చట్టమై వచ్చిన స్వప్నం  | Successful Land Rights Act in the state | Sakshi
Sakshi News home page

చట్టమై వచ్చిన స్వప్నం 

Published Thu, Dec 14 2023 5:58 AM | Last Updated on Thu, Dec 14 2023 3:48 PM

Successful Land Rights Act in the state - Sakshi

అడుగడుగునా భూ వివాదాలు..  పేట్రేగిపోతున్న భూ మాఫియా..  అస్తవ్యస్తమైన భూ రికార్డుల వ్యవస్థ..  సివిల్‌ కోర్టుల్లో పేరుకుపోయిన  లక్షలాది భూ వివాద కేసులు..  దశాబ్దాలుగా వ్యవస్థను స్తంభింపజేస్తున్న  ఈ సమస్యలన్నింటికీ పరిష్కారం?  ..లాండ్‌ టైట్లింగ్‌ చట్టం మాత్రమే  భూ చట్టాల నిపుణులు ఎన్నో ఏళ్లుగా  చెబుతున్న వాస్తవమిది. 

రాష్ట్రాలు ఈ చట్టం అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వాలు స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి చెబుతూనే ఉన్నాయి. కానీ, ఈ చట్టాన్ని ఎలా అమలు చేయాలో తెలియక అనేక రాష్ట్రాలు ప్రయత్నించి విఫలమయ్యాయి. దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలో వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం సాహసోపేతంగా లాండ్‌ టైట్లింగ్‌ చట్టాన్ని సమర్ధవంతంగా అమల్లోకి తెచ్చింది. మన రాష్ట్రంలో మాత్రమే ఇది సఫలీకృతమైంది. ఈ చట్టం గురించి అవగాహన లేక, ప్రజల విశాల ప్రయోజనాలు పట్టక కొందరు విమర్శలు చేస్తున్నారు. 

సాక్షి, అమరావతి: భూ యజమానుల హక్కులకు భరోసా ఇచ్చే ఈ చట్టం కోసం ఏపీ ప్రభుత్వం చాలా శ్రమించింది. అనేక ప్రయత్నాల తర్వాతే చట్టాన్ని అమల్లోకి తీసుకురాగలిగింది. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేసిన పాదయాత్రలో ఎక్కువగా భూ సమస్యలు ఆయన దృష్టికి వచ్చాయి. వాటన్నింటికీ పరిష్కారం చూపాలని అప్పుడే నిర్ణయించుకున్నారు. 2019లో అధికారంలోకి వచ్చిన వెంటనే భూముల సమస్యల పరిష్కారానికి దేశంలో ఎక్కడా లేని విధంగా లాండ్‌ టైట్లింగ్‌ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టారు.

భూముల రీ సర్వేను కూడా చేపట్టారు. రీ సర్వే విజయవంతంగా జరుగుతున్నా లాండ్‌ టైట్లింగ్‌ బిల్లు విషయంలో ఆటంకాలు ఎదురయ్యాయి. అసెంబ్లీ ఆమోదించిన బిల్లును కేంద్రం ఆమోదం కోసం పంపినప్పుడు రకరకాల సమస్యలు ఏర్పడ్డాయి. వాటన్నింటినీ ఓపిగ్గా పరిష్కరించుకుని ఇటీవలే మార్గం సుగమం చేసుకుంది. కేంద్రం ఆమోదం తర్వాత అక్టోబర్‌ 31వ తేదీ నుంచి రాష్ట్రంలో ఆ చట్టాన్ని అమల్లోకి తీసుకువచ్చింది. 

ఎన్డీఏ వచ్చాక డీఐఎల్‌ఆర్‌ఎంపీ పథకం  
కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఏన్డీఏ ప్రభుత్వం ఏర్పడ్డాక ఎన్‌ఐఎల్‌ఆర్‌ఎంపీ పథకం డిజిటల్‌ ఇండియా ల్యాండ్‌ రికార్డ్స్‌ మోడరనైజేషన్‌ ప్రోగ్రాం (డీఐఎల్‌ఆర్‌ఎంపీ)గా మారింది. ఎన్‌ఐఎల్‌ఆర్‌ఎంపీలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యం ఉండగా, డీఐఎల్‌ఆర్‌ఎంపీలో వంద శాతం నిధులు తామే భరిస్తామని ఎన్డీఏ ప్రభుత్వం తెలిపింది. 2024 నాటికి దేశవ్యాప్తంగా టైటిల్‌ గ్యారంటీ వ్యవస్థ తేవడమే లక్ష్యంగా పని చేయాలని నిర్దేశించింది.

అదే క్రమంలో 2015లో ఒకసారి, 2019లో మరోసారి ముసాయిదా చట్టాల్ని తయారు చేశారు. దీని ప్రకారమే 2019లో నీతి ఆయోగ్‌ ఒక నివేదిక ఇచ్చి దేశంలో టైటిల్‌ గ్యారంటీ చట్టం ఎలా తీసుకురావాలో సూచించింది. నీతి ఆయోగ్‌ చెప్పిన ప్రకారమే ఏపీ ప్రభుత్వం దేశంలోనే తొలిసారిగా లాండ్‌ టైట్లింగ్‌ చట్టాన్ని తీసుకువచ్చింది. భూ హక్కులకు భరోసా ఇచ్చేందుకు దేశవ్యాప్తంగా అమలు చేయాలనే లక్ష్యాన్ని మొదట సాధించిన రాష్ట్రంగా ఏపీ నిలిచింది. 

రాజస్థాన్‌లో విఫలం 
2015లో కేంద్ర ముసాయిదా చట్టం తయారైనప్పుడు రాజస్థాన్‌ ప్రభుత్వం ఆ రాష్ట్రంలో లాండ్‌ టైట్లింగ్‌ చట్టం తేవడానికి ప్రయత్నం చేసింది. దాన్ని పట్టణ ప్రాంత భూములకు మాత్రమే పరిమితం చేస్తూ టైటిల్‌ సరి్టఫికేషన్‌ చట్టం తెచ్చారు. అయినా సరిగా అమలు చేయలేకపోయారు. 

30 ఏళ్ల క్రితమే బీజం 
వాస్తవానికి దేశంలో భూ హక్కులకు భరోసా ఇవ్వాలనే ప్రయత్నం 1989లో మొట్టమొదటిగా చట్టబద్ధంగా మొదలైంది. అప్పటి ప్లానింగ్‌ కమిషన్‌ ప్రొఫెసర్‌ డీసీ వాద్వా ఆధ్వర్యంలో ఏక సభ్య కమిషన్‌ను కేంద్రం నియమించింది. అప్పట్లో మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ ప్లానింగ్‌ కమిషన్‌ డిప్యూటీ చైర్మన్‌గా ఉన్నారు. దేశంలో భూమి రికార్డులను అధ్యయనం చేసి ఎలాంటి రికార్డుల వ్యవస్థ ఉండాలో నివేదిక ఇవ్వాలని వాద్వా కమిటీని కేంద్రం కోరింది. ఆ కమిషన్‌ దేశమంతా తిరిగి అధ్యయనం చేసి 1990లో ఒక ప్రాథమిక నివేదిక ఇచ్చింది.

దేశంలో ఇప్పుడున్న రికార్డుల వ్యవస్థ స్థానంలో భూమి హక్కులకి ప్రభుత్వమే పూర్తి భరోసా ఇచ్చే టైటిల్‌ గ్యారంటీ వ్యవస్థ ప్రవేశపెట్టాలని సిఫారసు చేసింది. భూమి రికార్డుల వ్యవస్థలో ఉన్న లోపాలన్నింటినీ ఆయన తన నివేదికలో వివరించారు. రికార్డుకి గ్యారంటీ లేకపోవడంవల్లే దేశంలో భూ వివాదాలు పెరుగుతున్నాయని, గ్యారంటీ ఇస్తే  వివాదాలు తగ్గుతాయని స్పష్టం చేసింది. తద్వారా పెట్టుబడులు పెరుగుతాయని, ఆర్థికాభివృద్ధి వేగవంతం కావాలంటే ఇలాంటి వ్యవస్థ రావాలని వాద్వా ఆ నివేదికలో పేర్కొన్నారు. 

బ్రిటిష్‌ హయాం నుంచి ఆలోచనలు 
భూ హక్కులకు గ్యారంటీ ఇచ్చేందుకు బ్రిటిష్‌ హయాం నుంచే ప్రయత్నాలు మొదలయ్యాయి. 1900 సంవత్సరంలో తొలిసారి ఈ ఆలోచన పుట్టింది. ఆ తర్వాత 1908లో రిజి్రస్టేషన్‌ చట్టం వచ్చినప్పుడే టైటిల్‌ గ్యారంటీ వ్యవస్థ తేవాలని చూశారు. కానీ అప్పుడు పరిస్థితులు అనుకూలంగా లేవు. పేదరికం, నిరక్షరాస్యత వల్ల అప్పట్లో ఆ ఆలోచలను విరమించుకున్నారు.

1971లో రికార్డ్‌ ఆఫ్‌ రైట్స్‌ (ఆర్‌ఓఆర్‌) చట్టం వచ్చినప్పుడు కూడా దీనిపై ఒక చర్చ జరిగింది. అప్పుడూ సాధ్యం కాలేదు. ఆ తర్వాత 1989లో ఆ చట్టం తేవడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. కానీ ఏ రాష్ట్రంలోనూ ఆచరణాత్మకంగా ఒక చట్టం రాలేదు. ఏపీ మాత్రమే ఈ చట్టాన్ని తీసుకువచ్చింది. భూముల వ్యవస్థలో ఇది ఒక కొత్త అధ్యాయంగానే చెప్పాలి.   – సునీల్‌కుమార్, భూ చట్టాల నిపుణులు, నల్సార్‌ లా వర్సిటీ అసోసియేట్‌ ప్రొఫెసర్‌  

2004లో నేషనల్‌ లాండ్‌ రికార్డ్స్‌ మోడరనైజేషన్‌ ప్రోగ్రాం 
వాద్వా కమిటీ సిఫారసుల ఆధారంగానే 2004లో అప్పటి యూపీఏ ప్రభుత్వం భూమి రికార్డులపై   నేషనల్‌ ల్యాండ్‌ రికార్డ్స్‌ మోడరనైజేషన్‌ ప్రోగ్రాం (ఎన్‌ఎల్‌ఆర్‌ఎంపీ) తెచ్చింది. భూమి రికార్డులన్నింటినీ కంప్యూటరీకరించడం, రికార్డుల స్వచ్చికరణ, అన్ని శాఖలతో వాటిని అనుసంధానం చేయడం.. అంతిమంగా టైటిల్‌ గ్యారంటీ వ్యవస్థ తేవాలనేది ప్రాజెక్టు లక్ష్యం. ఈ ప్రాజెక్టు ఆధారంగానే 2005–06లో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఉమ్మడి రాష్ట్రంలో నిజామాబాద్‌ జిల్లాలో భూ భారతి పేరుతో ఒక  పైలట్‌ ప్రాజెక్టు చేపట్టారు.

జిల్లా మొత్తం కొత్త టెక్నాలజీతో రీ సర్వే చేసి టైటిల్‌ గ్యారంటీ ఇవ్వాలనే ప్రయత్నం అప్పట్లోనే జరిగింది. కానీ, ఆయన హఠాన్మరణంతో ఆ ప్రాజెక్టు ఆగిపోయింది. సర్వే జరిగింది కానీ ఆ రికార్డును నోటిఫై చేయలేదు. చట్టం కూడా రాలేదు. 2009లో యూపీఏ–2 ప్రభుత్వం టైట్లింగ్‌ వ్యవస్థ కోసం ఒక ముసాయిదా చట్టాన్ని తీసుకువచ్చింది. అప్పటి నుంచి ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement