నాడు– నేడు పనులతో కొత్తరూపు సంతరించుకున్న విజయనగరం కొత్తపేట కుమ్మరివీధిలోని పాఠశాల
సాక్షిప్రతినిధి, విజయనగరం: ‘అభివృద్ధే అజెండా.. సంక్షేమమే లక్ష్యం’ అనే నినాదంతో అధికారంలోకి వచ్చిన వైఎస్సార్‌సీపీ విజయనగరం జిల్లాలో పల్లెల రూపురేఖలు మారుస్తోంది. గ్రామాల్లో ప్రజలు ప్రభుత్వ సేవలు పొందడానికి మండల, జిల్లా కేంద్రాలకు వెళ్లి సమయంతో పాటు ఆర్థికంగా నష్టపోతున్న విషయాన్ని ప్రజా సంకల్పయాత్రలో గుర్తించిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టిన ఏడాదిన్నరలోనే వారి కష్టాలకు అడ్డుకట్ట వేశారు. అన్ని సేవలను వారి ముంగిటకే తీసుకొచ్చారు.
గాందీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్య స్థాపనకు అంకురార్పణ చేశారు. ఉన్న ఊళ్లోనే ప్రజలకు 540కి పైగా సేవలు అందించేందుకు గ్రామ సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ‘రైతే రాజు’గా భావిస్తూ సాగుకు సంబంధించి సలహాలు, సేవలు అందించేందుకు, అవసరాలు తీర్చేందుకు గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేయడమే కాకుండా శాశ్వత భవన నిర్మాణాలకు శ్రీకారం చుట్టారు. అలాగే పల్లె ప్రజలకు వారి గ్రామాల్లోనే 24 గంటలు ప్రాథమిక వైద్యసేవలు అందించేందుకు వైఎస్సార్ వెల్‌నెస్ కేంద్రాలు ఏర్పాటు చేయడమే కాకుండా వాటికి భవనాలు నిర్మించేందుకు నిధులు మంజూరు చేశారు. వీటన్నింటికి సంబంధించి జిల్లా వ్యాప్తంగా రూ.465.14 కోట్ల అంచనాతో 1,767 భవనాలు నిర్మించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. వీటితో పాటు విద్యకు ప్రాధాన్యతనిస్తూ ‘మనబడి నాడు–నేడు’ పథకంతో పాఠశాలల సుందరీకరణ, మౌలిక సదుపాయాల కల్పన చేపట్టింది.
వైఎస్సార్ హెల్త్ క్లినిక్‌లకు రూ.84.87 కోట్లు
జిల్లాలో 485 వైఎస్సార్ హెల్త్ క్లినిక్ (వెల్‌నెస్ సెంటర్)ల నిర్మాణానికి ప్రభుత్వం రూ.84.87 కోట్లు మంజూరు చేసింది. ఒక్కో భవన నిర్మాణానికి రూ.17.5 లక్షల వంతున కేటాయించింది. 50 గ్రామాల్లో వీటి నిర్మాణం పూర్తికాగా మిగిలినవి వివిధ దశల్లో ఉన్నాయి.
సచివాలయ భవనాలకు రూ.245.55 కోట్లు
జిల్లాలో 664 గ్రామ సచివాలయ భవనాల నిర్మాణానికి, మెరుగైన వసతులు కల్పించేందుకు ప్రభుత్వం రూ.245.55 కోట్లు మంజూరు చేసింది. భవన నిర్మాణాలను మూడు రకాలుగా విభజించి ఎన్‌ఆర్‌ఈజీఎస్ నుంచి నిధులు మంజూరు చేసింది. టైప్–1లో 465 సచివాలయాలు, టైప్–2లో 142, టైప్–3లో 57 గ్రామ సచివాలయాలను నిర్మిస్తున్నారు. వీటికి వరుసగా రూ.40 లక్షలు, రూ.35 లక్షలు, రూ.25 లక్షల చొప్పున నిధులు మంజూరు చేశారు. జిల్లాలో ఇప్పటికే 302 సచివాలయ భవనాల నిర్మాణం పూర్తయింది.
రైతుభరోసా కేంద్రాలకు రూ.134.72 కోట్లు
ఆరుగాలం శ్రమించే రైతన్నకు నిరంతరం అండగా ఉండేందుకు గ్రామాల్లో 618 రైతుభరోసా కేంద్రాలు ఏర్పాటు చేసింది. సాగుకు సంబంధించిన సలహాలు, సూచనలు ఇవ్వడం, అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంతోపాటు ఎరువులు, విత్తనాలు, పురుగుమందులు కూడా వీటిద్వారానే అందిస్తోంది. వీటికి భవనాలు నిర్మించేందుకు ఒక్కోదానికి రూ.21.8 లక్షల వంతున రూ.134.72 కోట్లు కేటాయించింది. ఇప్పటికే 112 భవనాల నిర్మాణం పూర్తయింది. మిగిలినవాటి పనులు వివిధ దశల్లో ఉన్నాయి.
రూ.230 కోట్లతో పాఠశాలల్లో నాడు–నేడు పనులు
మనబడి నాడు–నేడు కింద పాఠశాలల సుందరీకరణ, మౌలిక సదుపాయాల కల్పన పనులు చురుగ్గా సాగుతున్నాయి. తొలివిడతగా జిల్లాలోని 34 మండలాల్లో 1,060 ప్రభుత్వ పాఠశాలల్లో డెమో స్కూళ్ల పేరుతో సుందరీకరణ పనులు చేపట్టింది. పలుచోట్ల తరగతి గదులు నిర్మించారు. ఫరి్నచర్ ఏర్పాటు చేశారు. ప్రహరీలు నిర్మించారు. ఆహ్లాదకరమైన రంగులతో అందంగా తీర్చిదిద్దారు.
అన్ని సేవలు గ్రామంలోనే
అన్ని సేవలు గ్రామంలోనే అందుతున్నాయి. సచివాలయం ఏర్పాటుతో ఏ సర్టిఫికెట్ కావాలన్నా ఊళ్లోనే జారీ చేస్తున్నారు. నాడు–నేడు పథకంతో పాఠశాలలో అన్ని సదుపాయాలు ఏర్పాటు చేశారు. దీంతో మా పిల్లలను ప్రభుత్వ పాఠశాలకే పంపిస్తున్నాం.
– రాంబార్కి లీలాకుమారి, గృహిణి, కొండకరకం గ్రామం.
రైతుభరోసా కేంద్రం వల్ల ఖర్చు తగ్గింది
గ్రామంలో రైతు భరోసా కేంద్రం ఏర్పాటు చేయడంవల్ల అక్కడే విత్తనాలు, ఎరువులు కొనుక్కుంటున్నాం. గతంలో మండల కేంద్రంలోని వ్యవసాయ కార్యాలయానికి విత్తనాల కోసం పరుగులు తీయాల్సి వచ్చేది. దానివల్ల డబ్బు ఖర్చుతో పాటు, ఒక రోజంతా పట్టేది.
– సిరిపురపు రామునాయుడు, రైతు, కోరుకొండ గ్రామం.
శరవేగంగా అభివృద్ధి పనులు
జిల్లాలో రూ.465 కోట్లకు పైగా నిధులతో గ్రామ సచివాలయ భవనాలు, వెల్‌నెస్ సెంటర్లు, రైతుభరోసా కేంద్రాల భవనాలు నిర్మిస్తున్నాం. ప్రస్తుతం వీటి నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి. ఇప్పటికే జిల్లాలో 302 గ్రామ సచివాలయ భవన నిర్మాణాలు పూర్తయ్యాయి. మరికొన్ని తుదిదశకు చేరుకున్నాయి. వైఎస్సార్ వెల్‌నెస్ సెంటర్లు, రైతు భరోసా కేంద్రాల నిర్మాణాలు జిల్లా వ్యాప్తంగా ప్రారంభమయ్యాయి. ఇప్పటికే వీటన్నింటికి రూ.102 కోట్లకు పైగా బిల్లులు చెల్లించాం. భవన నిర్మాణాల పనులు మార్చి 31 నాటికి పూర్తిచేసేందుకు ప్రయత్నిస్తున్నాం.
– జి.ఎస్.రమేష్ గుప్తా, ఎస్‌ఈ, పంచాయతీరాజ్‌శాఖ.
Comments
Please login to add a commentAdd a comment