జోరుగా రబీ లక్ష్యం
7 లక్షల మెట్రిక్ టన్నులకు దగ్గరగా ధాన్యం కొనుగోళ్లు
గత ఏడాదితో పోలిస్తే 2.50 లక్షల మెట్రిక్‌టన్నులు ఎక్కువ
హైదరాబాద్: రాష్ట్రంలో ప్రస్తుత రబీ సీజన్‌కు గాను పౌరసరఫరాల శాఖ ద్వారా చేపడుతున్న ధాన్యం కొనుగోళ్లు భారీగా సాగుతోంది. ఉమ్మడి రాష్ట్రంలో కంటే ఈ ఏడాది రబీలో 7లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోళ్లు జరగ్గా, మరో నెలన్నరలో 12లక్షల మెట్రిక్ టన్నుల మార్కును దాటవచ్చని అంచనా.గత ఏడాది ఇదే సమయానికి జరిగిన కొనుగోళ్లతో చూస్తే సుమారు 2.50 లక్షల మెట్రిక్ టన్నులు అదనంగా ఉంది. కేంద్ర ప్రభుత్వం బియ్యం లెవీని 75శాతం నుంచి 25 శాతానికి తగ్గిస్తూ జూన్ నెలలో నిర్ణయం తీసుకున్న సంగతి విదితమే. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరి నెలనుంచే ధాన్యం సేకరణను ప్రారంభించింది. ధాన్యం అమ్మిన మూడు రోజుల్లో ఆన్‌లైన్ ద్వారా కనీస మద్దతు ధరను చెల్లించే ఏర్పాట్లు చేసింది.
ఇలా ఇప్పటికే 1,426 కేంద్రాలను తెరిచి మొత్తంగా 6.88లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించింది. దీనికి సంబంధించిన రూ.963.34కోట్లను ఆన్‌లైన్ ద్వారానే నేరుగా విక్రయదారుడి ఖాతాలో పడేలా చర్యలు తీసుకుంది. గత ఏడాది ఇదే సమయానికి 4.31లక్షల మెట్రిక్ టన్నుల సేకరణతో పోలిస్తే ఈ ఏడాది అదనంగా 2.57లక్షల మెట్రిక్ టన్నుల సేకరణ జరిగింది. ఖరీఫ్ సీజన్ ప్రారంభానికి మరో నెలన్నర రోజుల సమయం ఉన్న దృష్ట్యా, ఈ కాలంలో 15లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం సేకరణ లక్ష్యం అనుకున్నా 12లక్షల మెట్రిక్‌టన్నులకు దాటుతుందని సరఫరాల శాఖ అధికారులు చెబుతున్నారు.
వచ్చే ఖరీఫ్ నుంచి వంద శాతం సేకరణ..
కాగా వచ్చే ఖరీఫ్ నుంచి పూర్తిగా లెవీని కేంద్రం ఎత్తివేయనున్న దృష్ట్యా పూర్తి ధాన్యం సేకరణ రాష్ట్ర ప్రభుత్వమే చేయనుంది. దీనికోసం ఇప్పటినుంచే పౌర సరఫరాల శాఖ కసరత్తు ఆరంభించింది. ఇందుకు మౌలిక వసతుల కల్పన, అధికారుల మోహరింపు అన్ని రాష్ట్రాలకు పెనుభారంగా పరిణమించే పరిస్థితి తలెత్తుతుంది. కొన్న ధాన్యాన్ని నిల్వ చేసేందుకు గోదాముల సమస్య రాష్ట్రాలకు ఇబ్బంది కల్గించే అంశమేనని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. దీన్ని అధిగమించి కొనుగోలు కేంద్రాల్లో అన్ని వసతుల ఏర్పాటుకు ఆశాఖ ప్రణాళిక సిద్ధం చేసుకుంటోంది.