లేని భూమిని అమ్మేశారు.. అసలు భూమిని కొట్టేశారు | Irregularities of TDP leaders in Agri Gold lands | Sakshi
Sakshi News home page

లేని భూమిని అమ్మేశారు.. అసలు భూమిని కొట్టేశారు

Published Mon, Sep 13 2021 4:25 AM | Last Updated on Mon, Sep 13 2021 11:15 AM

Irregularities of TDP leaders in Agri Gold lands - Sakshi

కేఈ కృష్ణమూర్తితో దామోదర్‌ (ఫైల్‌)

కోడుమూరు: అగ్రి గోల్డ్‌ భూముల వ్యవహారంలో టీడీపీ నాయకులు భారీగా అక్రమాలకు పాల్పడ్డారు. నకిలీ పట్టాదార్‌ పాస్‌ పుస్తకాలతో ఆ సంస్థకు కొంత భూమిని అమ్మారు. అమ్మిన భూమికి కూడా తిరిగి తమ కుటుంబ సభ్యుల పేరిట నకిలీ పత్రాలు సృష్టించారు. ఈ తంతు వెనుక మాజీ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి ప్రధాన అనుచరుడు దామోదర్‌ నాయుడు, ఆయన కుటుంబ సభ్యులు కీలక పాత్ర పోషించారు. సీఐడీ అధికారుల విచారణలో ఈ విషయం వెలుగు చూసింది. కర్నూలు జిల్లా కృష్ణగిరి మండలం రామకృష్ణాపురం గ్రామంలో సర్వే నంబర్‌ 113లో ఉన్న 8.24 ఎకరాల భూమిని దామోదర్‌ నాయుడు సోదరులు వెంకటయ్య, నారాయణ గతంలో అగ్రి గోల్డ్‌ సంస్థకు విక్రయించారు.

ఇది సాగులో ఉన్న భూమి కావడంతో రెవెన్యూ అధికారులతో లోపాయికారీ ఒప్పందం కుదుర్చుకుని దామోదర్‌ నాయుడు భార్య వరలక్ష్మి, వెంకటయ్య భార్య రంగమ్మకు తిరిగి బదలాయించుకున్నారు. అలాగే సర్వే నంబర్‌ 146/1 రెవెన్యూ రికార్డుల్లో లేకున్నా.. నకిలీ పట్టాదార్‌ పాస్‌ పుస్తకం సృష్టించి 6.95 ఎకరాల భూమిని దామోదర్‌ నాయుడు అగ్రి గోల్డ్‌ సంస్థకు విక్రయించారు. 149బీ, 80/1, 40/2, 40, 33/7, 25/9, 84ఏ సర్వే నంబర్లలో దామోదర్‌ నాయుడు సమీప బంధువులు రామాంజనేయులు, శ్రీనివాసులు, నారాయణ, నాగేశ్వరరావు, లక్ష్మమ్మ, పుల్లయ్య, పార్వతమ్మలకు భూములు లేకపోయినా నకిలీ పట్టాదార్‌ పాస్‌ పుస్తకాల ద్వారా 21.4 ఎకరాలను అగ్రి గోల్డ్‌ సంస్థకు అమ్మారు.

బయటపడుతున్న అక్రమాలు
అగ్రి గోల్డ్‌ కొనుగోలు చేసిన భూముల్లో భారీ ఎత్తున అక్రమాలు బయటపడుతున్నాయి. రెవెన్యూ రికార్డులు తారుమారు కావడంతో వాటి మూలాలను వెలికి తీసేందుకు సీఐడీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. కోడుమూరు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో రికార్డుల్ని పరిశీలించి అవకతవకలను గుర్తించారు. 40/2 సర్వే నంబర్‌లో రెవెన్యూ రికార్డుల ప్రకారం పూర్తి విస్తీర్ణం 2.72 ఎకరాలుండగా.. 10.61 ఎకరాలున్నట్టు రిజిస్ట్రేషన్‌ చేయించారు. ఇలా రెవెన్యూ రికార్డుల్లో లేని సర్వే నంబర్లను సృష్టించి నకిలీ పట్టాదార్‌ పాస్‌ పుస్తకాలతో రిజిస్ట్రేషన్‌ చేయించి భూములు అమ్మినట్టు సీఐడీ అధికారుల విచారణలో బయటపడింది. వారం పది రోజుల్లో పూర్తి నివేదికను సీఐడీ అధికారులు ప్రభుత్వానికి సమర్పించనున్నట్టు సమాచారం.

రికార్డులు తారుమారు
రెవెన్యూ అధికారులతో లోపాయికారీ ఒప్పందం కుదుర్చుకుని దామోదర్‌ నాయుడు కుటుంబ సభ్యులు రికార్డులను తారుమారు చేశారు.  ప్రస్తుతం కృష్ణగిరి గ్రామ సర్పంచ్‌ వరలక్ష్మి (దామోదర్‌ నాయుడు భార్య) పేరిట సర్వే నంబర్‌ 113లో గల 4.12 ఎకరాల భూమిని గతంలోనే దామోదర్‌ నాయుడు అగ్రి గోల్డ్‌కు విక్రయించారు. అలాగే సర్వే నంబర్‌ 95లో రామాంజనేయులు, శ్రీనివాసులు, నారాయణ, వెంకటలక్ష్మికి ఉన్న 4.57 ఎకరాల భూమిని అగ్రి గోల్డ్‌కు అమ్మారు. అదే భూమిని వారి కుటుంబ సభ్యులు హరిబాబు, జయరాముడు, వెంకటయ్య పేర్ల మీద బదలాయించుకున్నారు. సర్వే నంబర్లు 123/1ఏ, 123/2ఏ, 123/3ఏ, 141/1, 121/2సీ, 121/1బీ, 113, 93, 92/ఏ2, 76, 68/ఏ, 64/2, 64/ఏ, 54/2, 48/5, 5/4,5,7, 144/1,2, 145/ఏ, 2సీ, 133/2, 3, 149/బీ1, 146/1బీ, 95లలో ఉన్న 126.56 ఎకరాల భూమిని గతంలో అగ్రి గోల్డ్‌కు అమ్మారు.

మా దృష్టికి రాలేదు
అగ్రి గోల్డ్‌ సంస్థ కొనుగోలు చేసిన భూములకు సంబంధించి రెవెన్యూ రికార్డులు తారుమారైనట్టు మా దృష్టికి రాలేదు. ఏడాది క్రితమే నేను కృష్ణగిరి తహసీల్దార్‌గా బాధ్యతలు తీసుకున్నాను. రికార్డుల మార్పులు, చేర్పులపై సీఐడీ అధికారులు పరిశీలన చేస్తున్నారు. 
– రామచంద్రారావు, తహసీల్దార్, కృష్ణగిరి 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement