ఎక్కడా ఎవరూ సవాల్ చేయడానికి వీలులేని విధంగా నిజమైన యజమానులకు శాశ్వత భూ హక్కులు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం విప్లవాత్మక, సాహసోపేత నిర్ణయం తీసుకుంది. భూమి హక్కుల రిజిస్టర్‌లో ఎవరి పేరు ఉంటుందో వారికి ఆ భూమిపై ఎవరూ ప్రశ్నించడానికి వీలులేని రీతిలో శాశ్వత హక్కులు లభిస్తాయి. ఇందుకోసం రెవెన్యూ శాఖ పకడ్బందీగా భూమి హక్కుల (ల్యాండ్ టైటిల్) రిజిస్టర్ నిర్వహిస్తుంది. క్రయ విక్రయ లావాదేవీలు జరిగితే ల్యాండ్ టైటిల్ రిజిస్టార్ నిరంతరం (రియల్ టైమ్) హక్కుల పుస్తకంలో మార్పులు చేస్తారు. ఈ రిజిస్టర్‌లో పేరుండి ప్రభుత్వ తప్పిదంవల్ల ఎవరికైనా నష్టం జరిగితే బాధితునికి ప్రభుత్వమే నష్టపరిహారం చెల్లిస్తుంది. దేశంలో ఎక్కడాలేని విధంగా రైతులకు శాశ్వత భూ హక్కులు కల్పించడమే లక్ష్యంగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సర్కారు కొత్త చట్టానికి అంకురార్పణ చేస్తోంది.
సాక్షి, అమరావతి: భూ యజమానులకు ఊహాజనిత హక్కుల స్థానే శాశ్వత హక్కుల కల్పన దిశగా సర్కారు పకడ్బందీ కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైట్లింగ్ (శాశ్వత భూ హక్కుల) యాక్టు– 2019 బిల్లు సిద్ధం చేసింది. సోమవారం అసెంబ్లీలో దీనిని ప్రవేశపెట్టి ఆమోదించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుత చట్టం ప్రకారం భూ యజమానులకు శాశ్వత హక్కులు లేవు. ఎవరి భూమినైనా తమదేనంటూ ఎవరైనా కోర్టులో వేసి వివాదం చేయవచ్చు. తనదికాని భూమిని వేరొకరికి అమ్మినా రిజిస్ట్రేషన్ చేస్తున్న సంఘటనలు కోకొల్లలు. అందుకే ప్రస్తుతం అమల్లో ఉన్న భూ హక్కులు ఊహాజనితమైనవే. వీటికి చట్టబద్ధతలేదు. ఒక వ్యక్తికి చెందిన భూమి తనదేనంటూ మరొకరు కోర్టులో సవాల్ చేస్తే అది తన భూమేనని భూ యజమాని నిరూపించుకోవాలేగానీ ప్రభుత్వం కలుగజేసుకోదు. ఈ పరిస్థితి వల్లే కోర్టుల్లో ఉన్న సివిల్ వివాదాల్లో 60 శాతం భూ వివాదాలకు సంబంధించినవే ఉన్నాయి. కొత్త చట్టం అమల్లోకి వస్తే ఇలా ఉండదు. ప్రతి గ్రామంలో ప్రతి సర్వే నంబరులో ఎంత భూమి ఎవరెవరి పేరుతో ఉందో రికార్డులు పక్కాగా నిర్వహిస్తారు. ఈ రికార్డును ఎవరూ సవాల్ చేయడానికి వీలుండదు. ఒకవేళ ప్రభుత్వ రికార్డులను నమ్ముకుని ఎవరైనా భూమిని కొనుగోలు చేసి నష్టపోతే బాధితునికి సర్కారు నష్ట పరిహారం చెల్లిస్తుంది. ఇంత పటిష్టమైన శాశ్వత భూ హక్కులు ప్రస్తుతం దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేవని రెవెన్యూ ఉన్నతాధికారులు చెబుతున్నారు.
వివాద రహితం చేయడానికే..
భూ వివాదాలతో కోర్టుల చుట్టూ తిరగాల్సి రావడం వల్ల రైతులు ఆర్థికంగా నష్టపోవడమే కాకుండా విలువైన కాలాన్ని వృథా చేసుకుంటున్నారు. ఈ వివాదాలు గొడవలకు, హత్యలకు కూడా దారితీస్తున్నాయి. ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర చేసినప్పుడు అనేక సమస్యలపై పెద్ద సంఖ్యలో ప్రజలు వినతి పత్రాలు ఇచ్చారు. ఇందులో 60 శాతంపైగా భూవివాదాలకు సంబంధించినవే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ సమస్యల పరిష్కారానికి ఏమి చేయాలనే అంశంపై ఆయన విపక్ష నేతగా ఉన్నప్పుడే రెవెన్యూ, న్యాయరంగాల నిపుణులతో చర్చించారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత మరింత సమగ్రంగా చర్చించి శాశ్వత పరిష్కారం కోసం ల్యాండ్ టైట్లింగ్ యాక్టు తేవాలని నిర్ణయించారు.
రియల్‌టైమ్ మ్యుటేషన్
భూములను ఎవరు కొన్నా, అమ్మినా తక్షణమే రియల్ టైమ్‌లో రెవెన్యూ రికార్డుల్లో మ్యుటేషన్ చేస్తారు. రెవెన్యూ, రిజిస్ట్రేషన్, ల్యాండ్ సర్వే, సెటిల్‌మెంట్ విభాగాలన్నీ సమన్వయంతో ల్యాండ్ అథారిటీ కింద పనిచేస్తాయి. దీంతో ఎక్కడ ఎలాంటి లావాదేవీ జరిగినా భూ శాశ్వత హక్కుల రిజిష్టర్‌లో నమోదవుతుంది. ఇందులో ఉన్న భూములను యజమాని నుంచి ఎవరు కొన్నా నష్టపోవడానికి ఆస్కారం ఉండదు. ఈ రిజిష్టర్‌లోని రికార్డులు అన్నీ కచ్చితమైనవని ప్రభుత్వమే వాదిస్తుంది. ఎవరైనా వీటి ఆధారంగా భూములు కొని నష్టపోతే ప్రభుత్వమే నష్టపరిహారం చెల్లిస్తుంది. ఇందుకు బాధ్యుల నుంచి సొమ్ము వసూలు చేయాలని కూడా చట్టంలో ఉంది. దీనివల్ల ఎవరూ రెవెన్యూ రికార్డుల్లో తప్పులు చేయడానికి సాహసించరనే ఉద్దేశంతోనే ఇలాంటి కఠిన నిబంధన పెట్టారు.
అమలు ఇలా..
కొత్త చట్టం వచ్చిన తర్వాత ప్రతి గ్రామంలో రెవెన్యూ రికార్డులను సవరిస్తారు. ఇందుకోసం ప్రతి గ్రామంలో సర్వే నంబర్ల వారీగా భూములకు సంబంధించి భూ యాజమాన్య రికార్డు (1బి రిజిష్టర్), రీ సర్వే రిజిష్టర్ (ఆర్‌ఎస్‌ఆర్), భూ అనుభవ రిజిష్టర్ (అడంగల్) వివరాలను బహిరంగంగా ప్రకటిస్తారు. దీనిపై ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే తెలియజేయడానికి నెల రోజులు సమయం ఇస్తారు. ముఖ్య కార్యదర్శి హోదాకు తగ్గని అధికారి నేతృత్వంలో రాష్ట్ర స్థాయిలో ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ అథారిటీ ఏర్పాటు చేస్తారు. ఈ అధికారి కింద ల్యాండ్ టైట్లింగ్ అధికారులను నియమిస్తారు. భూమి హక్కులను రిజిష్టర్ చేసే బాధ్యత ల్యాండ్ టైట్లింగ్ అధికారిదే. నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత నెల రోజుల్లో ఫిర్యాదులు రాని భూముల వివరాలను జిల్లా, మండలం, గ్రామం, సర్వే నంబర్ల వారీగా రిజిస్టర్ చేస్తారు. సర్వే నంబర్ల వారీగా ఎవరెవరికి ఎంత భూమి ఉందో నిర్ధారణ అవుతుంది. ఇది తాత్కాలిక టైట్లింగ్ రిజిష్టర్‌గా ఉంటుంది. ఈ జాబితాతో తుది నోటిఫికేషన్ జారీ చేసి అభ్యంతరాలు కోరతారు. రెండేళ్లలో ఏమీ అభ్యంతరాలు లేకపోతే ఆయా భూముల యజమానులను శాశ్వత హక్కుదారులుగా గుర్తించి రిజిష్టర్ నమోదు చేస్తారు. వీరికి ఆ భూములపై శాశ్వత హక్కులు కల్పిస్తారు. వీటిపై తర్వాత ఎవరికీ ఎక్కడా సవాల్ చేయడానికి హక్కు ఉండదు. ప్రతి మనిషికీ ఆధార్ కార్డు ఉన్నట్లే.. ప్రతి స్థలానికీ ఒక భూధార్ నంబర్‌ను కేటాయిస్తారు.
అభ్యంతరాలు వచ్చిన భూములకు వివాద రిజిష్టర్..
ఫైనల్ నోటిఫికేషన్ జారీ చేసిన సందర్భంగా రెండేళ్లలో అభ్యంతరాలు వచ్చిన భూములన్నింటినీ సర్వే నంబర్ల వారీగా అనుభవదారుల పేర్లు రాసి వివాద రిజిష్టర్‌లో నమోదు చేస్తారు. వివాద రిజిష్టర్‌లోని భూమిపై హక్కులు తమవేనని భావించే వారు జిల్లా స్థాయిలో జాయింట్ కలెక్టర్ నేతృత్వంలోని ట్రిబ్యునల్‌లో కేసు వేయాలి. ట్రిబ్యునల్ తీర్పుపై ఎవరూ సవాల్ చేయకపోతే ఆ భూములన్నీ శాశ్వత టైట్లింగ్ రిజిష్టర్‌లో నమోదు చేస్తారు. ఒకవేళ ఎవరైనా సవాల్ చేయాలంటే నెల రోజుల్లోగా న్యాయమూర్తి నేతృత్వంలోని స్టేట్ లెవల్ అప్పిలేట్ ట్రిబ్యునల్‌కు అప్పీల్‌కు వెళ్లవచ్చు. భూములకు సంబంధించి ఎలాంటి వివాదాలున్నా ఈ రెండు ట్రిబ్యునళ్లకే వెళ్లాలి. కోర్టుకు వెళ్లడానికి వీలులేదు. ఎవరైనా కోర్టుకు వెళ్లినా ఆ కేసులను కోర్టులు ట్రిబ్యునళ్లకే పంపుతాయి. కోర్టులకు ప్రత్యామ్నాయ, సమాంతర (ప్యారలల్) అధికారాలు ఉండవు. రాష్ట్ర స్థాయి ట్రిబ్యునల్ తీర్పుపై ఎవరికైనా అభ్యంతరాలుంటే హైకోర్టులో సవాల్ చేయవచ్చు. హైకోర్టులో భూ వివాదాలను విచారించడానికి ప్రత్యేకంగా ఒక బెంచి ఉంటుంది. దీనినే వివాద పరిష్కార మార్గం (గ్రీవెన్స్ రెడ్రెసల్ ఛానల్) అంటారు. జిల్లా, రాష్ట్ర స్థాయి ట్రిబ్యునళ్లకు జ్యుడీషియల్ హోదా ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment