సాక్షి, సంజామల(కర్నూలు) : ఒకప్పుడు అక్కడ ఊరుండేది. ఎన్నెన్నో ఊసులు ఉండేవి. జన జీవనంతో ఊరు సందడిగా ఉండేది. కాలక్రమేణ ఒక్కరొకరూ ఊరు వదిలి వెళ్లారు. దీంతో గ్రామం ఖాళీ అయింది. అప్పటి ప్రజలు నివాసమున్న ఇళ్ల శిథిలాలను కొందరు కూల్చేసి ఆ ప్రదేశాన్ని ఇప్పుడు సాగుకు అనుకూలంగా మలుచుకున్నారు. అప్పటి ప్రజలు మంచి నీటి కోసం వాడుకున్న ఊటబావి, శిథిలమయిన గుడి..ఇక్కడ ఊరు ఉండేది అనేందుకు సాక్ష్యాలుగా నిలిచాయి.
గ్రామం కనుమరుగై వందేళ్లవుతున్నా రెవెన్యూ రికార్డుల్లో మాత్రం ఊరి పేరు నేటికీ అలాగే ఉంది. ఆ ఊరి పేరే దత్తాపురం. పేరుసోముల, రామభద్రునిపల్లె గ్రామాలకు మధ్యలో ఉండేది. ఇక్కడ ఎక్కువగా బ్రాహ్మణులు నివసించేవారు. గ్రామంలో 120 కుటుంబాలు గతంలో ఉండేవి. మొత్తం 1,198 ఎకరాల విస్తీర్ణంలో భూమి ఉంది.
ఇందులో 723 ఎకరాలు సాగుభూమి ఉంది. నివాస గృహాలు 15 ఎకరాల విస్తీర్ణంలో ఉండేవి. గ్రామం కనుమరుగు కావడంతో భూములన్నీ పేరుసోముల, రామిరెడ్డిపల్లె, రామభద్రునిపల్లె గ్రామాలకు చెందిన రైతులు ఇక‍్కడ భూములను సాగు చేసుకుంటున్నారు. శిథిలమైన నివాస గృహాలను పేరుసోముల గ్రామానికి చెందిన కొందరు తొలగించి సాగు చేస్తున్నారు.
నాకు ఊహ రాకముందే ఊరు ఖాళీ అయ్యింది
నాకు 71 సంవత్సరాల వయస్సు ఉంది. నాకు ఊహ రాకముందే ఆ ఊరు ఖాళీ అయింది. మా నాన్నగారు ఉన్నప్పుడు అక్కడ ప్రజలు నివసిస్తుండే వారు. దత్తాపురం వారు ఊరు వదలి వెళ్లడంతో మా ఊరోళ్లు వారి భూములను కొని సాగు చేసుకుంటున్నారు.
– గొల్ల రాముడు, రైతు, పేరుసోముల
Comments
Please login to add a commentAdd a comment