రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులు కోరిన ఎరువులు, పురుగు మందులు, విత్తనాలను నిర్దేశిత సమయంలోగా అందజేయాలి. మోతాదుకు మించి అధికంగా ఎరువులు, పురుగు మందులు వినియోగిస్తున్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టిపెట్టాలి. పంటల సాగులో రైతులకు అవగాహన పెంపొందించేలా రూపొందించిన వీడియోలను యాప్ ద్వారా అందుబాటులోకి తేవాలి.
– సీఎం జగన్
సాక్షి, అమరావతి: పెరుగుతున్న వినియోగాన్ని దృష్టిలో ఉంచుకుని మంచి పోషక విలువలు కలిగిన చిరుధాన్యాల సాగును ప్రోత్సహించాలని వ్యవసాయ శాఖ అధికారులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. బోర్ల కింద, వర్షాధార భూముల్లో వరికి బదులు చిరుధాన్యాలను సాగు చేసేలా రైతులను ప్రోత్సహించాలన్నారు. వరికి బదులు చిరుధాన్యాలను సాగు చేయడం ద్వారా మంచి ఆదాయం వస్తుందని రైతుల్లో అవగాహన కల్పించాలని సూచించారు. చిరుధాన్యాల సాగుదారులకు మంచి గిట్టుబాటు ధర లభిస్తుందని భరోసా కల్పించడం వల్ల మరింత మంది రైతులు ముందుకు వస్తారన్నారు. వ్యవసాయ అనుబంధ రంగాలపై ముఖ్యమంత్రి జగన్ బుధవారం క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. వర్షపాతం, పంటలసాగు, ఇ–క్రాపింగ్, వ్యవసాయ సలహామండళ్ల సమావేశాలు, ఎరువుల పంపిణీ, ఆర్బీకేల నిర్మాణ ప్రగతి తదితర అంశాలపై సీఎం సమీక్షించారు.
రైతుల సమస్యలు కచ్చితంగా పరిష్కరించాలి..
గ్రామీణ ప్రాంతాల్లో కీలకమైన వ్యవసాయ సలహా మండళ్ల సమావేశాలు జరుగుతున్న తీరుతెన్నులను పరిశీలించిన ముఖ్యమంత్రి జగన్ జిల్లా స్థాయి ప్రతినిధులతో రాష్ట్ర స్థాయిలో ఒక సమావేశాన్ని నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. అన్నదాతలతో ఏర్పాటైన వ్యవసాయ సలహా మండళ్ల అభిప్రాయాలు, సమస్యలను నేరుగా కలెక్టర్ల దృష్టికి తెచ్చి వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. డ్రైయిన్లు సహా ఇతర పనులపై ఇప్పుడే వివరాలు తెప్పించుకుని తగిన కార్యాచరణ సిద్ధం చేయాలని ఆదేశించారు. రైతుల సమస్యలను కచ్చితంగా తీర్చే బాధ్యతను స్వీకరించి అధికారులు మరింత దృష్టిపెట్టాలని సూచించారు.
వ్యవసాయ అనుబంధ రంగాలపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్
మండళ్లలో లక్ష మంది అన్నదాతలు
వ్యవసాయ సలహా మండళ్లు సత్ఫలితాలనిస్తున్నాయని అధికారులు పేర్కొన్నారు. మార్కెట్లో డిమాండ్ లేని వంగడాల సాగును నిరుత్సాహపరిచేలా మండళ్లు కీలక పాత్ర పోషించాయన్నారు. సుమారు లక్ష మందికిపైగా రైతులు వ్యవసాయ సలహా మండళ్లలో ఉన్నట్లు తెలిపారు.
ఆర్బీకేలకు ఐఎస్‌వో గుర్తింపు లభించేలా..
రైతు భరోసా కేంద్రాల (ఆర్బీకే) ద్వారా రైతులు కోరిన ఎరువులు, పురుగు మందులు, విత్తనాలను నిర్దేశిత సమయంలోగా అందచేయాలని ముఖ్యమంత్రి జగన్ స్పష్టం చేశారు. ఆర్బీకేల పనితీరు, సామర్థ్యాన్ని ఆ మేరకు మెరుగుపరచుకుని నాణ్యమైన వాటిని రైతులకు సమకూర్చేలా ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదేశించారు. ఆర్బీకేల ద్వారా కూడా అన్నదాతల సమస్యలు నేరుగా ఉన్నతస్థాయికి తెలిసే వ్యవస్థను సిద్ధం చేయాలని సూచించారు. అత్యాధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరిజ్ఞానాన్ని ఇందుకు వినియోగించుకోవాలన్నారు. ఆర్బీకేలపై నిరంతర పర్యవేక్షణ, సమీక్ష చేపట్టి పనితీరును మెరుగుపరిచి ఐఎస్‌వో సర్టిఫికేషన్ పొందేలా కృషి చేయాలని సూచించారు. ఎప్పటికప్పుడు నిర్దిష్ట నిర్వహణ ప్రణాళికలు (ఎస్‌వోపీ) రూపొందించుకోవాలన్నారు.
అనుబంధంగా చిన్న గోడౌన్లు
ఆర్బీకేలకు అనుబంధ భవనాలను విస్తరించుకుంటూ చిన్నపాటి గోడౌన్లను ఏర్పాటు చేసుకోవాల్సిందిగా ముఖ్యమంత్రి సూచించారు. అక్కడే విత్తనాలు, ఎరువులు, పురుగు మందులను నిల్వ చేయవచ్చన్నారు. భవనాలను విస్తరించి నిర్మించే వరకూ అద్దె ప్రాతిపదికన కొన్నిటిని తీసుకోవాలని ఆదేశించారు.
ఆర్బీకేల్లో పొలం బడి షెడ్యూల్
వైఎస్సార్ పొలంబడి కార్యక్రమాల షెడ్యూల్‌ను రైతు భరోసా కేంద్రాల్లో పొందుపరచాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. 15 రకాల పంటలపై పొలంబడి కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని, అగ్రికల్చర్ కాలేజీలు, యూనివర్సిటీ విద్యార్థులు అప్రెంటిస్‌షిప్ కింద ఆర్బీకేల్లో విధిగా నిర్దిష్ట కాలం పనిచేసేలా చూడాలని సూచించారు.
ప్రకృతి సేద్యంపై అవగాహన పెరగాలి
నేచురల్ ఫార్మింగ్ (ప్రకృతి వ్యవసాయం)పై రైతులకు అవగాహనను పెంపొందించి ఈ విధానాలను రైతు భరోసా కేంద్రాల్లో ప్రదర్శించాలని సీఎం జగన్ ఆదేశించారు. దీనికి సంబంధించిన సామగ్రి వెంటనే రైతులకు అందుబాటులోకి తేవాలని సూచించారు. వైఎస్సార్ అగ్రి టెస్టింగ్ ల్యాబ్స్‌ను డిసెంబర్‌లో ప్రారంభించనున్నట్లు తెలిపారు.
పంటల సాగుపై వీడియోలతో యాప్..
ఆర్గానిక్ వ్యవసాయ ఉత్పత్తులకు సర్టిఫికేషన్‌తోపాటు మంచి ధర లభించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. మోతాదుకు మించి అధికంగా ఎరువులు, పురుగు మందులు వినియోగిస్తున్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టిపెట్టాలని ఆదేశించారు. ఆర్బీకేలు యూనిట్‌గా మ్యాపింగ్ చేసి రైతులకు పొలంబడి ద్వారా ప్రత్యేక శిక్షణ, అవగాహన కల్పించాలన్నారు. పంటల సాగులో రైతులకు అవగాహన పెంపొందించేలా రూపొందించిన వీడియోలను యాప్ ద్వారా అందుబాటులోకి తేవాలని ఆదేశించారు.
ఇ–క్రాపింగ్.. అన్నిటికీ అదే ఆధారం
పంటల నమోదుకు సంబంధించి ఇ–క్రాపింగ్ చేసిన రైతులకు భౌతిక రశీదులు, డిజిటల్ రశీదులు ఇవ్వాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఇ– క్రాపింగ్‌పై ప్రత్యేక దృష్టిపెట్టాలని, దీనివల్ల పూర్తి పారదర్శకత వస్తుందన్నారు. రుణాలు, సున్నావడ్డీ, ఇన్‌పుట్ సబ్సిడీ, పంటల కొనుగోలు, బీమా... తదితరాలన్నిటికీ ఇ–క్రాపింగ్ ఆధారమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
అన్ని ఆర్బీకేల్లో బ్యాంకింగ్ కరస్పాండెంట్లు
అన్ని ఆర్బీకేల్లో బ్యాంకింగ్ కరస్పాండెంట్లు సేవలందించేలా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. కమ్యూనిటీ హైరింగ్ సెంటర్లలో భారీ పరికరాలు, సామగ్రిని అందుబాటులో ఉంచడమే కాకుండా ప్రతి ఆర్బీకే పరిధిలో రైతులకు అవసరమైన పనిముట్లను వ్యక్తిగతంగా అందించేలా కార్యాచరణ సిద్ధం చేయాలన్నారు. వచ్చే రబీ సీజన్‌లో అందుబాటులోకి తేవాలని సూచించారు.
2,038 ఉద్యాన పోస్టుల భర్తీ
హార్టికల్చర్ విద్యార్హతలు ఉన్నవారు సరిపడా లేకపోవడంతో గ్రామ సచివాలయాల్లో 2,038 ఖాళీ పోస్టులను అగ్రికల్చర్ అభ్యర్థులతో భర్తీ చేయడానికి సీఎం జగన్ అంగీకారం తెలిపారు. వీరికి ఉద్యానవన పంటలపై తగిన శిక్షణ ఇవ్వాలని సీఎం ఆదేశించారు.
సీఎం యాప్ వినియోగంపై శిక్షణ
సీఎం యాప్ వినియోగంపై సచివాలయాల సిబ్బందికి పూర్తి పరిజ్ఞానం ఉండాలని, ఆమేరకు వారికి శిక్షణ, అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. నాణ్యతా ప్రమాణాలు, కోత అనంతరం చర్యలు, వ్యవసాయ ఉత్పత్తుల నాణ్యతపై ఆర్బీకే సిబ్బందికి శిక్షణ ఇవ్వాలని వ్యవసాయ, మార్కెటింగ్ శాఖలకు సూచించారు.
ఇప్పటివరకూ 67.41 లక్షల ఎకరాలు సాగులోకి
రాష్ట్రవ్యాప్తంగా వర్షపాతం, సాగు వివరాలను సమీక్ష సందర్భంగా అధికారులు ముఖ్యమంత్రి జగన్‌కు వివరించారు. బుధవారం వరకూ సాధారణ వర్షపాతం 403.3 మిల్లీమీటర్లు కురవాల్సి ఉండగా 421.7 మిల్లీమీటర్లు కురిసిందని తెలిపారు. నెల్లూరు మినహా అన్ని జిల్లాల్లో సాధారణ లేదా అధిక వర్షపాతం నమోదైందని వివరించారు. ఇక ఖరీఫ్‌లో ఇప్పటివరకు 76.65 లక్షల ఎకరాలు సాగు కావాల్సి ఉండగా 67.41 లక్షల ఎకరాలు సాగులోకి వచ్చినట్లు తెలిపారు. విస్తారంగా వర్షాలు కురుస్తున్నందున మిగిలిన చోట్ల కూడా వేగంగా విత్తనాలు వేస్తున్నట్లు చెప్పారు.
– సమీక్షలో వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, ప్రభుత్వ సలహాదారు (వ్యవసాయం) అంబటి కృష్ణారెడ్డి, ఏపీ స్టేట్ ఆగ్రో డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ బుక్కపట్నం నవీన్ నిశ్చల్, వ్యవసాయ శాఖ స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్య, జెడ్‌బీఎన్‌ఎఫ్ స్పెషల్ సీఎస్ టి.విజయ్‌కుమార్, వ్యవసాయశాఖ కమిషనర్ హెచ్.అరుణ్‌కుమార్, మార్కెటింగ్ శాఖ కమిషనర్ పీఎస్.ప్రద్యుమ్న, ఆర్ధికశాఖ కార్యదర్శి ఎన్.గుల్జార్, ఏపీఎస్‌ఎస్‌డీసీఎల్ వీసీ, ఎండీ గెడ్డం శేఖర్‌బాబు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment