ప్రతి గింజనూ కొంటాం: మంత్రి కన్నబాబు | Kurasala Kannababu Comments On Chandrababu about Grain Purchase | Sakshi
Sakshi News home page

ప్రతి గింజనూ కొంటాం: మంత్రి కన్నబాబు

Published Sun, Dec 12 2021 2:43 AM | Last Updated on Sun, Dec 12 2021 1:37 PM

Kurasala Kannababu Comments On Chandrababu about Grain Purchase - Sakshi

సాక్షి, అమరావతి: భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న ప్రతి ధాన్యం గింజను ప్రభుత్వమే రైతు భరోసా కేంద్రాల ద్వారా కొనుగోలు చేస్తుందని వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు స్పష్టం చేశారు. అన్నదాతలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని,  ఇప్పటికే 7,681 ఆర్బీకేల్లో ధాన్యం కొనుగోలు చేయాలని మ్యాపింగ్‌ చేశామని తెలిపారు. వచ్చింది వచ్చినట్లుగా కొనుగోలు చేస్తున్నామని, ప్రతి ఆర్బీకేకి మిల్లులను అనుసంధానం చేశామని వివరించారు. వర్షాల వల్ల తేమ శాతం అధికంగా ఉన్న ధాన్యం కొనుగోలుపై ప్రధానంగా దృష్టి సారించినట్లు చెప్పారు. శనివారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి కన్నబాబు మీడియాతో మాట్లాడారు. 

టీడీపీ హయాంలో ఏనాడైనా కొన్నారా?
రంగు మారిన ధాన్యాన్ని టీడీపీ హయాంలో ఏనాడైనా కొనుగోలు చేశారా? కొనుగోళ్లలో మిల్లర్ల జోక్యాన్ని నియంత్రించాలని ఏనాడైనా ఆలోచించారా? మంచి ధాన్యానికి, రంగు మారిన ధాన్యానికి ఒకే ధర ఇస్తారా? చంద్రబాబు అలా ఇచ్చారా? చంద్రబాబుకు అధికారం పోయిందని ఈనాడులో అడ్డమైన రాతలు రాస్తారా? వరికి కన్నీటి తడి కాదది.. ఈనాడు కంట తడే అందులో కనిపించింది. ఆర్బీకేల ద్వారా రైతులకు చేస్తున్న మేలు కనపడటం లేదా? సీఎం జగన్‌ను శత్రువుగా చూడటం మాత్రమే వారికి తెలుసా? ప్రెస్‌ మీట్లు పెట్టి చంద్రబాబు పచ్చి అబద్ధాలు చెబుతున్నారు. ప్రజలకు చూపించాల్సింది ‘చంద్ర’ వీడియోలు కాదు. నిన్న రాష్ట్రానికి వచ్చి మాట్లాడిన రిటైర్డ్‌ న్యాయమూర్తి జస్టిస్‌ చంద్రు వీడియోలను చూపిస్తే బాగుంటుంది. 

ప్యాకేజీ చాలని స్వీట్లు పంచుకోలేదా?
విడిపోయిన తరువాత రాష్ట్రానికి తొలి సీఎంగా ఉన్న చంద్రబాబుకు విభజన హామీలు ఏమయ్యాయని అడగటానికి సిగ్గుండాలి. ప్రత్యేక హోదా వద్దు.. ప్యాకేజీ చాలని బాబు బృందం స్వీట్లు పంచుకుని పండగ చేసుకోలేదా? అమరావతికి మట్టి, నీళ్లు... మీకు ప్యాకేజీ కావాలని అడిగింది బాబే కదా? ప్యాకేజీ ఇచ్చారని ప్రధాని మోదీకి నాడు అసెంబ్లీలో ధన్యవాదాల తీర్మానం చేయడాన్ని మరిచిపోయారా? ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్‌సీపీ ఎంపీలతో రాజీనామాలు, ఢిల్లీలో దీక్షలు చేయించింది ఆరోజు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న వైఎస్‌ జగన్‌ కాదా? ప్రత్యేక హోదాపై చంద్రబాబుకు అంత చిత్తశుద్ధి ఉంటే ఆ రోజు టీడీపీ ఎంపీలతో ఎందుకు రాజీనామాలు చేయించలేదు? స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కాంపై నిజాలను నిగ్గు తేలుస్తుంటే రాజకీయ కక్ష అని ఆరోపించడం ఏమిటి? సీఐడీ పోలీసులు నిజాలను నిగ్గు తేలుస్తుంటే డ్రామాలతో అడ్డుకుంటారా? 

మినహాయింపు ఇవ్వాలని లేఖ రాశాం..  
ప్రకృతి విపత్తుల సమయంలో నిబంధనలు సడలించడం ఆనవాయితీ. ధాన్యం కొనుగోలుకు సంబంధించి కొంత మినహాయింపు ఇవ్వాలని కేంద్రానికి లేఖ రాశాం. 25 శాతంగా ఉండే నూకల శాతాన్ని 28 నుంచి 35 శాతానికి పెంచి జిల్లాల వారీగా అనుమతించాలని అభ్యర్థించాం. పాడైపోయిన ధాన్యం కొనుగోలుకు సంబంధించి 3 నుంచి 7 శాతానికి పెంచాలని కోరాం. తడిసిన, రంగు మారిన ధాన్యాన్ని రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేయాలని సీఎం జగన్‌ ఇప్పటికే అధికారులు, మిల్లర్లను ఆదేశించారు. 

వియ్యంకుడు అఖండ.. కుమారుడు పప్పుండ
దివంగత సీఎం వైఎస్సార్‌ ప్రారంభించిన పోలవరాన్ని ఆయన తనయుడు, సీఎం జగన్‌ పూర్తి చేస్తారు. సీఎం వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌ పథకం ద్వారా దాదాపు 40 లక్షల కుటుంబాలకు మేలు చేస్తుంటే సహించలేక చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారు. ఉద్యోగ వర్గాలు చంద్రబాబును జీవితాంతం విశ్వసించవు. వియ్యంకుడు అఖండ.. కుమారుడు పప్పుండ.. అనే బాధ ఆయన్ను వేధిస్తోంది. విశాఖ ఉక్కును ప్రైవేటీకరించొద్దని చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌ కంటే ముందే ప్రకటించి పోరాటం చేస్తోంది వైఎస్సార్‌సీపీనే.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement