వందల ఎకరాలు అన్యాక్రాంతంలో బోర్డు పాత్ర
అప్పీల్‌దారుల నియామకానికి రాసిన లేఖ నకిలీదే
చైర్మన్, సభ్యుల అప్పీళ్లను కొట్టేస్తూ హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం తీర్పు
సాక్షి, హైదరాబాద్: ‘భూదాన్ యజ్ఞ బోర్డును రద్దు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చట్టబద్ధమే. 2015లో జారీ చేసిన జీవో 59 సమర్థనీయమే. చట్ట నిబంధనలను పరిగణనలోకి తీసుకున్నాకే తగిన కారణాలను చూపుతూ సింగిల్ జడ్జి పిటిషన్లను డిస్మిస్ చేశారు. ఆ ఆదేశాల్లో జోక్యం చేసుకోవడానికి చట్టపరమైన కారణాలేవీ కనిపించట్లేదు. బోర్డు రద్దును ప్రశ్నించే చట్టపరమైన హక్కు అప్పీలెంట్ల (చైర్మన్, సభ్యుడు)కు లేదు. అప్పీలెంట్లు చట్టవిరుద్ధంగా భూములను ఇతరులకు అన్యాక్రాంతం చేశారు.
దీనిపై క్రిమినల్ కేసులు కూడా నమోదయ్యాయి. అన్ని అంశాలను పరిశీలించి అప్పీళ్లను కొట్టివేస్తున్నాం’ అని హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం తీర్పులో పేర్కొంది. రాష్ట్ర విభజన తర్వాత భూదాన్ ట్రస్ట్ బోర్డును ప్రభుత్వం రద్దు చేసింది. దీనిపై చైర్మన్, ఇతరులు కోర్టును ఆశ్రయించి ఊరట పొందారు. ఆ తర్వాత ప్రభుత్వం మరోసారి బోర్డును రద్దు చేసింది. దీనిపై చైర్మన్ రాజేందర్‌రెడ్డి, సభ్యులు మళ్లీ హైకోర్టును ఆశ్రయించారు.
విచారణ చేపట్టిన సింగిల్ జడ్జి.. పిటిషన్లను కొట్టేస్తూ ఆదేశాలిచ్చారు. 2017 జనవరి 6న సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ రాజేందర్‌రెడ్డి, సభ్యుడు సుబ్రహ్మణ్యం ద్విసభ్య ధర్మాసనం ముందు అప్పీల్ చేశారు. ఈ పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జె.శ్రీనివాస్‌రావు ధర్మాసనం విచారణ చేపట్టింది. వాదనలు ముగియడంతో తీర్పు వెలువరించింది.
ఏం జరిగిందంటే..
ఏపీ భూదాన్ అండ్ గ్రామదాన్ చట్టం–1965 ప్రకారం 2012లో ఏపీ భూదాన్ యజ్ఞ బోర్డు చైర్మన్‌గా జి.రాజేందర్‌రెడ్డి, సభ్యుడిగా సుబ్రమణ్యంతోపాటు మరికొందరిని నాలుగేళ్ల కాలపరిమితితో ప్రభుత్వం నియమించింది. రాష్ట్ర విభజన తర్వాత 2014లో బోర్డు కార్యకలాపాలు చూసేందుకు రెవెన్యూ ముఖ్య కార్యదర్శిని నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం జీవో 11ను జారీ చేసింది. ఈ జీవోను సవాల్ చేస్తూ రాజేందర్‌రెడ్డి, మరికొందరు హైకోర్టులో పిటిషన్లు వేసి ఊరట పొందారు.
అనంతరం బోర్డును ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలంటూ రాజేందర్‌రెడ్డి తదితరులకు ప్రభుత్వం 2015లో నోటీసులిచ్చింది. సమాధానం సరిగ్గా లేదంటూ బోర్డును రద్దు చేస్తూ జీవో 59 జారీ చేసింది. దీన్ని సవాల్ చేస్తూ రాజేందర్‌రెడ్డి, మరికొందరు హైకోర్టులో మళ్లీ పిటిషన్లు వేశారు. భూముల కేటాయింపులో అక్రమాలు జరిగాయన్న జడ్జి.. వారి పిటిషన్లను కొట్టేశారు. దీన్ని సవాల్ చేస్తూ రాజేందర్‌రెడ్డి, సుబ్రహ్మణ్యం అప్పీళ్లు దాఖలు చేశారు.
తీర్పు కాపీలో కోర్టు ప్రస్తావించిన అంశాలు
ఢిల్లీలోని మహిళా చేతన కేంద్రం అధ్యక్షు రాలు డాక్టర్ వీణా బెహన్ రాష్ట్ర ప్రభుత్వానికి రాసినట్లు చెబుతున్న నకిలీ లేఖ ఆధారంగా బోర్డు ఏర్పాటైంది. విచారణలో ఆ లేఖ నకిలీదని తేలింది. పదవీకాలంలో బోర్డు చైర్మన్, సభ్యులు అనేక అక్రమాలకు పాల్పడ్డారు. అనర్హులకు భూములను కేటాయించడంతో విలువైన భూములు అన్యాక్రాంతమయ్యాయి. బోర్డును రద్దు చేసే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది.
కొత్త బోర్డు నియామకమయ్యే వరకు ఆ బాధ్యతలను ప్రభుత్వం అధికారికి అప్పగించవచ్చు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ఓ చోట 100 ఎకరాలు, మరో చోట 50 ఎకరాలు, రైతు డెయిరీకి 35 ఎకరాలు, ఇబ్రహీంపట్నంలోని గోపాల్ గోశాల ట్రస్టుకు 15 ఎకరాలు చట్టవిరుద్ధంగా లీజు, అక్రమంగా కేటాయించారు. ఇష్టం వచ్చిన వారికి హయత్‌నగర్ మండలం బాటసింగారం సర్వే నంబర్ 319లోని 16.32 ఎకరాలను ఇళ్ల స్థలాలకు ఇచ్చేశారు.
శంషాబాద్ మండలం పాలమాకుల సర్వే నంబర్ 1 నుంచి 7లోని 32.24 ఎకరాలను ఏడుగురికి అప్పగించారు. ఈ క్రమంలో చైర్మన్, సభ్యులపై పలు క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. దీనిపై సీఐడీ విచారణ కొనసాగుతోంది. తమపై కేసులేవీ లేవని అప్పీలెంట్లు పేర్కొనలేదు.
Comments
Please login to add a commentAdd a comment