ఒంగోలు టూటౌన్, న్యూస్‌లైన్ : మార్కెట్ మాయాజాలంతో రైతన్న కుదేలయ్యాడు. పెట్టుబడులు కూడా రాకుండా దళారులు అడ్డుకుంటున్నారు. అన్నదాత బలహీనతను పొలంలోనే సొమ్ము చేసుకుంటున్నారు. ఏతల నాడు ధరలు కోతల నాటికి కనుచూపు మేరలో కూడా కనిపించడంలేదు. జిల్లాలో రబీ సీజన్‌లో రైతులు పండించిన పలు రకాల పంటలకు నేడు గిట్టుబాటు ధరలు లేవు.
వేరుశనగ..
రబీ సీజన్‌లో 3327 హెక్టార్లలో వేరుశనగా సాగు చేశారు. తీరప్రాంతంలో ఎక్కువగా సాగువుతోంది. విత్తనాలు, ఎరువులు, దుక్కి, కలుపు, కూలీ అన్నీ కలిపి ఎకరాకు రూ.25 వేలకుపైగా ఖర్చు పెట్టారు. క్వింటాకు 30 నుంచి 40 బస్తాలలోపే పండింది. విత్తన కొనుగోలు సమయంలో వేరుశనగ అధిక ధర పలికింది. పంట చేతికొచ్చే సమయానికి ఆ ధర లేక రైతులు దిగాలు పడ్డారు. బస్తా రూ. 900 నుంచి రూ.1200 వరకు మత్రామే పలుకుతోంది. రేటు పెరగకుండా దళారులు అడ్డుకుంటూ రైతును నట్టేట ముంచుతున్నారు. తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టలేక రైతులు పొలాల్లోనే ఎంతోకొంతకుపంట తెగనమ్ముకుంటున్నారు. కౌలు రైతు పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. చివరకు కౌలు చెల్లించలేక అప్పుల పాలవుతున్నాడు.
మిర్చి..
7694 హెక్టార్లలో మిర్చి వేశారు. ఈ పంట పశ్చిమ ప్రాంతంలో ఎక్కువగా సాగవుతోంది. కందుకూరు ప్రాంతంలో కొండమూరువారిపాలెంలో దాదాపు 250 ఎకరాల్లో రైతులు మిర్చి సాగు చేశారు. క్వింటా రూ.8 వేలు ఉన్న ధర ప్రస్తుతం రూ.7,300లకు పడిపోయింది. ఎకరాకు రూ.లక్షా 50 వేల వరకు ఖర్చు అవుతోంది. దళారుల మాయజాలంతో ధరలు తగ్గిపోయాయి. పెట్టిన పెట్టుబడులు రాక రైతులు విలవిల్లాడుతున్నారు.
పత్తి..
జిల్లావ్యాప్తంగా రబీలో 807 హెక్టార్లలో పత్తి సాగైంది. ఖరీఫ్‌లో 53,508 హెక్టార్లలో సాగైనట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. ఎకరాకు రూ.21,550 వరకు పెట్టుబడి పెట్టారు. కౌలు 15 వేలు చెల్లించారు. మొత్తం రూ.36,550 వరకు ఖర్చు పెట్టారు. ప్రభుత్వం క్వింటాకు దాదాపు రూ.4వేల ధర నిర్ణయించింది. అంత వరకూ బాగానే ఉన్నా రంగుమారిందన్న సాకు చూపి మార్కెట్‌లో దళారులు రూ.3,200 కొనుగోలు చేసి రైతులను నట్టేట ముంచుతున్నారు. దీనికి తోడు మూడు నుంచి ఐదు క్వింటాళ్ల వరకు దిగుబడి కూడా తగ్గింది. తీసిన పత్తి కూలీలకే సరిపోలేదని రైతన్న వాపోతున్నాడు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం సీసీఐ కేంద్రాలు ప్రారంభించకుండా చోద్యం చూస్తోంది. గతేడాది అక్టోబర్‌లో కురిసిన వర్షాలకు పత్తి పంట తీవ్రంగా దెబ్బతింది. ఈ మొత్తం నేపథ్యంలో పత్తి సాగు చేయాలంటేనే రైతులు జంకుతున్నారు.
‘శనగ’ లేదు
శీతల గిడ్డంగుల్లో 14.5 లక్షల క్వింటాళ్ల శనగలు మూడేళ్లుగా మూలుగుతున్నాయి. మళ్లీ కొత్తవి వచ్చాయి. గత నెల ఒంగోలు వ్యవసాయ మార్కెట్‌లో కేంద్రాన్ని ఏర్పాటు చేసి తొలిరోజు కేవలం 18 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేసి అధికారులు చేతులు దులుపుకున్నారు. జిల్లాలో పలుచోట్ల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినా ఆశించిన ఫలితాలు రావడం లేదు. గతంలో రూ.7,500 పలికిన ధర నేడు రూ.3,700 కూడా పలకని పరిస్థితి ఉంది. మద్దతు ధర పేరుతో ప్రభుత్వం మూడు వేల వంద రూపాయలకు మాత్రమే కొనుగోలు చేస్తోంది. అదీ అన్ని సక్రమంగా ఉంటేనే. లేకుంటే నిబంధనల పేరుతో కోత విధిస్తారు. అమ్మిన శనగలకు డబ్బుల కోసం రైతులు కొనుగోలు కేంద్రాల చుట్టూ ఇంకా చెప్పులరిగేలా తిరుగుతున్నారు.
రైతన్నల వర్రీ
జిల్లాలో వరి 80289 హెక్టార్లలో సాగైంది. ధాన్యం చేలో ఉండగానే దళారులు రంగంలోకి దిగారు. బీపీటీలు, 1001, సన్నాల రకం వడ్లను దళారులు రూ.900 నుంచి రూ.1000 కొనుగోలు చేస్తున్నారని రైతులు వాపోతున్నారు. కొత్తపట్నం ప్రాంతంలో అసలు ధర రూ.1200 వరకు ఉన్నా మిల్లర్లు దళారులను రంగంలోకి దించి కేవలం రూ.900 అడగటం రైతులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయకట్టు పరిధి దర్శి, త్రిపురాంతకం, కురిచేడు, ముండ్లమూరు ఏరియల్లో ఎకరాకు 50 నుంచి 60 బస్తాల వరకు పండే అవకాశం ఉంది. ఎకరాకు రూ. 25 వేల వరకు ఖర్చు అవుతోంది. చేసిన అప్పులకు వడ్డీలు పెరుగుతుండటంతో దిక్కుతోచని రైతు.. పొలంలోనే పంట తెగనమ్ముతున్నాడు. కౌలు రైతుల శ్రమ వృథా అవుతోంది. అటు పెరిగిన ఖర్చులు, ఇటు మార్కెట్ దళారుల మాయజాలం దెబ్బకు రైతన్న కుదేలవుతున్నాడు.
ఇవీ.. అంతే
పొగాకు, ఉల్లి, టమోట పంటలకూ కూడ గిట్టుబా టు ధర రాకుండా దళారులు అడ్డుకుంటూ రైతన్న శ్రమను దోచుకుంటున్నారు. రైతుకు గిట్టుబాటు ధర కల్పించి ఆదుకోవడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం గా వ్యవహరిస్తోందని అన్నదాత వాపోతున్నాడు.
దళారుల దందా!
Published Fri, Apr 4 2014 3:04 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM
Advertisement
Advertisement