సాక్షి, అమరావతి: గతంలో ఎన్నడూ లేనివిధంగా కౌలు రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలుస్తోంది. గత ప్రభుత్వాలు ఆలోచన కూడా చేయని పంట సాగు హక్కుదారుల చట్టం–2019 తీసుకురావడమే కాదు... పంట సాగుదారు హక్కు పత్రాల (సీసీఆర్సీ) ఆధారంగా వైఎస్సార్ రైతుభరోసా కింద పెట్టుబడి సాయం, పంట రుణాలు, సున్నా వడ్డీ రాయితీతో పాటు వివిధ కారణాలతో చనిపోయిన రైతు కుటుంబాలకు రూ.7 లక్షల పరిహారం అందిస్తున్నారు.
అంతేకాదు.. కౌలురైతులకు ఈ–క్రాప్ నమోదు ప్రామాణికంగా సబ్సిడీ విత్తనాలు, ఎరువులివ్వడమే కాదు, పెట్టుబడి రాయితీ (ఇన్‌పుట్ సబ్సిడీ), ఉచిత పంటల బీమా వంటి సంక్షేమ పథకాలూ అందిస్తున్నారు. ఈ–క్రాప్‌లో నమోదే ప్రామాణికంగా పండించిన పంటలను ఆర్బీకేల ద్వారా అమ్ముకోగలుగుతున్నారు. కానీ, వాస్తవాలకు ముసుగేసి తప్పుడు కథనాలతో ‘ఈనాడు’ నిత్యం బురదజల్లడమే పనిగా పెట్టుకుంది.
వ్యవసాయాన్ని పండుగలా మార్చిన జగన్ ప్రభుత్వంపై అభాండాలు వేస్తూ రైతులను మభ్యపెట్టాలని చూస్తోంది. ‘కౌలు రైతులకు మిగిలింది కంటితుడుపే’ అంటూ సోమవారం ఆ పత్రిక వండివార్చిన కథనంపై అంశాల వారీగా ‘ఫ్యాక్ట్‌చెక్’ ఇదిగో..
ఆరోపణ: కొత్త చట్టం తెచ్చినా చిక్కుముడేనా?
వాస్తవం: భూ యజమాని హక్కులకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా, వారి హక్కులకు రక్షణ కల్పిస్తూనే వాస్తవ సాగుదారులకు పంట సాగుదారు హక్కు పత్రాలను జారీచేస్తోంది. ఇందుకోసం ఏటా ఖరీఫ్ సీజన్ ప్రారంభానికి ముందు రెవెన్యూ శాఖతో కలిసి ఆర్బీకేల ద్వారా గ్రామస్థాయిలో అవగాహనా సదస్సులు నిర్వహిస్తోంది. భూ యజమానులను ఒప్పించి మరీ కౌలుదారులకు సీసీఆర్సీలు జారీచేస్తోంది. 2019 నుంచి∙ఇప్పటివరకు 17.61 లక్షల మంది కౌలు రైతులకు ఈ కార్డులు మంజూరు చేశారు.
ఆరోపణ: పంట రుణాల్లోనూ కోతే..
వాస్తవం: వాస్తవ సాగుదారులందరికీ పంట రుణాలివ్వాలన్న సంకల్పంతో పీఏసీఎస్‌లను ఆర్బీకేలతో అనుసంధానం చేశారు. సీసీఆర్సీ కార్డులున్న వారికి రుణాలు అందిస్తున్నారు. సీసీఆర్సీ పొందలేని కౌలు రైతులను గుర్తించి, వారితో జాయింట్ లయబిలిటీ గ్రూపు (జేఎల్‌జీ)లను ఏర్పాటుచేస్తున్నారు. ఈ గ్రూపుల ద్వారా కౌలుదారులకు పెద్దఎత్తున రుణాలు అందేలా చేస్తున్నారు.
ఇలా 2019 నుంచి ఇప్పటివరకు 9.83 లక్షల మందికి రూ.6,905.76 కోట్ల రుణాలు అందించారు. 2022–23లోనే 2.19 లక్షల మంది కౌలుదారులకు రూ.1,802.74 కోట్ల రుణాలు అందించారు. అంతేకాదు.. రూ.లక్ష లోపు పంటరుణాలు పొందిన కౌలుదారులకు వైఎస్సార్ సున్నావడ్డీ రాయితీ కూడా అందిస్తున్నారు. ఇలా ఇప్పటివరకు 30వేల మందికి రూ.6.26 కోట్ల సున్నా వడ్డీ రాయితీని అందించారు.
ఆరోపణ: రైతుభరోసా సాయమేది?
వాస్తవం: దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే కౌలు రైతులకు పెట్టుబడి సాయం అందిస్తున్నారు. భూమిలేని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన కౌలుదారులతో పాటు అటవీ, దేవాదాయ భూమి సాగుదారులకు కూడా రూ.13,500 చొప్పున మూడు విడతల్లో రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా అందిస్తోంది. 16 లక్షల మంది కౌలుదారుల్లో 6 శాతం మందికి మాత్రమే రైతుభరోసా అందుతుందనడంలో వాస్తవంలేదు. మెజారిటీ కౌలుదారులు సొంత భూమి కూడా కలిగి ఉన్నారు.
వీరందరికీ భూ యజమానిగా వైఎస్సార్ రైతుభరోసా కింద పెట్టుబడి సాయం అందుతోంది. సీసీఆర్సీ కార్డులు పొందిన కౌలు రైతులు సమీప ఆర్బీకేల్లో దరఖాస్తు చేసుకుంటే చాలు ‘భరోసా’ అందిస్తున్నారు. సొంత భూమిలేకుండా పూర్తిగా కౌలుకి మాత్రమే సాగుచేస్తున్న దాదాపు 1.24 లక్షల మందికి రైతుభరోసా సాయం అందిస్తున్నారు. సీసీఆర్సీ కార్డుల ఆధారంగా వైఎస్సార్ రైతుభరోసా కింద 46 నెలల్లో 3.92 లక్షల మందికి రూ.529.07 కోట్ల పెట్టుబడి సాయం అందించారు.
ఆరోపణ: కౌలురైతులకు అందని సంక్షేమ ఫలాలు..
వాస్తవం: కౌలుదారులకు సంక్షేమ ఫలాలు అందడం లేదనడంలో ఏమాత్రం వాస్తవంలేదు. వైఎస్సార్ రైతుభరోసాతో సహా భూ యజమానులకు వర్తింçపజేసే సంక్షేమ ఫలాలన్నీ భూమిలేని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సాగుదారులకు కూడా వర్తింపజేస్తున్నారు. సీసీఆర్సీ కార్డు ఉన్నా లేకున్నా కూడా అందిస్తున్నారు.
ఈ–క్రాప్ బుకింగ్ ఆధారంగా 2019–20లో 6,331 మందికి రూ.5.73 కోట్లు, 2020–21లో 1.38 లక్షల మందికి రూ.140.70 కోట్లు, 2021–22లో 68,911 మందికి రూ.77.84 కోట్ల పంట నష్టపరిహారం (ఇన్‌పుట్ సబ్సిడీ), ఖరీఫ్–2020లో 51,238 మందికి రూ.156.80 కోట్లు, ఖరీఫ్–21 సీజన్‌లో 1,21,735 మందికి రూ.330.34 కోట్ల పంటల బీమా పరిహారంతో పాటు 2.50 లక్షల మంది రైతులకు రూ.3,500 కోట్ల సబ్సిడీతో కూడిన 8వేల క్వింటాళ్ల విత్తనాలు అందించారు.
Comments
Please login to add a commentAdd a comment