బోర్డులో నీతి.. లోపలంతా అవినీతి | Corruption Keshampet MRO Office | Sakshi
Sakshi News home page

బోర్డులో నీతి.. లోపలంతా అవినీతి

Published Fri, Jul 12 2019 2:49 AM | Last Updated on Fri, Jul 12 2019 2:49 AM

Corruption Keshampet MRO Office - Sakshi

సాక్షి హైదరాబాద్‌/షాద్‌నగర్‌ టౌన్‌: కార్యాలయాలబయట అవినీతి రహిత సేవలు అంటూ  పెద్ద అక్షరాలతో ప్రకటనలు.. లోపలకు అడుగుపెడితే చాలు గుప్పుమంటున్న అవినీతి వాసనలు. ఇది అవినీతికి కేరాఫ్‌ అడ్రస్‌లుగా మారిన రెవెన్యూ కార్యాలయాల పరిస్థితి. ఇందులో దొరికిన వారే దొంగలు.. కానీ దొరకని వారు చాలా మందే దర్జాగా దండుకుంటున్నారు. రెవెన్యూశాఖలో ఇలాంటి తిమింగళాలు ఎందరో ఉన్నారు. వీరిద్వారా ప్రజలకు ఎదురవుతున్న సమస్యలను అర్థం చేసుకున్నందుకే.. రెవెన్యూశాఖను ప్రక్షాళన చేసేందుకు సీఎం కేసీఆర్‌ నడుంబిగించారు. కాగా.. ఉత్తమ తహసీల్దార్‌గా అవార్డు పొంది.. అక్రమ సంపాదనలో రికార్డు సృష్టించిన రంగారెడ్డి జిల్లా కేశంపేట తహసీల్దార్‌ లావణ్య తీరు పై విస్తుగొలిపే అంశాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. మనమందరం కలిసి పంచుకుందాం అనే నినాదంతో కిందిస్థాయి సిబ్బందితో కుమ్మక్కై అవినీతికి పాల్పడ్డారని వెల్లడైంది. 2016 నవంబర్‌ 21న కేశంపేట తహసీల్దార్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత లావణ్య మండలంలో పట్టుబిగించారు. ఈప్రాంతం లో భూముల ధరలకు రెక్కలు రావడంతో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంపై కన్నేశారు. తన పేరు బయట పడకుండా మధ్యవర్తులను తెరపైకి తీసుకొచ్చి భూవివాదాలు సెటిల్‌మెంట్లు చేసేవారని తెలుస్తోంది. 

ఫైలు కదలాలంటే ఆమ్యామ్యా తప్పదు 
కేశంపేట తహసీల్దార్‌ కార్యాలయంలో అవినీతి రాజ్యమేలుతోంది. సమస్యలతో రెవెన్యూ కార్యాలయానికి వచ్చే ప్రతి రైతు వద్ద సిబ్బంది డబ్బులు వసూలు చేస్తున్నారు. లేదంటే ఫైళ్లు పెండింగ్లో ఉంటున్నాయి. కుల ధ్రువీకరణ పత్రాలు మొదలుకుని.. భూ రికార్డుల మార్పిడి, ఆన్‌లైన్‌లో నమోదు వర కు ప్రతి పనికీ వెలకట్టి మరీ డబ్బులు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. కార్యాలయం బయట ‘ఈ కార్యాలయం అవినీతి రహిత కార్యాల యం’అంటూ పెద్ద అక్షరాలతో బ్యానర్‌ను ఏర్పాటు చేశారు. వీఆర్‌ఏ, వీఆర్‌ఓ, సిబ్బంది ఎవరైనా డబ్బులు అడితే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయా లని లావణ్య ఇటీవల కార్యాలయం ఎదుట ఫ్లెక్సీని ఏర్పాటు చేయించారు. కానీ, ఆ బోర్డులను ఏర్పాటు చేయించిన తహసీల్దారే భారీ అవినీతి తిమింగళమని తెలియడంతో రైతులు, ప్రజలు అవాక్కయ్యారు. 

