతికి గేట్లు తెరిచారు. కొత్త జిల్లా కేంద్రాల్లో రియల్ ఎస్టేట్ రంగం పరుగులు పెడుతోంది. దీన్ని కూడా వారు అవకాశంగా తీసుకుని బాధితుల వద్ద అందినకాడికి దండుకుంటున్నారు. -
ఏసీబీ విచారణ : తల తిరుగుతోందంటూ సాకులు
సాక్షి, హైదరాబాద్: కేశంపేట తహశీల్దార్ లావణ్య ఏసీబీ విచారణకు సహకరించట్లేదు. శుక్రవారం ఉదయం ఆమెను చం చల్‌గూడ జైలు నుంచి అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు కొన్ని గంటల పాటు ప్రశ్నించారు. విచారణ ప్రారంభించగానే తల తిరుగుతోందని, వాంతు వచ్చేలా ఉందంటూ ప్రశ్నలు అడగనీయకుండా చేసి నట్లు తెలిసింది. వీడియో చూసి మౌనం.. ఇటీవల ఏసీబీ దాడిలో లావణ్య వద్ద రూ.93 లక్షల నగదు లభించిన విష యం తెలిసిందే. ఈ నగదు ఎక్కడి నుంచి వచ్చిం దన్న ప్రశ్నకు ఆమె సమాధానం చెప్పలేదు. రూ.35 లక్షలు సింగిల్ సెటిల్మెంట్ అనడానికి తమ వద్ద ఉన్న వీడియో సాక్ష్యాలను అధికారులు ఆమె ముం దుంచినట్లు సమాచారం. వాటిని చూడగానే ఆమె మౌనంగా ఉండిపోయినట్లు సమాచారం. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3.30 వరకు విచారించినా ఆమె నుంచి ఏసీబీ అధికారులు సమాధానాలు రాబట్టలేకపోయారు. శనివారం మధ్యాహ్నం వరకే సమయం ఉండటంతో ఈ లోపు ఆమె చేత నిజాలు చెప్పించగలరా అన్నది ఆసక్తికరంగా మారింది. మరో రూ.36.8 లక్షల గుర్తింపు.. ఏసీబీ దాడి చేసిన రోజు రూ.36.8 లక్షలను లావణ్య ఆమె బంధువుల ఖాతాల్లో గుర్తించారు. ఆమె సోద రుడి ఖాతాలో రూ.20.5 లక్షలు, నల్లగొండలోని బంధువు ఖాతాలో రూ.8 లక్షలు, లావణ్య ఖాతాలో రూ.5.99 లక్షలు, భర్త వెంకటేశం బ్యాంకు ఖాతాలో రూ.1.36 లక్షలు, ఇవి కాకుండా లావణ్యకే చెందిన మరో 2 ఖాతాల్లో రూ.40 వేలు, రూ.50 వేలు రూ.36.8 లక్షల సొమ్ము గుర్తించారు. ఇందులో లావణ్య ఖాతాలో ఉన్న సొమ్ము ఆమె వేతనంగా భావిస్తున్నారు. కేశంపేట తహశీల్దార్‌గా నియామకం కావడం కంటే ముందు లావణ్య ఉమ్మడి మెదక్ జిల్లాలోనూ పనిచేశారు. అక్కడ పరిచయమైన ఓ అధికా రిని తన బంధువు అని చెప్పుకొంటూ పలు లావాదేవీల్లో ఆ అధికారి పేరును వాడుకున్నట్లు తెలిసింది. -
అవినీతి లావణ్యం
-
ప్రతి పనికీ మనీ మనీ..!
కేశంపేట : రంగారెడ్డి జిల్లా కేశంపేట తహసీల్దార్ లావణ్య బాధితులు శుక్రవారం తహసీల్దార్ కార్యాలయానికి భారీగా చేరుకున్నారు. తహసీల్దార్ లావణ్యకు ఎంత సమర్పించుకున్నారో చెప్పారు. ప్రతి పనికీ రేటును ఫిక్స్ చేసి వసూలు చేశారని పలువురు రైతులు ఆరోపించారు. రైతులు తమ భూ సమస్యలను పరిష్కరించుకోవాలంటే తహసీల్దార్‌కుగానీ, తన ఏజెంట్లకుగానీ డబ్బులు ముట్టజెప్పాల్సిందేనని, మీడియాకు తెలిపితే తమ సమస్యలను మరింత జటిలం చేస్తుందనే తాము ఎవరికీ చెప్పలేదని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కార్యాలయంపై దాడి.. కార్యాలయంలో సిబ్బంది ఎవరూ లేకపోవడంతో రైతులు బయటే గుమిగూడారు. అదే సమయంలో వచ్చిన సర్వేయర్ నాగేశ్ కాళ్ళు మొక్కి తమకు ఇవ్వాల్సిన రిపోర్టులను అందజేయాలని రైతులు కోరారు. సరైన సమాధానం చెప్పకపోవడంతో ఆగ్రహించిన రైతులు సర్వేయర్‌ను నిలదీశారు. టేబుల్, కుర్చీలను ఎత్తి పడేశారు. సకాలంలో పోలీసులు స్పందించి రైతులను సముదాయించి బయటకు పంపించారు. కలెక్టర్ రావాలి... గతంలో పనిచేసిన రెవెన్యూ అధికారులు లంచాలు తీసుకుని భూరికార్డులను మాయం చేసిన లీలలు తెలవాలంటే కలెక్టర్ కేశంపేటకు రావాలని రైతులు డిమాండ్ చేశారు. మండలంలో జరిగిన అవినీతిపై కలెక్టర్ విచారణ జరిపించాలన్నారు. సర్వేయర్ కాళ్లు మొక్కుతున్న బాధితురాలు మళ్లీ ఏసీబీ తనిఖీలు కేశంపేట తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు శుక్రవారం మళ్లీ తనిఖీలు నిర్వహించారు. ఐదుగురు సభ్యులతో కూడిన అధికారుల బృందం కార్యాలయంలో రికార్డులను పరిశీలించారు. తహసీల్దార్ లావణ్య, వీఆర్వో అనంతయ్య రైతు వద్ద నుంచి భారీ మొత్తంలో లంచం తీసుకొని ఏసీబీ అధికారులకు పట్టుబడిన నేపథ్యంలో వారిపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందాయి. ఈ క్రమంలో కేశంపేట తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు మరోమారు తనిఖీలు నిర్వహించారు. రూ. 50 వేలు ఇస్తేనే కాస్తు.. కేశంపేట శివారులోని సర్వే నంబర్ 223లో రెండు ఎకరాల భూమిని 1991లో సాదాబైనామాగా తలకొండపల్లి మండలంలోని రామకృష్ణపురం గ్రామానికి చెందిన శేరిల వెకటయ్య వద్ద కొనుగోలు చేశామని భారతమ్మ అనే మహిళా రైతు తెలిపారు. అప్పటి నుంచి కబ్జాలో ఉన్నామని, దానికి కాస్తు రాయాలని వీఆర్వో అనంతయ్యను కోరగా రూ.50 వేలు డిమాండ్ చేశారని చెప్పారు. తప్పనిపరిస్థితుల్లో డబ్బులిచ్చి కాస్తు రాయించుకున్నామన్నారు. గత సంవత్సరం మళ్లీ కాస్తు రాయాలని కోరగా లక్ష రూపాయలు ఇవ్వాలని వీఆర్వో కోరారని, తహసీల్దార్‌ను సంప్రదిస్తే అనంతయ్య చెప్పినట్టు లక్ష రూపాయలు ఇసైనే కాస్తు రాస్తామన్నారని భారతమ్మ ఆరోపించారు. తాము డబ్బులు ఇవ్వకపోవడంతో శేరిల వెంకటయ్య పేరును అన్లైన్లో చేర్చారని తెలిపారు. దీంతో అతను ఆ భూమిని విక్రయించాడని, తమకు న్యాయం చేయాలని బాధితురాలు కోరారు. -
బోర్డులో నీతి.. లోపలంతా అవినీతి
సాక్షి హైదరాబాద్/షాద్‌నగర్ టౌన్: కార్యాలయాలబయట అవినీతి రహిత సేవలు అంటూ పెద్ద అక్షరాలతో ప్రకటనలు.. లోపలకు అడుగుపెడితే చాలు గుప్పుమంటున్న అవినీతి వాసనలు. ఇది అవినీతికి కేరాఫ్ అడ్రస్‌లుగా మారిన రెవెన్యూ కార్యాలయాల పరిస్థితి. ఇందులో దొరికిన వారే దొంగలు.. కానీ దొరకని వారు చాలా మందే దర్జాగా దండుకుంటున్నారు. రెవెన్యూశాఖలో ఇలాంటి తిమింగళాలు ఎందరో ఉన్నారు. వీరిద్వారా ప్రజలకు ఎదురవుతున్న సమస్యలను అర్థం చేసుకున్నందుకే.. రెవెన్యూశాఖను ప్రక్షాళన చేసేందుకు సీఎం కేసీఆర్ నడుంబిగించారు. కాగా.. ఉత్తమ తహసీల్దార్‌గా అవార్డు పొంది.. అక్రమ సంపాదనలో రికార్డు సృష్టించిన రంగారెడ్డి జిల్లా కేశంపేట తహసీల్దార్ లావణ్య తీరు పై విస్తుగొలిపే అంశాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. మనమందరం కలిసి పంచుకుందాం అనే నినాదంతో కిందిస్థాయి సిబ్బందితో కుమ్మక్కై అవినీతికి పాల్పడ్డారని వెల్లడైంది. 2016 నవంబర్ 21న కేశంపేట తహసీల్దార్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత లావణ్య మండలంలో పట్టుబిగించారు. ఈప్రాంతం లో భూముల ధరలకు రెక్కలు రావడంతో రియల్ ఎస్టేట్ వ్యాపారంపై కన్నేశారు. తన పేరు బయట పడకుండా మధ్యవర్తులను తెరపైకి తీసుకొచ్చి భూవివాదాలు సెటిల్మెంట్లు చేసేవారని తెలుస్తోంది. ఫైలు కదలాలంటే ఆమ్యామ్యా తప్పదు కేశంపేట తహసీల్దార్ కార్యాలయంలో అవినీతి రాజ్యమేలుతోంది. సమస్యలతో రెవెన్యూ కార్యాలయానికి వచ్చే ప్రతి రైతు వద్ద సిబ్బంది డబ్బులు వసూలు చేస్తున్నారు. లేదంటే ఫైళ్లు పెండింగ్‌లో ఉంటున్నాయి. కుల ధ్రువీకరణ పత్రాలు మొదలుకుని.. భూ రికార్డుల మార్పిడి, ఆన్లైన్లో నమోదు వర కు ప్రతి పనికీ వెలకట్టి మరీ డబ్బులు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. కార్యాలయం బయట ‘ఈ కార్యాలయం అవినీతి రహిత కార్యాల యం’అంటూ పెద్ద అక్షరాలతో బ్యానర్‌ను ఏర్పాటు చేశారు. వీఆర్ఏ, వీఆర్ఓ, సిబ్బంది ఎవరైనా డబ్బులు అడితే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయా లని లావణ్య ఇటీవల కార్యాలయం ఎదుట ఫ్లెక్సీని ఏర్పాటు చేయించారు. కానీ, ఆ బోర్డులను ఏర్పాటు చేయించిన తహసీల్దారే భారీ అవినీతి తిమింగళమని తెలియడంతో రైతులు, ప్రజలు అవాక్కయ్యారు. చంచల్‌గూడ జైలుకు లావణ్య, వీఆర్వో బుధవారం రూ.93 లక్షల నగదుతో పాటు బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్న ఏసీబీ అధికారులు ఆమెను అదుపులోకి తీసుకొని గురువారం ఉదయం 6 గంటల వరకు కేశంపేట తహసీల్దార్ కార్యాలయంలో ఉంచి విచారించారు. కార్యాలయం లోని ప్రతి ఫైల్‌ను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. పెండిం గ్ ఫైళ్ళ గురించి ఆరా తీసి.. ఎందుకు పెండింగ్‌లో ఉంచారని లావణ్యను ప్రశ్నించినట్లు తెలిసింది. కార్యాలయంలోని రికార్డు గదిని ఏసీబీ అధికారులు సీజ్ చేశారు. గురువారం ఉదయం 6గంటల ప్రాం తంలో ఆమెను, వీఆర్వోను ప్రత్యేక వాహనంలో హైదరాబాద్‌లోని నాంపల్లి ఏసీబీ కార్యాలయానికి తీసుకెళ్లి మరోసారి విచారణ చేపట్టారు. ఇద్దరికీ ఉస్మానియా ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం వారిని బంజారాహిల్స్‌లోని ఏసీబీ కేసుల విచారణ ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి ఇం ట్లో హాజరుపర్చారు. 14రోజులపాటు రిమాండ్‌లో ఉంచాలని న్యాయమూర్తి ఆదేశించారు. దీంతో వీద్దరినీ చంచల్‌గూడ జైలుకు పోలీసులు తరలించారు. ఉద్యోగంలో చేరినప్పటినుంచీ ఇదే తంతు ఈమె గతంలో పనిచేసిన చోట్ల కూడా అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. కౌడిపల్లి, దౌల్తా బాద్, ములు గు, కొండాపూర్ మండలాల్లో వివిధ స్థాయిల్లో పనిచేసిన లావణ్య అక్కడ కూడా అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఉన్నతాధికారులు, స్థానిక రాజకీయ నాయకుల అండతో ఆమె ఇష్టారాజ్యంగా వ్యవహరించేవారని వెల్లడైంది. ములుగు మండలంలో ఆమె పనిచేస్తున్న సమయంలో ఎమ్మార్వో కార్యాలయం ఎదురుగా ఉన్న ఓ ప్రైవేటు పాఠశాలను అడ్డాగా చేసుకుని దందా కొనసాగించేవారని తెలుస్తోంది. కొండాపూర్ నుంచి బదిలీ అయిన రోజు కూడా కార్యాలయానికి వచ్చి పాత ఫైళ్లన్నింటినీ క్లియర్ చేసి అందినకాడికి దండుకున్నారన్న ఆరోపణలున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి కేసులెన్నో.. ఏసీబీలో ఓ ముఖ్యమైన అధికారి తన సన్నిహితుడి పనికోసం లావణ్యను సంప్రదిస్తే.. దాన్ని పరిష్కరించేందుకు ఆమె ఏకంగా 2నెలలు తిప్పినట్లు తెలుస్తోంది. రెవెన్యూ శాఖకే చెందిన మరో అధికారి చేత సిఫారసు చేయిస్తే గానీ ఆ పని పూర్తి కాకపోవడం గమనార్హం. ఇటీవల జరిగిన ఓ రియల్ ఎస్టేట్ సెటిల్మెంట్లో ఆమెకు రూ.40లక్షలు ముట్టాయని..ఏసీ బీ దాడుల్లో పట్టుబడింది కూడా ఆ నగదేనంటూ ప్రచారం జరుగుతోంది. లావణ్య వంటి అవినీతి తిమింగళాలు రెవెన్యూశాఖలో ఎందరో ఉన్నారు. అడపాదడపా వీరు పట్టుబడుతున్నా.. చర్యలు తీసు కోవడంలో ఉన్నతాధికారుల ఉదాసీనత కూడా అవి నీతి పెరిగేందుకు ఊతమిస్తోందనే విమర్శలున్నా యి. అరెస్టు చూపిన తర్వాత తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత శాఖలు, అధికారులు, సచివాలయంలోని పేషీలు శ్రద్ధ చూపకపోవడంతోనే.. రెవెన్యూ శాఖ అవినీతి ఊబిగా మారిందనే ఆరోపణలొస్తున్నాయి. అందుకే కేసీఆర్ ఈ శాఖను పూర్తిగా ప్రక్షాళన చేసేందుకు నడుంబిగించారు. ఫోరం ఫర్ గుడ్‌గవర్నెన్స్ ఇటీవల ప్రభుత్వానికి రాసిన లేఖలో పేర్కొన్న మచ్చుకు కొన్ని కేసులివి: హైదరాబాద్ కలెక్టరేట్లో డిప్యూటీ కలెక్టర్‌గా పనిచేస్తున్న సత్యనారాయణ 2010, ఫిబ్రవరిలో లంచం తీసుకుంటుండగా ఏసీబీ వలలో చిక్కారు. ఈ కేసు సమగ్రంగా విచారణ జరిపి అదే ఏడాది అక్టోబర్‌లో ప్రభుత్వానికి విజిలెన్స్ కమిషన్ ద్వారా ప్రాసిక్యూషన్‌కు సిఫారసు చేస్తూ ఏసీబీ నివేదిక ఇచ్చింది. అప్పటి నుంచి ప్రాసిక్యూషన్‌కు నాలుగేళ్ల పాటు అనుమతి ఇవ్వకపోగా, కేసును విరమించుకోవడం గమనార్హం. అదే కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న మోహన్‌రావు 2010లో చేతివాటం ప్రదర్శిస్తూ ఏసీబీకి పట్టుబడ్డారు. ఆయనపై విచారణ జరిపి ప్రాసిక్యూషన్‌కు అనుమతినివ్వాలని ఏసీబీ కోరినా ఎలాంటి పురోగతి లేదు. పైగా కేసును ఉపసంహరించుకుంటున్నట్టు ప్రకటించారు. అయితే, ఇప్పటికీ ఈ కేసు పెండింగ్‌లో ఉన్నట్టు ప్రభుత్వ రికార్డుల్లో ఉండడం గమనార్హం. డిప్యూటీ కలెక్టర్ రాములు నాయక్ 2011లో అవినీతి సొమ్ముతో ఏసీబీకి చిక్కారు. ఆ సమయంలో ఆయన ఇంటిలో సోదాలు చేయగా, ఆదాయానికి మించిన ఆస్తులు బయటపడ్డాయి. ఈ నేపథ్యంలో ఆయనపై రెండు కేసులు నమోదు చేశారు. ఈ రెండు కేసుల్లో రాములు నాయక్ ప్రాసిక్యూషన్‌కు ఏసీబీ కోరింది. కానీ, కేసును మూడేళ్లు పెండింగ్‌లో ఉంచిన ప్రభుత్వం చివరకు శాఖాపరమైన చర్యలకు ఆదేశించి చేతులు దులుపుకుంది. రంగారెడ్డి జిల్లా జాయింట్ సబ్‌రిజిస్ట్రార్ సహదేవ్ 2011లో లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. కేసును సమగ్రంగా విచారణ జరిపిన ఏసీబీ 2012లో ఆయన్ను కూడా ప్రాసిక్యూషన్‌కు అనుమతించాలని కోరగా, ప్రభుత్వం మాత్రం రెండేళ్ల తర్వాత శాఖాపరమైన విచారణకే పరిమితమైంది. ఆ విచారణ ఇప్పటికీ పూర్తి కాకపోవడం గమనార్హం. గత ఐదేళ్లలో 50 వరకు ఇలాంటి అవినీతి కేసులను ప్రభుత్వం మూసివేసింది. తహసీల్దార్ కార్యాలయం వద్ద గుమిగూడిన రైతులు, ప్రజలు లంచాలు తిరిగి ఇచ్చేస్తున్నారంటూ పుకార్లతో.. లావణ్యకు లంచాల రూపంలో ఇచ్చిన నగదును ఏసీబీ వారు తిరిగి ఇచేస్తున్నారంటూ మొదలైన పుకార్లు క్షణాల్లో పాకిపోవడంతో.. కేశంపేట ఎమ్మెఆర్వో కార్యాలయానికి బాధిత ప్రజలు, రైతులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. దీంతో తహసీల్దార్ కార్యాలయం వద్ద సందడి నెలకొంది. అయితే.. కార్యాలయంలో అధికారులు, సిబ్బంది ఎవరూ లేకపోవడం, నగదు గురించి ఎవర్ని అడగాలో తెలియకపోవడంతో ఇవన్నీ పుకార్లేనని అర్థం చేసుకుని తిరిగి వెళ్లిపోయారు. -
దినకర్మకు వెళ్లి.. మృత్యుఒడికి
కేశంపేట : ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్సీ) ఆవరణలో తవ్వి అర్ధాంతంగా వదిలివేసిన ఇంకుడుగుంత ఓ బాలుడి పాలిట మత్యువుగా మారింది.. అధికారుల నిర్లక్ష్యంతో ఏడేళ్లకే అతడికి నూరేళ్లు నిండాయి.. తల్లిదండ్రులతో కలిసి బంధువు దినకర్మకు వెళ్లగా ఈ సంఘటన చోటుచేసుకోవడం అక్కడి వారినందరినీ కలచివేసింది. మండల కేంద్రానికి చెందిన జయమ్మ, రమేష్ దంపతులకు ముగ్గురు కుమారులు ఉన్నారు. వీరిలో రెండోవాడు అన్నంగారి నర్సింహులు (7) స్థానిక ప్రాథమిక పాఠశాలలో ఒకటో తరగతి చదువుతున్నాడు. కాగా, బుధవారం ఉదయం బంధువు దశదినకర్మ ఉండటంతో పాఠశాలకు వెళ్లలేకపోయాడు. ఈ క్రమంలోనే తల్లిదండ్రులు, తాత నర్సిములుతో కలిసి అక్కడికి చేరుకున్నాడు. వారంతా ఆ కార్యక్రమంలో నిమగ్నం కాగా, ఈ బాలుడు మాత్రం తోటి పిల్లలతో కలిసి సమీపంలోని పీహెచ్సీ ఆవరణలో ఆడుకోవడటానికి వెళ్లాడు. కొద్దిసేపటికి ప్రమాదవశాత్తు అక్కడే ఇంకా పూర్తికాని ఇంకుడుగుంతలో పడ్డాడు. మధ్యాహ్నం వరకు తిరిగి రాకపోవడంతో తాత చుట్టుపక్కల వెతుకుతూ అందులో మనవడు కొనఊపిరితో ఉండగా గమనించి బయటకు లాగారు. హుటాహుటిన షాద్‌నగర్ కమ్యూనిటీ ఆస్పత్రికి తీసుకెళుతుండగా మార్గమధ్యంలోనే మతి చెందాడు. అధికారుల నిర్లక్ష్యంతోనే బాలుడు మతి చెందాడని బంధువులు, గ్రామస్తులు ఆరోపించారు. ఇంకుడుగుంతను అర్ధంతరంగా వదిలేయడంతో ఈ సంఘటన చోటుచేసుకుందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు హెడ్‌కానిస్టేబుల్ కష్ణయ్య కేసు దర్యాప్తు జరుపుతున్నారు. పోస్టుమార్టం అనంతరం మతదేహాన్ని బంధువులకు అప్పగించారు. బాధిత కుటుంబాన్ని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ పరామర్శించి రూ.ఐదు వేలు, టీఆర్ఎస్ మండల నాయకుడు లక్ష్మీనారాయణ రూ.మూడు వేలు ఆర్థికసాయం అందజేశారు. ఈ సంఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.