ఆర్బీకేల తనిఖీ తప్పనిసరి | Inspection of rythu bharosa centres is mandatory | Sakshi
Sakshi News home page

ఆర్బీకేల తనిఖీ తప్పనిసరి

Published Fri, Oct 22 2021 4:05 AM | Last Updated on Fri, Oct 22 2021 4:05 AM

Inspection of rythu bharosa centres is mandatory - Sakshi

స్పందనపై గురువారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్లు, జేసీలు, అధికారులతో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

ఆర్బీకేల తనిఖీల్లో.. ఇ– క్రాపింగ్‌ చేసిన తర్వాత డిజిటల్‌ రశీదుతోపాటు, భౌతికంగా కూడా రశీదు ఇస్తున్నారా.. లేదా? అనేది చూడాలి. గ్రామంలో ప్రతి ఎకరా కూడా ఇ– క్రాపింగ్‌ జరగాల్సిందే. సాగుదారు ఎవరు? ఏ పంట సాగుచేస్తున్నారన్నది ప్రధానం. ఆ వివరాలనే నమోదు చేయాలి. ఇ– క్రాపింగ్‌ ఉంటేనే పంటల బీమా, సున్నా వడ్డీ, పంట కొనుగోళ్లు, ఇన్‌పుట్‌ సబ్సిడీ.. ఇలాంటివన్నీ సవ్యంగా జరుగుతాయి.

ప్రత్యక్షంగా, పరోక్షంగా 62 శాతం మంది ప్రజలు వ్యవసాయ రంగంపై ఆధారపడి ఉన్నారు. నవంబర్‌ నుంచి రబీ పనులు ఊపందుకుంటాయి. 56 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతాయి. రబీకి అవసరమైన విధంగా అధికారులు సన్నద్ధం కావాలి. ఈ రంగం ప్రాధాన్యతను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ విషయాన్ని ప్రతిక్షణం మీరు మనసులో పెట్టుకోవాలి. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ దీని మీదే ఆధారపడి ఉంది.  

సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయాలతో పాటు కలెక్టర్లు, జేసీలు రైతు భరోసా కేంద్రాల (ఆర్బీకేలు)ను కూడా తనిఖీ చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. ఎటువంటి డాక్యుమెంట్లతో సంబంధం లేకుండా ఇ–క్రాపింగ్‌ చేయాలని స్పష్టం చేశారు. సీడ్‌ కార్పొరేషన్‌లో ఎంప్యానెల్‌ అయిన కంపెనీలు మాత్రమే విత్తనాలు సరఫరా చేయాలని.. మరెవరైనా ఎంప్యానెల్‌ చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. గురువారం ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి నిర్వహించిన స్పందన వీడియో కాన్ఫరెన్స్‌లో రబీ సన్నద్ధత, ఇ–క్రాపింగ్, కౌలు రైతులకు రుణాలపై కలెక్టర్లు, ఎస్పీలు, జేసీలు, ఉన్నతాధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇ– క్రాపింగ్‌ చేయించడమనేది ఆర్బీకేల ప్రాథమిక విధి అని చెప్పారు. దీనిపై కలెక్టర్లు, జాయింట్‌ కలెక్టర్లు దృష్టి పెట్టాలన్నారు. సీఎం–యాప్‌ పై కూడా కలెక్టర్లు ప్రత్యేక పర్యవేక్షణ చేయాలని సూచించారు. ఎక్కడ రైతులకు ధరల విషయంలో నిరాశాజనక పరిస్థితులు ఉన్నాయో సీఎం –యాప్‌ ద్వారా పర్యవేక్షించి వెంటనే రైతులను ఆదుకునే చర్యలు చేపట్టాలని ఆదేశించారు. జేసీ, మార్కెటింగ్‌ శాఖ అలాంటి పరిస్థితుల్లో వెంటనే జోక్యం చేసుకోవాలని చెప్పారు. జేడీఏలు, డీడీఏలు కూడా 20 శాతం ఇ– క్రాప్‌ తనిఖీలు చేయాలని.. అగ్రికల్చర్, హార్టికల్చర్‌ అధికారులు తప్పనిసరిగా 30 శాతం ఇ–క్రాప్‌ తనిఖీ నిర్వహించాలన్నారు.

వ్యవసాయ సలహా మండలి సమావేశాలు కచ్చితంగా జరిగేలా చూడాలని చెప్పారు. నెలలో మొదటి శుక్రవారం ఆర్బీకేల స్థాయిలో, రెండో శుక్రవారం మండల స్థాయిలో, మూడో శుక్రవారం జిల్లాల స్థాయిలో, నాలుగో శుక్రవారం వ్యవసాయ శాఖ కార్యదర్శి సమక్షంలో రాష్ట్ర స్థాయిలో సమావేశం నిర్వహించాలని, ఈ సమావేశాల్లో వచ్చే సలహాలు, సూచనలు కార్యరూపం దాల్చేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సమావేశంలో సీఎం జగన్‌ ఇంకా ఏమన్నారంటే..

మనం గ్యారెంటీ ఇస్తున్నామనే విషయాన్ని మరవద్దు
► ఆర్బీకేల ద్వారా నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు పంపిణీ చేయాలి. నెల్లూరులో జరిగిన ఘటన నాదృష్టికి వచ్చింది. దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పాం. ఎంప్యానెల్‌ అయిన కంపెనీలకు సంబంధించిన ఉత్పత్తులనే ఇవ్వాలి. సీడ్‌ కార్పొరేషన్‌.. ఈ ఉత్పత్తులను సమగ్రంగా పరిశీలించాలి. సీడ్‌ కార్పొరేషన్‌లో ఎంప్యానెల్‌ అయిన కంపెనీలు మాత్రమే సరఫరా చేయాలి. 
► మరెవ్వరూ ఎంప్యానెల్‌ చేయడానికి వీల్లేదు. అలా చేస్తే సహించేది లేదు. ఆర్బీకేల ద్వారా ఇస్తున్న సీడ్, ఫెర్టిలైజర్స్‌కు రాష్ట్ర ప్రభుత్వం గ్యారెంటీ ఇస్తుందన్న విషయాన్ని మరిచిపోవద్దు. కలెక్టర్లు మొదలుకుని అందరూ కూడా సమష్టిగా బాధ్యత వహించాలి.
► పదిహేను రోజులకొకసారి కలెక్టర్లు ఆర్బీకేలపై సమీక్ష నిర్వహించాలి. విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు ఉంచడానికి ఆర్బీకేల్లోనే గోడౌన్లను ఏర్పాటు చేస్తున్నాం. అప్పటి వరకు స్టోరేజీ కోసం.. అద్దె ప్రాతిపదికన భవనాలు తీసుకోండి. నాకు ఫలానాది కావాలని రైతులు అడిగితే.. కచ్చితంగా సంబంధిత ఆర్బీకే ద్వారా ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు సరఫరా కావాలి. అందుకే వీలైనంత త్వరగా నిర్మాణాలు పూర్తి చేయాలి.  

కౌలు రైతులకు రుణాలిచ్చేందుకు  వెనకడుగు వేయొద్దు
► ఆర్బీకేల్లో బ్యాంకింగ్‌ కరస్పాండెంట్లను ఉంచాలని చెప్పాం. వారి విధులు, కార్యకలాపాలపై కలెక్టర్లు పర్యవేక్షణ చేయాలి. అన్ని ఆర్బీకేల్లో బ్యాంకింగ్‌ కరస్పాండెంట్లు ఉండేలా చర్యలు తీసుకోండి.
► కౌలు రైతులకు సీసీఆర్‌సీ కార్డులు ఇచ్చాం. వారికి పంట రుణాలు అందేలా చర్యలు తీసుకోవాలి. వారికి రైతు భరోసా సహా.. అన్ని రకాలుగా అండగా ఉంటున్నాం. ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇస్తున్నాం. బీమా ఇస్తున్నాం. పంట కొనుగోలుకు కూడా భరోసా ఇస్తున్నాం. 
► ఇలాంటి సందర్భాల్లో వారికి రుణాలు ఇవ్వడానికి బ్యాంకర్లు వెనకడుగు వేయాల్సిన పనిలేదు. అందుకే వారికి రుణాలు అందేలా కలెక్టర్లు దృష్టి పెట్టాలి. కనీస మద్దతు ధరకు సంబంధించి మనం హామీ ఇస్తున్న పోస్టర్‌ను ఆర్బీకేల్లో ప్రదర్శించాలి. అధికారులు సందర్శనకు వెళ్లినప్పుడు ఇది కూడా తనిఖీ చేయాలి. తద్వారా ఏ పంటకు ఎంత రేటు ఇస్తున్నామన్నది రైతుకు భరోసా ఇచ్చినట్లవుతుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement