Bhudan board
-
భూదాన్ యజ్ఞ బోర్డు.. రద్దు సబబే
సాక్షి, హైదరాబాద్: ‘భూదాన్ యజ్ఞ బోర్డును రద్దు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చట్టబద్ధమే. 2015లో జారీ చేసిన జీవో 59 సమర్థనీయమే. చట్ట నిబంధనలను పరిగణనలోకి తీసుకున్నాకే తగిన కారణాలను చూపుతూ సింగిల్ జడ్జి పిటిషన్లను డిస్మిస్ చేశారు. ఆ ఆదేశాల్లో జోక్యం చేసుకోవడానికి చట్టపరమైన కారణాలేవీ కనిపించట్లేదు. బోర్డు రద్దును ప్రశ్నించే చట్టపరమైన హక్కు అప్పీలెంట్ల (చైర్మన్, సభ్యుడు)కు లేదు. అప్పీలెంట్లు చట్టవిరుద్ధంగా భూములను ఇతరులకు అన్యాక్రాంతం చేశారు. దీనిపై క్రిమినల్ కేసులు కూడా నమోదయ్యాయి. అన్ని అంశాలను పరిశీలించి అప్పీళ్లను కొట్టివేస్తున్నాం’ అని హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం తీర్పులో పేర్కొంది. రాష్ట్ర విభజన తర్వాత భూదాన్ ట్రస్ట్ బోర్డును ప్రభుత్వం రద్దు చేసింది. దీనిపై చైర్మన్, ఇతరులు కోర్టును ఆశ్రయించి ఊరట పొందారు. ఆ తర్వాత ప్రభుత్వం మరోసారి బోర్డును రద్దు చేసింది. దీనిపై చైర్మన్ రాజేందర్‌రెడ్డి, సభ్యులు మళ్లీ హైకోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన సింగిల్ జడ్జి.. పిటిషన్లను కొట్టేస్తూ ఆదేశాలిచ్చారు. 2017 జనవరి 6న సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ రాజేందర్‌రెడ్డి, సభ్యుడు సుబ్రహ్మణ్యం ద్విసభ్య ధర్మాసనం ముందు అప్పీల్ చేశారు. ఈ పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జె.శ్రీనివాస్‌రావు ధర్మాసనం విచారణ చేపట్టింది. వాదనలు ముగియడంతో తీర్పు వెలువరించింది. ఏం జరిగిందంటే..ఏపీ భూదాన్ అండ్ గ్రామదాన్ చట్టం–1965 ప్రకారం 2012లో ఏపీ భూదాన్ యజ్ఞ బోర్డు చైర్మన్‌గా జి.రాజేందర్‌రెడ్డి, సభ్యుడిగా సుబ్రమణ్యంతోపాటు మరికొందరిని నాలుగేళ్ల కాలపరిమితితో ప్రభుత్వం నియమించింది. రాష్ట్ర విభజన తర్వాత 2014లో బోర్డు కార్యకలాపాలు చూసేందుకు రెవెన్యూ ముఖ్య కార్యదర్శిని నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం జీవో 11ను జారీ చేసింది. ఈ జీవోను సవాల్ చేస్తూ రాజేందర్‌రెడ్డి, మరికొందరు హైకోర్టులో పిటిషన్లు వేసి ఊరట పొందారు.అనంతరం బోర్డును ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలంటూ రాజేందర్‌రెడ్డి తదితరులకు ప్రభుత్వం 2015లో నోటీసులిచ్చింది. సమాధానం సరిగ్గా లేదంటూ బోర్డును రద్దు చేస్తూ జీవో 59 జారీ చేసింది. దీన్ని సవాల్ చేస్తూ రాజేందర్‌రెడ్డి, మరికొందరు హైకోర్టులో మళ్లీ పిటిషన్లు వేశారు. భూముల కేటాయింపులో అక్రమాలు జరిగాయన్న జడ్జి.. వారి పిటిషన్లను కొట్టేశారు. దీన్ని సవాల్ చేస్తూ రాజేందర్‌రెడ్డి, సుబ్రహ్మణ్యం అప్పీళ్లు దాఖలు చేశారు. తీర్పు కాపీలో కోర్టు ప్రస్తావించిన అంశాలుఢిల్లీలోని మహిళా చేతన కేంద్రం అధ్యక్షు రాలు డాక్టర్ వీణా బెహన్ రాష్ట్ర ప్రభుత్వానికి రాసినట్లు చెబుతున్న నకిలీ లేఖ ఆధారంగా బోర్డు ఏర్పాటైంది. విచారణలో ఆ లేఖ నకిలీదని తేలింది. పదవీకాలంలో బోర్డు చైర్మన్, సభ్యులు అనేక అక్రమాలకు పాల్పడ్డారు. అనర్హులకు భూములను కేటాయించడంతో విలువైన భూములు అన్యాక్రాంతమయ్యాయి. బోర్డును రద్దు చేసే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. కొత్త బోర్డు నియామకమయ్యే వరకు ఆ బాధ్యతలను ప్రభుత్వం అధికారికి అప్పగించవచ్చు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ఓ చోట 100 ఎకరాలు, మరో చోట 50 ఎకరాలు, రైతు డెయిరీకి 35 ఎకరాలు, ఇబ్రహీంపట్నంలోని గోపాల్ గోశాల ట్రస్టుకు 15 ఎకరాలు చట్టవిరుద్ధంగా లీజు, అక్రమంగా కేటాయించారు. ఇష్టం వచ్చిన వారికి హయత్‌నగర్ మండలం బాటసింగారం సర్వే నంబర్ 319లోని 16.32 ఎకరాలను ఇళ్ల స్థలాలకు ఇచ్చేశారు. శంషాబాద్ మండలం పాలమాకుల సర్వే నంబర్ 1 నుంచి 7లోని 32.24 ఎకరాలను ఏడుగురికి అప్పగించారు. ఈ క్రమంలో చైర్మన్, సభ్యులపై పలు క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. దీనిపై సీఐడీ విచారణ కొనసాగుతోంది. తమపై కేసులేవీ లేవని అప్పీలెంట్లు పేర్కొనలేదు. -
భూదాన్ బోర్డు ఏర్పాటు ఎప్పుడు?
ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు సాక్షి, హైదరాబాద్: భూదాన్ బోర్డును రద్దు చేసి రెండేళ్లు కావస్తున్నా ఇప్పటి వర కు తిరిగి ఏర్పాటు చేయకపోవడంపై రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉమ్మడి హైకోర్టు ప్రశ్నించిం ది. ఎప్పటిలోపు బోర్డును ఏర్పాటు చేస్తా రో స్పష్టం చేయాలని, ఈ వ్యవహారానికి సంబంధించి కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను మార్చి 7కు వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కా లిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్‌తో కూడిన ధర్మాసనం ఇటీవల ఉత్తర్వులిచ్చింది. తెలంగాణ భూదాన్ బోర్డును పునరుద్ధరించకపోవడాన్ని సవా లు చేస్తూ సర్వసేవసంఘ్ హైకోర్టులో పిల్ దాఖలు చేసింది. ఈ వ్యాజ్యంపై ఇటీవల ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్ తరఫు న్యాయవాది శ్రేయాస్‌రెడ్డి వాదనలు వినిపించారు. వాటిని పరిగణనలోకి తీసుకున్న ధర్మా సనం, భూదాన్ బోర్డును ఎందుకు ఏర్పా టు చేయడం లేదో వివరణ ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది. -
భూదాన్ లెక్క తేలుద్దాం
- గణాంకాలతో రెవెన్యూ తికమక - మూడు వేల ఎకరాల మేర వ్యత్యాసం - భూముల చిట్టాపై మరోసారి - యంత్రాంగం కసరత్తు సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: భూదాన్ లెక్క తప్పింది. రెవెన్యూ రికార్డులు, భూదాన్ బోర్డు గణాంకాలకు భారీ వ్యత్యాసం కనిపిస్తోంది. లెక్క తప్పిన ఈ భూములను కొలిక్కి తెచ్చేందుకు అధికార యంత్రాంగం కుస్తీ పడుతోంది. భూదాన్ యజ్ఞ బోర్డు నివేదించిన దాంట్లో దాదాపు 3వేల ఎకరాల మేర తేడా కనిపిస్తోంది. దీన్ని సరిచేసేందుకు క్షేత్రస్థాయిలో మరోసారి సర్వే చేయాలని అధికారులు నిర్ణయించారు. పేదలకు జీవనోపాధి కల్పించాలనే ఉద్దేశంతో ఆచార్య వినోబాభావే పిలుపు మేరకు చాలామంది దాతలు భూదానం చేశారు. ఈ భూముల్లో అధికశాతం పరాధీనమైనట్లు, ల్యాండ్ మాఫియా గుప్పిట్లోకి వెళ్లిపోయినట్లు ఆరోపణలు రావడంతో రాష్ట్ర ప్రభుత్వం భూదాన్ బోర్డును రద్దు చేసి రికార్డులను స్వాధీనం చేసుకుంది. ఈ క్రమంలోనే భూదానం చిట్టా తీయాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదే శించింది. దీంతో రికార్డుల ఆధారంగా భూముల చిట్టాను రూపొందించింది. అయితే, దీంట్లో రెవెన్యూ రికార్డులకు, భూదాన్ బోర్డు సమర్పించిన అంకెలకు పొంతన కుదరడంలేదు. భూదాన్ బోర్డు లెక్కల ప్రకారం 13,693 ఎకరాలుండగా, రెవెన్యూ రికార్డుల్లో మాత్రం 11,020 ఎకరాలే నమోదైంది. ఇందులో క్షేత్రస్థాయిలో కేవలం 10,717 ఎకరాలు మాత్రమే ఉన్నట్లు సర్వేలో తేలింది. ఈ నేపథ్యంలో తేడా వచ్చిన 2,976 ఎకరాల లెక్క తీసేందుకు రెవెన్యూ యంత్రాంగం కసరత్తు చేస్తోంది. ఇటీవల జరిగిన తహసీల్దార్ల సమావేశంలోనూ ఈ అంశంపై విస్తృత చర్చ జరిపిన జాయింట్ కలె క్టర్ రజత్‌కుమార్ సైనీ భూదాన్ భూములపై సమగ్ర నివేదికను సమర్పించాలని ఆదేశించారు. అయితే, భూదాన్ బోర్డు ఇచ్చిన కాకిలెక్కలను విశ్వసించడం కన్నా, క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉన్న రికార్డుల ఆధారంగా సమర్పించిన నివేదికను పరిగణనలోకి తీసుకోవాలని అంటున్నారు. సర్వే నంబర్లలో ఉన్న విస్తీర్ణం కంటే ఎక్కువ మొత్తాన్ని దానం చేసినట్లు రికార్డుల్లో పేర్కొనడం కూడా విస్తీర్ణంలో వ్యత్యాసం కనిపించడానికి దారితీసింద ని చెబుతున్నారు. దీనికి ఉదాహరణగా 721 ఎకరాలను చూపుతున్నారు. వీటికి సంబంధించిన సర్వే నంబర్లు ప్రస్తావించకుండా భూమి ఉందని భూదాన్‌బోర్డు వాదించడం విడ్డూరంగా ఉందని అంటున్నారు. చేతులు మారిన భూమి భూమిలేని పేదలకు 6,625 ఎకరాలను అసైన్డ్ చేయగా, దీంట్లో ప్రస్తుతం 4,395 ఎకరాలు మాత్రమే వారి ఆధీనంలో ఉందని, మిగతా భూమి పరాధీనమైందని రెవెన్యూ యంత్రాంగం లెక్క తేల్చింది. సదుద్దేశంతో భూ వితరణ చేసిన దాతల లక్ష్యాన్ని నీరుగార్చేలా భూదాన్బోర్డే భూములను కొల్లగొట్టిందని విచారణలో తేల్చింది. ఈ మేరకు రాష్ట్ర సర్కారుకు ప్రాథమిక నివేదిక సమర్పించింది. సమగ్ర నివేదికను ఈ నెలాఖరులోగా తయారు చేసి పంపేందుకు కసరత్తు చేస్తోంది. -
భూదాన్ బోర్డు రద్దుపై ప్రభుత్వానికి నోటీసులు
కౌంటర్ల దాఖలుకు హైకోర్టు ఆదేశం హైదరాబాద్: భూదాన్ యజ్ఞ బోర్డును రద్దు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 13న జారీ చేసిన 59, 60 జీవోలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు స్పందించింది. ఈ మొత్తం వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలంటూ రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి, హైదరాబాద్ కలెక్టర్లకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను వచ్చే నెలకు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ చంద్రభాను గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. భూదాన్ బోర్డు రద్దు జీవోలను కొట్టేసి, కాల పరిమితి ఉన్నంత కాలం తనను బోర్డు చైర్మన్‌గా కొనసాగించేటట్లు ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ జి.రాజేందర్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. -
‘భూదాన్ బోర్డు’ రద్దు
హైదరాబాద్: రాష్ట్రంలో ప్రస్తు తం ఉన్న ‘ఆంధ్రప్రదేశ్ భూదాన్ యజ్ఞ బోర్డు’ను రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. కొత్త బోర్డు ఏర్పాటయ్యేవరకు బోర్డు విధులను నిర్వహించేందుకు అథారిటీని నియమించింది. అథారిటీ బాధ్యతలను రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శికి అప్పగిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. 2012లో ఏర్పాటైన ఆంధ్రప్రదేశ్ భూదాన్ యజ్ఞ బోర్డు, నిబంధనలకు విరుద్ధంగా రూ.వేల కోట్ల విలువైన భూములను అనర్హులకు కేటాయించిందని ఆరోపణలున్నాయి. బోర్డు ఏర్పాటులోనే అవకతవకలు జరిగాయని ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. దీంతో బోర్డు చైర్మన్, వైస్ చైర్మన్, ఇతర సభ్యులపై వచ్చిన ఆరోపణలు, భూ కేటాయింపులపై సీబీసీఐడీ విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. -
భూదాన్ భూముల చిట్టా...