చంచల్‌గూడ జైలుకు లావణ్య, వీఆర్వో 
బుధవారం రూ.93 లక్షల నగదుతో పాటు బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్న ఏసీబీ అధికారులు ఆమెను అదుపులోకి తీసుకొని గురువారం ఉదయం 6 గంటల వరకు కేశంపేట తహసీల్దార్‌ కార్యాలయంలో ఉంచి విచారించారు. కార్యాలయం లోని ప్రతి ఫైల్‌ను క్షుణ్ణంగా తనిఖీ చేశారు.  పెండిం గ్‌ ఫైళ్ళ గురించి ఆరా తీసి.. ఎందుకు పెండింగ్‌లో ఉంచారని లావణ్యను ప్రశ్నించినట్లు తెలిసింది. కార్యాలయంలోని రికార్డు గదిని ఏసీబీ అధికారులు సీజ్‌ చేశారు. గురువారం ఉదయం 6గంటల ప్రాం తంలో ఆమెను, వీఆర్వోను ప్రత్యేక వాహనంలో హైదరాబాద్‌లోని నాంపల్లి ఏసీబీ కార్యాలయానికి తీసుకెళ్లి మరోసారి విచారణ చేపట్టారు. ఇద్దరికీ ఉస్మానియా ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం వారిని బంజారాహిల్స్‌లోని ఏసీబీ కేసుల విచారణ ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి ఇం ట్లో హాజరుపర్చారు. 14రోజులపాటు రిమాండ్‌లో ఉంచాలని న్యాయమూర్తి ఆదేశించారు. దీంతో వీద్దరినీ చంచల్‌గూడ జైలుకు పోలీసులు తరలించారు.  

ఉద్యోగంలో చేరినప్పటినుంచీ ఇదే తంతు 
ఈమె గతంలో పనిచేసిన చోట్ల కూడా  అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. కౌడిపల్లి, దౌల్తా బాద్, ములు గు, కొండాపూర్‌ మండలాల్లో వివిధ స్థాయిల్లో పనిచేసిన లావణ్య అక్కడ కూడా అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఉన్నతాధికారులు, స్థానిక రాజకీయ నాయకుల అండతో ఆమె ఇష్టారాజ్యంగా వ్యవహరించేవారని వెల్లడైంది. ములుగు మండలంలో ఆమె పనిచేస్తున్న సమయంలో ఎమ్మార్వో కార్యాలయం ఎదురుగా ఉన్న ఓ ప్రైవేటు పాఠశాలను అడ్డాగా చేసుకుని దందా కొనసాగించేవారని తెలుస్తోంది. కొండాపూర్‌ నుంచి బదిలీ అయిన రోజు కూడా కార్యాలయానికి వచ్చి పాత ఫైళ్లన్నింటినీ క్లియర్‌ చేసి అందినకాడికి దండుకున్నారన్న ఆరోపణలున్నాయి. 

రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి కేసులెన్నో.. 
ఏసీబీలో ఓ ముఖ్యమైన అధికారి తన సన్నిహితుడి పనికోసం లావణ్యను సంప్రదిస్తే.. దాన్ని పరిష్కరించేందుకు ఆమె ఏకంగా 2నెలలు తిప్పినట్లు తెలుస్తోంది. రెవెన్యూ శాఖకే చెందిన మరో అధికారి చేత సిఫారసు చేయిస్తే గానీ ఆ పని పూర్తి కాకపోవడం గమనార్హం. ఇటీవల జరిగిన ఓ రియల్‌ ఎస్టేట్‌ సెటిల్మెంట్‌లో ఆమెకు రూ.40లక్షలు ముట్టాయని..ఏసీ బీ దాడుల్లో పట్టుబడింది కూడా ఆ నగదేనంటూ ప్రచారం జరుగుతోంది. లావణ్య వంటి అవినీతి తిమింగళాలు రెవెన్యూశాఖలో ఎందరో ఉన్నారు. అడపాదడపా వీరు పట్టుబడుతున్నా.. చర్యలు తీసు కోవడంలో ఉన్నతాధికారుల ఉదాసీనత కూడా అవి నీతి పెరిగేందుకు ఊతమిస్తోందనే విమర్శలున్నా యి. అరెస్టు చూపిన తర్వాత తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత శాఖలు, అధికారులు, సచివాలయంలోని పేషీలు శ్రద్ధ చూపకపోవడంతోనే.. రెవెన్యూ శాఖ అవినీతి ఊబిగా మారిందనే ఆరోపణలొస్తున్నాయి. అందుకే కేసీఆర్‌ ఈ శాఖను పూర్తిగా ప్రక్షాళన చేసేందుకు నడుంబిగించారు. 

