భూదాన్ లెక్క తేలుద్దాం
- గణాంకాలతో రెవెన్యూ తికమక
- మూడు వేల ఎకరాల మేర వ్యత్యాసం
- భూముల చిట్టాపై మరోసారి
- యంత్రాంగం కసరత్తు
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: భూదాన్ లెక్క తప్పింది. రెవెన్యూ రికార్డులు, భూదాన్ బోర్డు గణాంకాలకు భారీ వ్యత్యాసం కనిపిస్తోంది. లెక్క తప్పిన ఈ భూములను కొలిక్కి తెచ్చేందుకు అధికార యంత్రాంగం కుస్తీ పడుతోంది. భూదాన్ యజ్ఞ బోర్డు నివేదించిన దాంట్లో దాదాపు 3వేల ఎకరాల మేర తేడా కనిపిస్తోంది. దీన్ని సరిచేసేందుకు క్షేత్రస్థాయిలో మరోసారి సర్వే చేయాలని అధికారులు నిర్ణయించారు. పేదలకు జీవనోపాధి కల్పించాలనే ఉద్దేశంతో ఆచార్య వినోబాభావే పిలుపు మేరకు చాలామంది దాతలు భూదానం చేశారు. ఈ భూముల్లో అధికశాతం పరాధీనమైనట్లు, ల్యాండ్ మాఫియా గుప్పిట్లోకి వెళ్లిపోయినట్లు ఆరోపణలు రావడంతో రాష్ట్ర ప్రభుత్వం భూదాన్ బోర్డును రద్దు చేసి రికార్డులను స్వాధీనం చేసుకుంది. ఈ క్రమంలోనే భూదానం చిట్టా తీయాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదే శించింది.
దీంతో రికార్డుల ఆధారంగా భూముల చిట్టాను రూపొందించింది. అయితే, దీంట్లో రెవెన్యూ రికార్డులకు, భూదాన్ బోర్డు సమర్పించిన అంకెలకు పొంతన కుదరడంలేదు. భూదాన్ బోర్డు లెక్కల ప్రకారం 13,693 ఎకరాలుండగా, రెవెన్యూ రికార్డుల్లో మాత్రం 11,020 ఎకరాలే నమోదైంది. ఇందులో క్షేత్రస్థాయిలో కేవలం 10,717 ఎకరాలు మాత్రమే ఉన్నట్లు సర్వేలో తేలింది. ఈ నేపథ్యంలో తేడా వచ్చిన 2,976 ఎకరాల లెక్క తీసేందుకు రెవెన్యూ యంత్రాంగం కసరత్తు చేస్తోంది. ఇటీవల జరిగిన తహసీల్దార్ల సమావేశంలోనూ ఈ అంశంపై విస్తృత చర్చ జరిపిన జాయింట్ కలె క్టర్ రజత్‌కుమార్ సైనీ భూదాన్ భూములపై సమగ్ర నివేదికను సమర్పించాలని ఆదేశించారు.
అయితే, భూదాన్ బోర్డు ఇచ్చిన కాకిలెక్కలను విశ్వసించడం కన్నా, క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉన్న రికార్డుల ఆధారంగా సమర్పించిన నివేదికను పరిగణనలోకి తీసుకోవాలని అంటున్నారు. సర్వే నంబర్లలో ఉన్న విస్తీర్ణం కంటే ఎక్కువ మొత్తాన్ని దానం చేసినట్లు రికార్డుల్లో పేర్కొనడం కూడా విస్తీర్ణంలో వ్యత్యాసం కనిపించడానికి దారితీసింద ని చెబుతున్నారు. దీనికి ఉదాహరణగా 721 ఎకరాలను చూపుతున్నారు. వీటికి సంబంధించిన సర్వే నంబర్లు ప్రస్తావించకుండా భూమి ఉందని భూదాన్‌బోర్డు వాదించడం విడ్డూరంగా ఉందని అంటున్నారు.
చేతులు మారిన భూమి
భూమిలేని పేదలకు 6,625 ఎకరాలను అసైన్డ్ చేయగా, దీంట్లో ప్రస్తుతం 4,395 ఎకరాలు మాత్రమే వారి ఆధీనంలో ఉందని, మిగతా భూమి పరాధీనమైందని రెవెన్యూ యంత్రాంగం లెక్క తేల్చింది. సదుద్దేశంతో భూ వితరణ చేసిన దాతల లక్ష్యాన్ని నీరుగార్చేలా భూదాన్‌బోర్డే భూములను కొల్లగొట్టిందని విచారణలో తేల్చింది. ఈ మేరకు రాష్ట్ర సర్కారుకు ప్రాథమిక నివేదిక సమర్పించింది. సమగ్ర నివేదికను ఈ నెలాఖరులోగా తయారు చేసి పంపేందుకు కసరత్తు చేస్తోంది.