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: భూదాన్ యజ్ఞబోర్డు మాజీ పాలకవర్గం పాపాల పుట్టను తవ్వేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. చేతులు మారిన భూదాన్ భూముల చిట్టాను విప్పేందుకు ప్రత్యేక అధికారులను రంగంలోకి దించింది. భూదాన్‌బోర్డు ముసుగులో చేసిన అక్రమాలను వెలికితీసేందుకు జిల్లాకు ఆరుగురు డిప్యూటీ కలెక్టర్లను నియమించింది. ఈ మేరకు ఓ.జే మధు, లింగయ్యనాయక్, జి.రమేశ్, కె.సీతారామారావు, ఎం.శేఖర్‌రెడ్డి, కె.ప్రదీప్‌కుమార్‌లను నియమిస్తూ రెవెన్యూశాఖ ముఖ్యకార్యదర్శి బీఆర్.మీనా ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లావ్యాప్తంగా 11,744 ఎకరాల మేర భూదాన్ భూములు ఉన్నట్లు జిల్లా యంత్రాంగం లెక్క తేల్చింది. ఇందులో 7,363 ఎకరాలు భూమిలేని పేదలకు పంపిణీ చేసినట్లు రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. దీంట్లో మూడు వేల ఎకరాలు లబ్ధిదారుల ఆధీనంలో ఉన్నట్లు తేల్చగా, సుమారు 1,600 ఎకరాల మేర ఎన్ ఎస్జీ, ఆక్టోపస్, ఎన్ఐఏ, ఎన్పీఏ సంస్థలకు ప్రభుత్వం కేటాయించింది. ఇవి పోగా, మిగతా భూములు ఎవరి ఆధీనంలో ఉన్నాయనే అంశంపై స్పష్టత రావడంలేదు. వినోభాబావే పిలుపుమేరకు భూదానోద్యమంలో చాలామంది దాతలు విరివిగా భూ వితరణ చేశారు. ఈ భూములను కాపాడాల్సిన యజ్ఞబోర్డు కంచె చేను మేసిన చందంగా కొల్లగొట్టింది. ఈ క్రమంలోనే భూదాన్ బోర్డు పాలకవర్గం నిర్వాకంపై ప్రభుత్వానికి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. బోర్డు ప్రతినిధులు చేసిన అక్రమాలను లోతుగా విచారించి సమగ్ర నివేదికను సర్కారుకు అందజేసే బాధ్యతను డిప్యూటీ కలెక్టర్లకు అప్పగించారు. ఫర్ సేల్..! పేదలకు జీవనోపాధి కల్పించాలనే ఉద్ధేశంతో దాతలు దానం చేసిన భూములు వక్రమార్గంలో పరాధీనమయ్యాయి. శివార్లలో విలువైన భూములు రియల్టర్ల గుప్పిట్లోకి వెళ్లాయి. భూములను పరిరక్షించాల్సిన బోర్డు ప్రతినిధులు.. రియల్టర్లుగా అవతారమెత్తారు. దీంతో ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, యాచారం, హయత్‌నగర్, కీసర తదితర మండలాల్లోని భూదాన్ స్థలాలు అన్యాక్రాంతమయ్యాయి. ఈ క్రమంలో భూదాన్ యజ్ఞబోర్డు చైర్మన్ రాజేందర్‌రెడ్డి కనుసన్నల్లోనే అక్రమాలు జరిగాయనే ఫిర్యాదుల నేపథ్యంలో కేసీఆర్ సర్కా రు.. పాలకవర్గాన్ని రద్దు చేసింది. రికార్డులను కూడా స్వాధీనం చేసుకుంది. ఈ నేపథ్యంలోనే భూదాన్ భూముల స్థితిగతులపై క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించింది. జిల్లాలో అత్యధికంగా ఇబ్రహీంపట్నం 3,060, యాచారం 1,300, మొయినాబాద్ 470, మహేశ్వరం 506, కందుకూరు 530, శంషాబాద్ 564, కీసర 51 ఎకరాల మేర భూదాన్ భూములున్నట్లు లెక్క తేలింది. అయితే, రికార్డులకు అనుగుణంగా భూముల లెక్కలు తేలకపోవడంతో యంత్రాంగం జుట్టుపీక్కుంటోంది. సర్వే నంబర్లలో ఉన్న విస్తీర్ణంకంటే ఎక్కువ మొత్తాన్ని దానం చేసినట్లు రికార్డుల్లో పేర్కొనడం, కొన్నిచోట్ల భూమిని దానం చేసినట్లు ప్రకటించినప్పటికీ, దాతల కుటుంబాల పోజిషన్‌లోనే భూములు ఉన్నట్లు స్పష్టమైంది. మరికొన్ని చోట్ల ఒరిజినల్ పట్టాదారుల స్థానే ఇతరులు సాగు చేసుకుంటున్నట్లు యంత్రాంగం పసిగట్టింది.