► 57 మండలాల నుంచి భూరికార్డుల సేకరించిన అధికారులు
► రికార్డు రూంలో భద్రపరిచే పనిలో రెవెన్యూ సిబ్బంది
► భూకుంభకోణాల నేపథ్యంలోనే రికార్డులు స్వాధీనం
సాక్షి, అమరావతి బ్యూరో: భూ కుంభకోణాలు, రికార్డుల తారుమారు నేపథ్యంలో జిల్లాలోని రెవెన్యూ ఉన్నతాధికారులు జిల్లాలో రెవెన్యూ రికార్డులు భద్ర పరిచే పనిలోపడ్డారు. ఇందులో భాగంగా 57 మండలాలల్లో భూములకు సంబంధించిన రికార్డులను గుంటూరులోని కలెక్టర్ కార్యాలయానికి గురువారం తీసుకువచ్చి స్వాధీనం చేయాలని కలెక్టర్ కోనశశిధర్ ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఆగమేఘాల మీద రెవెన్యూ సిబ్బంది ముఖ్యమైన రికార్డులతో గురువారం కలెక్టరేట్‌కు చేరుకొన్నారు. కలెక్టరేట్‌లో రికార్డులు తీసుకొనే బాధ్యతలను వివిధ సెక్షన్‌ల సూపరింటెండెంట్లకు అప్పగించారు. వాటిని రికార్డు గదిలో భద్రపరిచే పనిలో నిమగ్నమయ్యారు. ఇందులో ప్రధానంగా ఆర్.ఎ.ఎస్.ఆర్, వన్ రిజిస్ట్రర్, 1(బి), 10 (1) రిజిస్ట్రర్లు, అడంగళ్లు, అసైన్‌మెంట్ రిజిస్ట్రర్‌తో పాటు ఇతర రికార్డులు ఉన్నాయి. వీటిని ఇప్పటికే రెవెన్యూ అధికారులు కంప్యూటీకరణ చేసి ఉన్నారు.
విశాఖ భూకుంభకోణం నేపథ్యంలో..
విశాఖపట్నంలో రూ.వేల కోట్ల భూముల కుంభకోణం వెలుగు చూసిన నేపథ్యంలో జిల్లాలో రెవెన్యూ అధికారులు అప్రమత్తమయ్యారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా పలు మండల కార్యాలయాల్లో రికార్డులు తారుమారు అయినట్లు, పలు ఫిర్యాదులు అందిన నేపథ్యంలో రికార్డులు సమీకరించారు. అయినప్పటికీ అక్కడ ప్రభుత్వ భూములు, చెరువు, శ్మశనాలు, వంటి భూములు రెవెన్యూ అధికారుల అండదండలతో దర్జాగా కబ్జా చేస్తున్న నేపథ్యంలో ఈ పనికి పూనుకున్నట్లు తెలుస్తోంది. జిల్లాలోని గురజాల, బాపట్ల, వినుకొండ, ప్రాంతాల్లో అవినీతి ఆరోపణలు రావటంతో ఇప్పటికే కొందరు రెవెన్యూ అధికారులపై వేటు పడింది. రేపల్లె నియోజకవర్గంలో భారీ భూకుంభకోణం వెలుగు చూసిన నేపథ్యంలో రికార్డుల సేకరణ రెవెన్యూ అధికారుల్లో ఆందోళన రేపింది.
కలెక్టరేట్‌కు చేరిన రెవెన్యూ రికార్డులు
Published Fri, Jul 21 2017 11:44 AM | Last Updated on Fri, May 25 2018 7:10 PM
Advertisement
Advertisement