ఫోరం ఫర్‌ గుడ్‌గవర్నెన్స్‌ ఇటీవల ప్రభుత్వానికి రాసిన లేఖలో పేర్కొన్న మచ్చుకు కొన్ని కేసులివి: 

  • హైదరాబాద్‌ కలెక్టరేట్‌లో డిప్యూటీ కలెక్టర్‌గా పనిచేస్తున్న సత్యనారాయణ 2010, ఫిబ్రవరిలో లంచం తీసుకుంటుండగా ఏసీబీ వలలో చిక్కారు. ఈ కేసు సమగ్రంగా విచారణ జరిపి అదే ఏడాది అక్టోబర్‌లో ప్రభుత్వానికి విజిలెన్స్‌ కమిషన్‌ ద్వారా ప్రాసిక్యూషన్‌కు సిఫారసు చేస్తూ ఏసీబీ నివేదిక ఇచ్చింది. అప్పటి నుంచి ప్రాసిక్యూషన్‌కు నాలుగేళ్ల పాటు అనుమతి ఇవ్వకపోగా, కేసును విరమించుకోవడం గమనార్హం. 
  • అదే కార్యాలయంలో సీనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న మోహన్‌రావు 2010లో చేతివాటం ప్రదర్శిస్తూ ఏసీబీకి పట్టుబడ్డారు. ఆయనపై విచారణ జరిపి ప్రాసిక్యూషన్‌కు అనుమతినివ్వాలని ఏసీబీ కోరినా ఎలాంటి పురోగతి లేదు. పైగా కేసును ఉపసంహరించుకుంటున్నట్టు ప్రకటించారు. అయితే, ఇప్పటికీ ఈ కేసు పెండింగ్‌లో ఉన్నట్టు ప్రభుత్వ రికార్డుల్లో ఉండడం గమనార్హం. 
  • డిప్యూటీ కలెక్టర్‌ రాములు నాయక్‌ 2011లో అవినీతి సొమ్ముతో ఏసీబీకి చిక్కారు. ఆ సమయంలో ఆయన ఇంటిలో సోదాలు చేయగా, ఆదాయానికి మించిన ఆస్తులు బయటపడ్డాయి. ఈ నేపథ్యంలో ఆయనపై రెండు కేసులు నమోదు చేశారు. ఈ రెండు కేసుల్లో రాములు నాయక్‌ ప్రాసిక్యూషన్‌కు ఏసీబీ కోరింది. కానీ, కేసును మూడేళ్లు పెండింగ్‌లో ఉంచిన ప్రభుత్వం చివరకు శాఖాపరమైన చర్యలకు ఆదేశించి చేతులు దులుపుకుంది. 
  • రంగారెడ్డి జిల్లా జాయింట్‌ సబ్‌రిజిస్ట్రార్‌ సహదేవ్‌ 2011లో లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. కేసును సమగ్రంగా విచారణ జరిపిన ఏసీబీ 2012లో ఆయన్ను కూడా ప్రాసిక్యూషన్‌కు అనుమతించాలని కోరగా, ప్రభుత్వం మాత్రం రెండేళ్ల తర్వాత శాఖాపరమైన విచారణకే పరిమితమైంది. ఆ విచారణ ఇప్పటికీ పూర్తి కాకపోవడం గమనార్హం. గత ఐదేళ్లలో 50 వరకు ఇలాంటి అవినీతి కేసులను ప్రభుత్వం మూసివేసింది. 


తహసీల్దార్‌ కార్యాలయం వద్ద గుమిగూడిన రైతులు, ప్రజలు  

లంచాలు తిరిగి ఇచ్చేస్తున్నారంటూ పుకార్లతో.. 
లావణ్యకు లంచాల రూపంలో ఇచ్చిన నగదును ఏసీబీ వారు తిరిగి ఇచేస్తున్నారంటూ మొదలైన పుకార్లు క్షణాల్లో పాకిపోవడంతో.. కేశంపేట ఎమ్మెఆర్వో కార్యాలయానికి బాధిత ప్రజలు, రైతులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. దీంతో తహసీల్దార్‌ కార్యాలయం వద్ద సందడి నెలకొంది. అయితే.. కార్యాలయంలో అధికారులు, సిబ్బంది ఎవరూ లేకపోవడం, నగదు గురించి ఎవర్ని అడగాలో తెలియకపోవడంతో ఇవన్నీ పుకార్లేనని అర్థం చేసుకుని తిరిగి వెళ్లిపోయారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement