sanjamala
-
అనగనగా ఒక దత్తాపురం
సాక్షి, సంజామల(కర్నూలు) : ఒకప్పుడు అక్కడ ఊరుండేది. ఎన్నెన్నో ఊసులు ఉండేవి. జన జీవనంతో ఊరు సందడిగా ఉండేది. కాలక్రమేణ ఒక్కరొకరూ ఊరు వదిలి వెళ్లారు. దీంతో గ్రామం ఖాళీ అయింది. అప్పటి ప్రజలు నివాసమున్న ఇళ్ల శిథిలాలను కొందరు కూల్చేసి ఆ ప్రదేశాన్ని ఇప్పుడు సాగుకు అనుకూలంగా మలుచుకున్నారు. అప్పటి ప్రజలు మంచి నీటి కోసం వాడుకున్న ఊటబావి, శిథిలమయిన గుడి..ఇక్కడ ఊరు ఉండేది అనేందుకు సాక్ష్యాలుగా నిలిచాయి. గ్రామం కనుమరుగై వందేళ్లవుతున్నా రెవెన్యూ రికార్డుల్లో మాత్రం ఊరి పేరు నేటికీ అలాగే ఉంది. ఆ ఊరి పేరే దత్తాపురం. పేరుసోముల, రామభద్రునిపల్లె గ్రామాలకు మధ్యలో ఉండేది. ఇక్కడ ఎక్కువగా బ్రాహ్మణులు నివసించేవారు. గ్రామంలో 120 కుటుంబాలు గతంలో ఉండేవి. మొత్తం 1,198 ఎకరాల విస్తీర్ణంలో భూమి ఉంది. ఇందులో 723 ఎకరాలు సాగుభూమి ఉంది. నివాస గృహాలు 15 ఎకరాల విస్తీర్ణంలో ఉండేవి. గ్రామం కనుమరుగు కావడంతో భూములన్నీ పేరుసోముల, రామిరెడ్డిపల్లె, రామభద్రునిపల్లె గ్రామాలకు చెందిన రైతులు ఇక్కడ భూములను సాగు చేసుకుంటున్నారు. శిథిలమైన నివాస గృహాలను పేరుసోముల గ్రామానికి చెందిన కొందరు తొలగించి సాగు చేస్తున్నారు. నాకు ఊహ రాకముందే ఊరు ఖాళీ అయ్యింది నాకు 71 సంవత్సరాల వయస్సు ఉంది. నాకు ఊహ రాకముందే ఆ ఊరు ఖాళీ అయింది. మా నాన్నగారు ఉన్నప్పుడు అక్కడ ప్రజలు నివసిస్తుండే వారు. దత్తాపురం వారు ఊరు వదలి వెళ్లడంతో మా ఊరోళ్లు వారి భూములను కొని సాగు చేసుకుంటున్నారు. – గొల్ల రాముడు, రైతు, పేరుసోముల -
వానర సుతునికి పుట్టినరోజు వేడుకలు
సంజామల: సాధారణంగా తల్లిదండ్రులు తమ పిల్లల పుట్టిన రోజు వేడుకలు జరుపుతుంటారు. అయితే, సంజామలకు చెందిన మంగళిరాముడు, వెంకటసుబ్బమ్మ దంపతులు తాము పెంచుకుంటున్న వానరానికి పుట్టిన రోజు వేడుకలు నిర్వహించి ఆదర్శంగా నిలిచారు. గ్రామంలోని కమలమ్మబావి వీధిలో ఏడాది క్రితం ఓ వానరం ప్రసవించిన మరుక్షణమే మృతి చెందింది. అనాథగా మారిన కోతిపిల్లను గ్రామానికి చెందిన మంగళి రాముడు చేరదీశాడు. మొదట్లో పాలు మాత్రమే తాగే కోతిపిల్ల ప్రస్తుతం పండ్లు, బిస్కట్లు తదితర తింటోంది. బుధవారం ఆ వానరం జన్మదినం కావడంతో కొత్తబట్టలు తీసుకొచ్చి తొడిగించారు. వాడలోని వారినంతా పిలిచి వారి సమక్షంలో రాత్రి 9 గంటలకు కేక్ కట్‌చేసి వానరానికి తినిపించారు. ఆంజనేయస్వామిగా భావించి వానరాన్ని అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న మంగళి రాముడు దంపతులను స్థానికులు మెచ్చుకుంటున్నారు. గ్రామానికి చెందిన పాలకేంద్రం నిర్వాహకులు రఘురామయ్య, నాగరాజులు ఉచితంగా కోతికి పాలు పోస్తున్నారు. -
సంజామల సహకార సంఘానికి రాష్ట్ర స్థాయి గుర్తింపుసం
సంజామల: సంజామల సహకార సంఘానికి రాష్ట్ర స్థాయి గుర్తింపు లభించినట్లు సొసైటీ చైర్మన్ పెండేకంటి కిరణ్‌కుమార్ చెప్పారు. స్థానిక సొసైటీలో సోమవారం పాలకవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఆయన మాట్లాడుతూ సంఘం సభ్యులు, సిబ్బంది సహకారంతో సొసైటీ అభివృద్ది బాటలో నడుస్తోందన్నారు. సొసైటీకి ఆప్కాబ్ కంప్యూటరీకరణ సౌకర్యం పైలట్ ప్రాజెక్టుకింద ఎంపికయినట్లు తెలిపారు. వర్గవైసమ్యాలు, రాజకీయాలకతీతంగా సంఘంలో అన్నివర్గాలకు ప్రాధాన్యత కల్పిస్తున్నామన్నారు. సంజామల గతంలో జిల్లాస్థాయిలో గుర్తింపు ఉండేదని ప్రస్తుతం రాష్ట్రస్థాయిలో గుర్తింపు రావడం పట్ల సిబ్బందికి పాలకవర్గ సభ్యులను అభినందించారు. కార్యక్రమంలో చల్లా తిరుపాలయ్య, ఓబులమ్మ, బండి జనార్దన్‌రెడ్డి, సొసైటీ సీఈఓ రవీంద్రనా«ద్గుప్త తదితరులు పాల్గొన్నారు.