‘ఈ క్రాప్‌’తో తేలనున్న పంటలెక్కలు | accounts clears the e-crop | Sakshi
Sakshi News home page

‘ఈ క్రాప్‌’తో తేలనున్న పంటలెక్కలు

Published Sun, Oct 9 2016 9:55 PM | Last Updated on Fri, Jun 1 2018 8:39 PM

‘ఈ క్రాప్‌’తో తేలనున్న పంటలెక్కలు - Sakshi

‘ఈ క్రాప్‌’తో తేలనున్న పంటలెక్కలు

అనంతపురం అగ్రికల్చర్‌ : ఖరీఫ్‌లో సాగైన పంటల వివరాలు ఈ–క్రాప్‌ బుకింగ్‌తో తేలిపోనున్నాయి. అధికారులు పొలాలకు వెళ్లి పంటల వివరాలను ట్యాబ్‌లలో నిక్షిప్తం చేస్తుండటంతో వాస్తవ సాగు వెల్లడయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే 80 శాతానికి పైగా ఈ–క్రాప్‌ బుకింగ్‌ పూర్తయిన నేపథ్యంలో పంటల వారీగా విస్తీర్ణం కొంత అటుఇటుగా మారినట్లు కనిపిస్తోంది. ప్రధానంగా జిల్లాకు సంబంధించి వేరుశనగ పంట ఎంత విస్తీర్ణంలో వేశారనే విషయం పక్కాగా తెలియనుంది.

జిల్లా మొత్తమ్మీద చూస్తే రికార్డుల ప్రకారం వేరుశనగ జూన్, జులై, ఆగస్టు నెలల్లో 6.10 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో సాగైంది. అయితే ఈ క్రాప్‌ బుకింగ్‌లో 5.75 హెక్టార్ల నుంచి 5.80 లక్షల హెక్టార్లకే పరిమితం కావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. అంటే 30 నుంచి 35 వేల హెక్టార్ల విస్తీర్ణం తగ్గే సూచనలున్నాయి. నాలుగైదు రోజుల్లో ఈ క్రాప్‌ బుకింగ్‌ పూర్తవుతుందని, పూర్తి వివరాలు తెలుస్తాయని అధికారులు చెబుతున్నారు.

విస్తీర్ణం తారుమారు
కొన్ని మండలాల్లో కాగితాల్లో కన్నా ఈ–క్రాప్‌ బుకింగ్‌లో ఎక్కువ విస్తీర్ణం రాగా, మరికొన్ని మండలాల్లో బాగా తగ్గుదల కనిపించింది. అనంతపురం, కళ్యాణదుర్గం, రాప్తాడు, ఆత్మకూరు, బుక్కరాయసముద్రం, గుంతకల్లు, విడపనకల్, ధర్మవరం, రామగిరి, కంబదూరు, కుందుర్పి, గుమ్మగట్ట, కనేకల్లు, కొత్తచెరువు, నార్పల తదితర మండలాల్లో రికార్డుల్లో ఉన్న దానికన్నా సాగు విస్తీర్ణం బాగా తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. గుత్తి, శింగనమల, ఉరవకొండ, చెన్నేకొత్తపల్లి, శెట్టూరు, రాయదుర్గం, డి.హిరేహాల్, సోమందేపల్లి, పుట్టపర్తి, అగళి, అమరాపురం, ముదిగుబ్బ, నల్లమాడ, అమడగూరు తదితర మండలాల్లో రికార్డుల్లో ఉన్న విస్తీర్ణం కన్నా మరింత పెరిగే పరిస్థితి ఉంది. మిగతా మండలాల్లో పెద్ద వ్యత్యాసాలు కనిపించే పరిస్థితి లేదు.

మిగతా పంటల విషయానికి వస్తే కంది, పత్తి, జొన్న, కొర్ర, పెసర, ఉలవ, పొద్దుతిరుగుడు పంటల విస్తీర్ణంలో ఎక్కువ వ్యత్యాసం కనిపించనుండగా, ఆముదం, వరి, మొక్కజొన్న, ఇతర పంటల్లో పెద్దగా తేడా ఉండకపోవచ్చని అంటున్నారు. మొత్తమ్మీద ఖరీఫ్‌లో అన్ని పంటలు 7.60 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో సాగైనట్లు నివేదిక చెబుతుండగా ఈ–క్రాప్‌ పూర్తయితే 7 లక్షల నుంచి 7.10 లక్షల హెక్టార్లకు పరిమితం కావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. కొన్ని చోట్ల పంట తొలగించడం, అక్కడక్కడా కొన్ని సాంకేతిక సమస్యలు ఉండటం, ఈ–క్రాప్‌ ఆలస్యం కావడం వల్ల ఈ ఏడాది వందశాతం కచ్చితమైన సమాచారం రాకపోవచ్చని, వచ్చే ఏడాది మాత్రం వంద శాతం కచ్చితమైన లెక్కలు తీస్తామని చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement