సాక్షి, రంగారెడ్డి: సకాలంలో మ్యుటేషన్ కేసులను పరిష్కరించడంలో నిర్లక్ష్యం ప్రదర్శించిన ఇద్దరు తహసీల్దార్లకు షాద్‌నగర్ ఆర్డీఓ కృష్ణ షోకాజ్ నోటీసులు జారీచేశారు. 15 రోజుల్లో పరిష్కారం చేయాల్సిన ఈ కేసులను రోజుల తరబడి పెండింగ్‌లో ఉంచడంతో ఆర్డీఓ ఈ నిర్ణయం తీసుకున్నారు. 15 రోజుల్లో మ్యుటేషన్ల ప్రక్రియ పూర్తి చేయాలని అప్పటి జాయింట్ కలెక్టర్, ప్రస్తుత ఇన్‌చార్జి కలెక్టర్ డాక్టర్ హరీష్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ఈ నిబంధనలను అమలు చేయాల్సిన కేశంపేట ఇన్‌చార్జి తహసీల్దార్ బి.ఆంజనేయులు, కొందుర్గు తహసీల్దార్ ఎం.కృష్ణారెడ్డి పెడచెవిన పెట్టారు. కేశంపేటలో 216, కొందుర్గు మండలంలో 134 మ్యుటేషన్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. దీన్ని తీవ్రంగా పరిగణించిన ఆర్డీఓ ఆ ఇద్దరు తహసీల్దార్లకు నోటీసులు ఇచ్చారు. నిర్దేశిత గడువులోగా కేసులను పరిష్కరించడంలో ఎందుకు విఫలమయ్యారో పేర్కొంటూ 24 గంటల్లోగా వ్యక్తిగతంగా వివరణ ఇవ్వాలని సూచించారు. లేకుంటే శాఖా పరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment