ఎస్పీలు, కలెక్టర్లు ప్రతి వారం సమావేశం కావాలి. ప్రైవేటు వ్యాపారుల దుకాణాలు పరిశీలించాలి. నాణ్యమైనవి అమ్ముతున్నారా? లేదా? ధరలు అదుపులో ఉన్నాయా? లేవా? గమనించాలి. రైతులకు అవసరమైన ఎరువులు ఇతరత్రా వస్తువులు సరిపడా అందుబాటులో ఉన్నాయా? లేవా? చూడాలి. అప్పుడే నకిలీల బెడద తగ్గుతుంది.
ఉపాధి హామీ పనులకు సంబంధించి గత ప్రభుత్వం ఇవ్వని బిల్లులను ఇప్పుడు మనం ఇవ్వాల్సి వస్తోంది. కేంద్రం నుంచి వచ్చిన డబ్బు కన్నా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అధికంగా ఖర్చు చేశాం. కేంద్రం నుంచి రావాల్సిన నిధులపై కూడా దృష్టి పెడుతున్నాం. కలెక్టర్లు ఈ పనులపై దృష్టి పెట్టి.. ముందుకు సాగేలా చర్యలు తీసుకోవాలి.
– సీఎం వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: డిసెంబర్ నుంచి తాను సచివాలయాలను సందర్శిస్తానని, ప్రతి పర్యటనలో సచివాలయాల పని తీరును పరిశీలిస్తానని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. వచ్చే నెల నుంచి ఎమ్మెల్యేలు వారానికి నాలుగు సచివాలయాలను సందర్శించాలని సూచించారు. గ్రామ, వార్డు సచివాలయాల సందర్శన చాలా ప్రాధాన్యత కార్యక్రమం అని స్పష్టం చేశారు. స్పందన వీడియో కాన్ఫరెన్స్‌లో భాగంగా బుధవారం ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్లు, ఎస్పీలు, జేసీలు, ఉన్నతాధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో సచివాలయాల సందర్శన, ప్రజల వినతుల పరిష్కారం, రైతు భరోసా కేంద్రాలు, వ్యవసాయం, ఉపాధి హామీ పథకం తదితర కార్యక్రమాలపై మార్గ నిర్ధేశం చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ సచివాలయాల సందర్శన ద్వారా అందరిలో బాధ్యత మరింత పెరుగుతుందని, తద్వారా ప్రజలకు మేలు జరుగుతుందని చెప్పారు. కలెక్టర్లు కూడా ప్రతివారం రెండు సచివాలయాలు, జాయింట్ కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు, ఐటీడీఏ పీఓలు, సబ్ కలెక్టర్లు వారానికి నాలుగు సచివాలయాలు తప్పనిసరిగా సందర్శించాలని చెప్పారు.
గ్రామ, వార్డు సచివాలయాలు సందర్శిస్తున్న సమయంలో ఏయే అంశాలపై దృష్టి పెట్టాలో మార్గదర్శకాలు కూడా ఇచ్చామన్నారు. ప్రతి సచివాలయ సిబ్బంది, వలంటీర్లతో కలిపి బృందాలుగా ఏర్పడి ప్రజల్లో అవగాహన, చైతన్యం కలిగించేలా ఆ గ్రామంలో పర్యటించాలని చెప్పామని తెలిపారు. ప్రతినెలా చివరి శుక్రవారం, చివరి శనివారం సిటిజన్ అవుట్ రీచ్ కార్యక్రమం ఉంటుందన్నారు. ఈ నెలలో 24, 25 తేదీల్లో ఈ కార్యక్రమం ఉంటుందని.. ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలు, అందిస్తున్న సేవలు, ముఖ్యమైన ఫోన్ నంబర్లతో కూడిన కరపత్రాన్ని ప్రజలకు అందించాలని ఆదేశించారు.
ప్రజలకు ప్రభుత్వ కార్యక్రమాలపై అవగాహన కలిగించాలన్నారు. ఆయా పథకాలకు అర్హులైన వారు ఇంకా ఏవరైనా మిగిలిపోయి ఉంటే, కొత్తగా ఎవరైనా దరఖాస్తు చేసుకుంటే జూన్, డిసెంబర్ నెలల్లో మంజూరు చేయాలని చెప్పారు. ఎవరి దరఖాస్తునైనా తిరస్కరిస్తే తగిన కారణం చెప్పాలని సూచించారు. ఈ సమీక్షలో సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే..
వివిధ జిల్లాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న సీఎం వైఎస్ జగన్
ఇ క్రాపింగ్‌పై కలెక్టర్లు దృష్టి సారించాలి
► ఇ–క్రాపింగ్ అనేది చాలా ముఖ్యం. ఇది నిరంతర ప్రక్రియ. కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు దీనిపై దృష్టి సారించి, 10 శాతం ఇ–క్రాపింగ్‌ను తనిఖీ చేయాలి. జేడీఏలు, డీడీఏలు 20 శాతం.. అగ్రికల్చర్ అధికారులు, హార్టికల్చర్ అధికారులు 30 శాతం ఇ– క్రాపింగ్‌ను తనిఖీ చేయాలి.
► ఇ– క్రాపింగ్ కింద డిజిటల్, ఫిజికల్ రశీదులు ఇవ్వాలి. భూమి వివరాలు, డాక్యుమెంట్ల కోసం రైతులను ఇబ్బంది పెట్టొద్దు.
అగ్రికల్చర్ అడ్వైజరీ కమిటీ, పంటల ప్లానింగ్
► అగ్రికల్చర్ అడ్వైజరీ కమిటీ సమావేశాలపై దృష్టి పెట్టాలి. ఆర్బీకేలు, మండల, జిల్లా స్థాయిల్లో ఈ సమావేశాలు జరగాలి. ఆర్బీకే స్థాయి సమావేశాల్లో వస్తున్న అంశాలపై మండల స్థాయిలో, మండల స్థాయిలో వస్తున్న అంశాలపై జిల్లా స్థాయి సమావేశాల్లో చర్చ జరగాలి. సమస్యల పరిష్కారంపై సంబంధిత అధికారులు దృష్టి పెట్టాలి. జిల్లా స్థాయిల్లో వస్తున్న అంశాలపై విభాగాధిపతులు, కార్యదర్శులు దృష్టి పెట్టాలి.
► పంటల ప్లానింగ్‌పై అడ్వైజరీ కమిటీ సమావేశాల్లో చర్చ జరగాలి. ఉత్తమ యాజమాన్య పద్ధతులపైనా చర్చించాలి. ఆర్బీకేల పనితీరు, సీహెచ్‌సీల పనితీరుపైనా దృష్టి పెట్టాలి. సీఎం యాప్‌పై కూడా అడ్వైజరీ కమిటీ సమావేశాల్లో చర్చ జరగాలి.
► ఇతర జిల్లాల్లో, ఇతర రాష్ట్రాల్లో ఉత్తమ యాజమాన్య పద్ధతులపై అడ్వైజరీ కమిటీలకు అవగాహన కల్పించే కార్యక్రమంపై దృష్టి పెట్టాలి. ఆర్బీకేలను కలెక్టర్లు సందర్శిస్తున్నప్పుడు కియోస్క్‌ల పనితీరుపై దృష్టి పెట్టాలి. డెలివరీ షెడ్యూలు సరిగ్గా ఉందా? లేదా? అన్నదానిపైనా కూడా దృష్టి పెట్టాలి.
ఆర్బీకేల్లో బ్యాంకింగ్ సేవలు
► ఆర్బీకేల్లో బ్యాంకింగ్ కరస్పాండెంట్లను ఉంచుతున్నారు. వీరు విధులు సక్రమంగా నిర్వహిస్తున్నారా? లేదా? రైతులకు వీరి నుంచి సేవలు అందుతున్నాయా? లేదా? అన్నదానిపై పరిశీలన చేయాలి. ఏమైనా సమస్యలు ఉంటే వీటిని బ్యాంకుల దృష్టికి తీసుకెళ్లడానికి వీలుంటుంది.
► కౌలు రైతులకు రుణాలు అందేలా చూడాలి. వీరిని ఇ– క్రాపింగ్‌తో లింక్ చేశాం. ఇన్‌పుట్ సబ్సిడీ, బీమా, పంటలకు ధరలు కల్పించడం.. ఇవన్నీ కూడా కౌలు రైతులకు అందాలి. కౌలు రైతులకు రైతు భరోసా ఇస్తున్న రాష్ట్రం కూడా మనదే. పంట సాగు చేస్తున్న వారందరికీ పంట రుణాలు అందేలా చర్యలు తీసుకోవాలి.
► ఉపాధి హామీ పనులు మెటీరియల్ కాంపొనెంట్‌కు సంబంధించి విజయనగరం, విశాఖపట్నం, అనంతపురం జిల్లాలు దృష్టి పెట్టాలి. సచివాలయాలు, ఆర్బీకేలు, విలేజ్ క్లినిక్స్, బీఎంసీయూలు, డిజిటల్ లైబ్రరీల పనులు చురుగ్గా సాగాలి.
వైఎస్సార్ డిజిటల్ లైబ్రరీలు
► డిసెంబర్ 31 నాటికి 4,530 పంచాయతీల్లో ఇంటర్నెట్ సదుపాయం అందుబాటులోకి వస్తుంది. అన్ లిమిటెడ్ బ్యాండ్ విడ్త్ అందుబాటులోకి వస్తుంది. వర్క్ ఫ్రం హోం సౌకర్యం గ్రామాల్లో అందుబాటులోకి వస్తుంది. ఆలోగా డిజిటల్ లైబ్రరీలు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలి.
► డిజిటల్ లైబ్రరీల నిర్మాణానికి కావాల్సిన స్థలాలను వెంటనే గుర్తించాలి. ఈ కార్యక్రమంలో పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు గ్రామ, వార్డు సచివాలయాలను తరచూ సందర్శించాలి. అప్పుడే అక్కడి ఉద్యోగుల్లో బాధ్యత మరింత పెరుగుతుంది. మనం వెళ్లకపోతే, అవి ఎలా పని చేస్తున్నాయో చూడకపోతే పరిపాలన మెరుగు పడదు. మీరు ఎంతమేర సందర్శిస్తే.. అంతగా పాలన మెరుగు పడుతుంది. నేను సచివాలయాలు సందర్శించే నాటికి ఎటువంటి ఫిర్యాదులు, లోపాలు కనిపించకూడదు.
Comments
Please login to add a commentAdd a comment