
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వినూత్నంగా చేపట్టిన ఎలక్ట్రానిక్ పంట నమోదు (ఇ–పంట) కార్యక్రమం సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైంది. 13 జిల్లాలు, 670 మండలాల్లోని 10,641 వైఎస్సార్ రైతుభరోసా కేంద్రాలలో పంట నమోదును రెవెన్యూ, వ్యవసాయాదికారులు సంయుక్తంగా చేపట్టారు. వచ్చే నెల 31 వరకు జరిగే ఈ కార్యక్రమంలో ప్రస్తుత ఖరీఫ్‌లో సాగయ్యే అన్ని రకాల పంటలనూ నమోదు చేసి రైతుల మొబైల్ ఫోన్లకు సందేశం పంపుతారు. రైతులకు ముందస్తు సమాచారం ఇచ్చి నేరుగా పొలానికి వెళ్లి పంట వివరాలను ఇ–పంట యాప్‌లో నమోదు చేస్తున్నారు. ప్రస్తుత ఖరీఫ్‌లో సాగయ్యే సుమారు 40 లక్షల హెక్టార్ల పంటలను ఇందులో నమోదు చేస్తారు. రాష్ట్రంలో ఇలా నమోదు చేయడం ఇదే ప్రథమం. భూమికి సంబంధించిన సమస్త సమాచారాన్ని అధికారులు నమోదు చేస్తున్నారు.
అనుమానాలుంటే 155251కు కాల్ చేయండి
ఇదిలా ఉంటే.. రైతులు తమ సందేహాలు, ఇతరత్రా అనుమానాల నివృత్తికి తమ సమీపంలోని రైతు భరోసా కేంద్రాలను లేదా 155251 టోల్ ఫ్రీ కాల్ సెంటర్‌కు ఫోన్ చేయవచ్చునని వ్యవసాయ శాఖ కమిషనర్ హెచ్.అరుణ్‌కుమార్ తెలిపారు. కాగా, రాష్ట్రంలో ఇ–పంట నమోదు ప్రారంభమైందని, ఇది శుభారంభమని వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు అభిప్రాయపడ్డారు.