
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రెవెన్యూ రికార్డులేవి సరిగా లేవు.. వాటి ప్రక్షాళనతో పాటు భూముల రీ-సర్వే కూడా చేపడతామని ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ తెలిపారు. గురువారమిక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రెవెన్యూ రికార్డుల వ్యవస్థ జీవచ్ఛవం అయిందన్నారు. దానిని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. భూముల రీ-సర్వేకు అధికారులను సమాయత్తం చేస్తున్నామన్నారు. రీ-సర్వే చేసే క్రమంలో ఎదురయ్యే ఇబ్బందులను అధిగమించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. రీ-సర్వేకు ఎంత ఖర్చయిన ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు. పైలెట్ ప్రాజెక్ట్‌గా రీ-సర్వేను కృష్ణా జిల్లా జగ్గయ్యపేట నుంచి మొదలు పెడతామని సుభాష్ చంద్రబోస్ పేర్కొన్నారు.
‘వ్యవసాయ సాగుదారుల హక్కు చట్టం’ వల్ల భూ యజమానులకు కానీ, కౌలుదార్లకు కానీ ఎలాంటి ఇబ్బందులు కలగవన్నారు సుభాష్ చంద్రబోస్. ఇది యజమానులకు, కౌలుదారులకు మేలు చేకూర్చే చట్టమని తెలిపారు. త్వరలోనే వ్యవసాయ శాఖ సమన్వయంతో ఈ చట్టంపై అవగాహన సదస్సులు నిర్వహిస్తామన్నారు. దేశంలోనే తొలిసారిగా ఏపీలో ‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్’ తెచ్చామన్నారు. దీన్ని పటిష్టంగా అమలు చేస్తామని తెలిపారు.
ఉగాది నాటికి ఇళ్ల స్థలాలు
వచ్చే ఉగాది నాటికి 25 లక్షల మందికి నివాస స్థలాలివ్వడం తమ ప్రభుత్వ లక్ష్యమని సుభాష్ చంద్రబోస్ తెలిపారు. పేదల ఇళ్ల కోసం ఎంత స్థలం కావాలో వివరాలు సేకరిస్తున్నామన్నారు. ఇళ్ల స్థలాలకు అవసరమైన భూమని సేకరిస్తాం.. అవసరమైతే కొనుగోలు చేస్తామని ఆయన తెలిపారు.