ఖమ్మం రూరల్, న్యూస్‌లైన్: ఈ ఏడాది కరెంట్ ‘కోతల’కాలం ముందే వచ్చింది. ప్రతియేటా వేసవి ప్రారంభం అయితేనే కోతలు విధించే ప్రభుత్వం ఈ ఏడాది ముందే మొదలుపెట్టేందుకు సిద్ధమైంది. ట్రాన్స్‌కో అధికారులు గురువారం సాయంత్రం నుంచి అధికారిక విద్యుత్‌కోతలు ప్రారంభిస్తున్నట్లు ప్రకటించడం రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. రబీ పంటలను సాగు చేసిన రైతులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. ఇప్పటికే సాగుచేసిన పంటలు ఏమవుతాయో అర్థంకాక తలపట్టుకుంటున్నారు. వ్యవసాయానికి ఏడు గంటల కరెంట్‌ను ఎప్పుడో ఏమార్చిన ప్రభుత్వం ఎడాపెడా కోతలు విధిస్తుండటంతో రోజుకు నాలుగైదు గంటలకు మించి కరెంట్ వచ్చే పరిస్థితి లేదని రైతులు అంటున్నారు. అధికారిక కోతలతో ఆమాత్రం కరెంట్ కూడా అందుతుందో లేదోనని ఆందోళన చెందుతున్నారు.
సమయపాలనలేని సరఫరా..
ప్రస్తుతం వ్యవసాయానికి సరఫరా అవుతున్న ఉచిత విద్యుత్ ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి ఉంది. వాస్తవంగా ఉదయం నాలుగు గంటలు, రాత్రి మూడు గంటలు సరఫరా ఇవ్వాల్సి ఉంది. ఎప్పుడు కరెంట్‌పోయి ఎప్పుడు వస్తుందో తెలియనిస్థితిలో రైతులు వ్యవసాయ బావుల వద్దే రేయింబవళ్లు పడిగాపులు కాయాల్సి వస్తోంది. మొత్తంగా రోజుకు నాలుగైదు గంటలకు మించి కరెంట్ సరఫరా చేయడం లేదని రైతులంటున్నారు. సమయపాలన లేని సరఫరా రైతుల ప్రాణాలమీదకు తెస్తోంది. కూసుమంచి మండలం జుజ్జుల్‌రావుపేటలో గతేడాది డిసెంబర్ 16న బక్కతట్ల వీరస్వామి అనే రైతు నారుమడికి నీళ్లు పెట్టేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు విద్యుత్ తీగ తగిలి షాక్‌తో మృతి చెందారు. తిరుమలాయపాలెం మండలం మేడిదపల్లికి చెందిన రైతు నందిగామ భిక్ష్మారెడ్డి పొలానికి నీళ్లు పెట్టేందుకు వెళ్లి అకస్మాత్తుగా కరెంట్ రావడంతో విద్యుదాఘాతంతో మృతిచెందారు. కరెంట్ ఎప్పుడు వస్తుందో, పోతుందో తెలియనిస్థితిలో రైతులు బావుల వద్ద పడిగాపులు కాస్తూ ప్రమాదాలకు గురవుతున్నారు.
ఎండుతున్న పటలు...
వేళాపాళా లేని విద్యుత్ సరఫరాతో రబీలో వేసిన పంటలు ఎండిపోతున్నాయి. జిల్లాలో రబీలో వరి 20,660 ఎకరాలు, మిర్చి 24,565 ఎకరాలు, మొక్కజొన్న 46,668 ఎకరాలు, వేరుశనగ 17,130 ఎకరాల్లో సాగు చేశారు. విద్యుత్ కోతలతో పంటలకు సరైన సమయంలో నీరందక వీటిలో కొన్ని పంటలు దెబ్బతిన్నాయి. జిల్లాలోనే అత్యధికంగా వ్యవసాయ పంప్‌సెట్ కనెక్షన్లున్న తిరుమలాయపాలెం, కూసుమంచి మండలం రైతుల కష్టాలు వర్ణనాతీతం. పాలేరు నియోజకవర్గంలోని తిరుమలాయపాలెం, ఖమ్మం రూరల్, కూసుమంచి మండలాల్లో వేసిన మిర్చి, కూరగాయ పంటలు విద్యుత్ కోతలతో నీరందక ఎండిపోతుండటంపై రైతులు మండిపడుతున్నారు.
జిల్లావ్యాప్తంగా 90 వేల పైచిలుకు వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లుండగా అందులో ఒక తిరుమలాయపాలెం మండలంలోనే 11 వేల విద్యుత్ మోటార్లు ఉండటం గమనార్హం. రైతులు వాటిపై ఆధార పడి వివిధ పంటలు పండిస్తున్నారు. తర్వాత కూసుమంచి మండలంలో దాదాపు ఆరు వేలు, నేలకొండపల్లిలో 5,600, ఖమ్మం రూరల్‌లో 5,200 విద్యుత్ మోటార్లు ఉన్నాయి. మొత్తంమీద ఒక్క పాలేరు నియోజకవర్గంలోనే 27 వేలకు పైగా వ్యవసాయ కనెక్షన్లు ఉన్నాయి. వీటికింద రబీ పంటలు సాగవుతున్నాయి. ఇలా ఎడాపెడా కోతలు విధిస్తే ఇవన్నీ ఎండిపోయే పరిస్థితులు ఉన్నాయని రైతులంటున్నారు. సరిగా విద్యుత్ సరఫరా చేయలేని ట్రాన్స్‌కో అధికారులు సర్‌చార్జీల పేరుతో తమ వద్దనుంచి రూ.లక్షలు ముక్కుపిండి వసూలు చేస్తున్నట్లు రైతులు వాపోతున్నారు. కూసుమంచి మండలం పోచారంలో సర్‌చార్జి బిల్లు చెల్లించనందుకు రెండు నెలల కిత్రం ఓరైతు విద్యుత్‌మోటార్ కనెక్షన్ తొలగించారు. జిల్లాలో అక్కడక్కడా ఇదే పరిస్థితి ఉంది.
వరి పండటం కష్టమే
ఉచిత్ విద్యుత్ అని ప్రభుత్వం చెప్పుడే తప్పా.. కరెంటు ఏనాడూ ఇచ్చింది లేదు. కరెంటు కోసం రేయింబవళ్ళు పొలం వద్దనే కాపు కాస్తున్నా ఎప్పుడొస్తుందో.. ఎప్పుడు పోతుందో తెలీయడం లేదు. కరెంటు వచ్చిందని మోటార్ పెట్టే సరికి మళ్లీ పోతుంది. నీళ్ళందక వరి నాటు పెట్టలేక పోతున్నాం. పరిస్థితి ఇలానే ఉంటే పంట కోసం చేసిన అప్పు ఎలా తీర్చాలో తెలీయడం లేదు.
- యాతం పాపిరెడ్డి, రైతు, బంధంపల్లి, తిరుమలాయపాలెం మండలం
రాత్రి కరెంట్‌తో ఇబ్బందులు పడుతున్నాం
రాత్రి వేళల్లో కరెంట్ ఇవ్వడంతో మోటార్లు పెట్టేందుకు వెళ్లి ఇబ్బందులు పడుతున్నాం. పగటిపూట కేవలం రెండు గంటలు మాత్రమే కరెంట్ ఇవ్వడం, రాత్రి పూట మూడు గంటలు ఇవ్వడంతో చీకట్లో పొలాలకు వెళ్లక తప్పడం లేదు. ఇచ్చే సరఫరాలోనూ అంతరాయం కలుగుతోంది. వారంలో రెండు సార్లు మోటార్ కాలిపోయింది. ఒక్కసారి మోటార్ రీవైండింగ్ చేయిస్తే రూ.2000 వరకు ఖర్చు వస్తోంది.
-ఎడవల్లి పుల్లారెడ్డి, రైతు, పాలేరు
అమ్మో ‘కోతలు’!
Published Fri, Jan 17 2014 5:04 AM | Last Updated on Tue, Sep 18 2018 8:28 PM
Advertisement
Advertisement