సాక్షి, అమరావతి: మిరప రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. నల్లతామరతో సహా తెగుళ్ల ప్రభావం ఈసారి పెద్దగా లేకపోవడం.. గతేడాది కంటే మిన్నగా దిగుబడులొచ్చే అవకాశం ఉండటం, మార్కెట్‌లో రికార్డు స్థాయి ధర పలుకుతుండటంతో రైతుల్లో ఉత్సాహం ఉరకలేస్తోంది. రాష్ట్రంలో మిరప సాధారణ విస్తీర్ణం 3.62 లక్షల ఎకరాలు కాగా.. గతేడాది రికార్డు స్థాయిలో 5.12 లక్షల ఎకరాల్లో సాగైంది.
పూతకొచ్చే దశలో విరుచుకుపడిన నల్లతామరకు తోడు అకాల వర్షాలు కోలుకోలేని దెబ్బతీశాయి. ఫలితంగా 60–70 శాతం పంట దెబ్బతినగా, హెక్టార్‌కు 20 క్వింటాళ్లకు మించి దిగుబడి రాలేదు. దీంతో ఈ ఏడాది సాగు విస్తీర్ణం తగ్గుతుందని భావించారు. కానీ.. ఈ ఏడాది రికార్డు స్థాయిలో పంట సాగవుతోంది. ఈ ఏడాది సాగు లక్ష్యం 3.95 లక్షల ఎకరాలు కాగా.. 5.55 లక్షల ఎకరాల్లో రైతులు మిరప సాగు చేస్తున్నారు.
సర్కారు బాసటతో..
నల్లతామర పురుగు ప్రభావంతో గతేడాది తీవ్రంగా నష్టపోయిన మిరప రైతులకు ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో విత్తు నుంచీ ప్రభుత్వం అండగా నిలిచింది. నాణ్యమైన మిరప నారును అందుబాటులో ఉంచడంతోపాటు నల్లతామరను ఎదుర్కొనేందుకు వైఎస్సార్ ఉద్యాన వర్సిటీ రూపొందించిన ప్రోటోకాల్‌పై ఆర్బీకే స్థాయిలో విస్తృత ప్రచారం నిర్వహించింది. ప్రత్యేక పోస్టర్లు, హోర్డింగ్‌లతో పాటు కరపత్రాలు ముద్రించి వలంటీర్ల ద్వారా రైతులకు పంపిణీ చేయించింది.
మిరప ఎక్కువగా సాగయ్యే ప్రాంతాల్లో శాస్త్రవేత్తలు తోట బడులు నిర్వహించి రైతులకు అవగాహన కల్పించారు. వీడియో, ఆడియో సందేశాలతో వాట్సాప్ గ్రూపుల ద్వారా ప్రచారం చేస్తున్నారు. ప్రస్తుతం పంట పూత దశకు చేరుకోగా.. ప్రభుత్వం తీసుకున్న చర్యల కారణంగా ఎక్కడా నల్లతామరతో పాటు ఇతర తెగుళ్ల జాడ కనిపించలేదు. ఫలితంగా దిగుబడులు కూడా ఈసారి గణనీయంగా పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. గతేడాది హెక్టార్‌కు 20 క్వింటాళ్లు రావడం గగనంగా మారగా.. ఈ ఏడాది హెక్టార్‌కు 40–50 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుందని అంచనా వేస్తున్నారు.
రికార్డు స్థాయిలో ధరలు
2020–21లో క్వింటాల్ రూ.13 వేలు పలికిన ఎండు మిర్చి 2021–22లో ఏకంగా రికార్డు స్థాయిలో గరిష్టంగా రూ.27 వేల వరకు పలికింది. ప్రస్తుతం సాధారణ మిరప రకాలు రూ.23 వేల నుంచి రూ.25 వేల వరకు పలుకుతుండగా.. బాడిగ, 341 రకాలు రూ.27,500 వరకు పలుకుతున్నాయి. అంతర్జాతీయంగా ప్రస్తుతమున్న డిమాండ్ కొనసాగి.. ఎగుమతులు ఊపందుకుంటే ధరలు ఇదే రీతిలో కొనసాగే అవకాశాలుంటాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
దిగుబడి బాగా వచ్చేలా ఉంది
నేను మూడెకరాల్లో మిరప వేశా. గతేడాది నల్లతామర పురుగు వల్ల ఎకరాకు 20 క్వింటాళ్లకు మించి దిగుబడి రాలేదు. సేంద్రియ, బిందు, మల్చింగ్ విధానాల్లో సాగు చేయడంతో తెగుళ్ల బెడద కన్పించలేదు. ఎకరాకు 40 క్వింటాళ్ల దిగుబడి వచ్చేలా ఉంది. మార్కెట్‌లో రేటు కూడా బాగుంది. మంచి లాభాలు వస్తాయని ఆశిస్తున్నా.
– కల్యాణం వెంకట కృష్ణారావు, కోనయపాలెం, చందర్లపాడు, ఎన్టీఆర్ జిల్లా
నల్లతామర ప్రభావం లేదు
ఈ ఏడాది నల్లతామర ప్రభావం ఇప్పటివరకు ఎక్కడా కనిపించలేదు. వర్షాలు కాస్త కలవరపెడుతున్నాయి. వాతావరణం అనుకూలిస్తే మంచి దిగుబడులొస్తాయి. గతేడాది హెక్టార్‌కు 20 క్వింటాళ్లు మాత్రమే దిగుబడులొచ్చాయి. ఈ ఏడాది రెట్టింపు వస్తుందని అంచనా వేస్తున్నాం.
– వంగ నవీన్‌రెడ్డి, జొన్నలగడ్డ, గుంటూరు జిల్లా
రికార్డు స్థాయిలో సాగు
గతేడాది నల్లతామర దెబ్బకు ఈసారి విస్తీర్ణం తగ్గిపోతుందనుకున్నాం. కానీ రికార్డు స్థాయిలో రైతులు మిరప సాగు చేస్తున్నారు. ప్రభుత్వం రైతుకు విత్తు నుంచీ తోడుగా నిలవటంతో పంటపై తెగుళ్ల ప్రభావం ఎక్కడా కన్పించడం లేదు. కచ్చితంగా హెక్టార్‌కు 50 క్వింటాళ్లకు తక్కువ కాకుండా దిగుబడి వస్తుందని అంచనా వేస్తున్నాం.
– ఎం.వెంకటేశ్వర్లు, అడిషనల్ డైరెక్టర్, ఉద్యాన శాఖ
Comments
Please login to add a commentAdd a comment