కొత్త జిల్లాల్లో ధాన్యం కొనుగోళ్లు
- వచ్చే ఏడాది నుంచి చేస్తామన్న
- రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్ సీవీ ఆనంద్
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఖరీఫ్ సీజన్ నుంచి కొత్త జిల్లాల వారీగా ధాన్యం కొనుగోలు చేస్తామని, 31 జిల్లాలను ఆన్‌లైన్ పరిధిలోకి తీసుకువస్తామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్ సీవీ ఆనంద్ ప్రకటించారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులు నిరీక్షించే పరిస్థితులు లేకుండా వేగంగా కొనుగోళ్లు చేస్తున్నామని చెప్పారు. రబీ సీజన్‌కు సంబంధించి కస్టం మిల్లింగ్ రైస్ (సీఎంఆర్)ను ఆగస్ట్ 31వ తేదీలోగా అప్పగించాలని రైస్ మిల్లర్లను కోరారు. యాదాద్రి, జనగామ, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్ జిల్లాల్లో గురువారం ఆయన పర్యటించి కొనుగోలు కేంద్రాల్లోని ఏర్పాట్లను పరిశీలించారు. ఆయా జిల్లా డీసీఎస్‌ఓలు, సంస్థ మేనేజర్లు, అధికారులతో సమీక్షలు జరిపారు.
ఈ ఏడాది ఖరీఫ్, రబీ సీజన్లలో ఈ నెల 24వ తేదీ వరకు పౌర సరఫరాల సంస్థ 45 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు తెలిపారు. రబీలో ఏకంగా 28 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని, మరో ఇరవై రోజుల్లో 10 నుంచి 15 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తామని పేర్కొన్నారు. అంచనాలకు మించి ధాన్యం దిగుబడి వచ్చినా క్షేత్ర స్థాయిలో కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, పౌర సరఫరాల అధికా రులు, సిబ్బంది సమస్యలను అధిగమించారని అభినందించారు. రేషన్ షాపుల్లో సంస్కరణలు చేపడుతున్నామని, ఇందులో భాగంగా ఖాళీల భర్తీ, కార్డుల క్రమబద్ధీకరణ, బినామీ డీలర్ల తొలగింపు, రాష్ట్ర వ్యాప్తంగా ఈ–పాస్ విధానం అమలు వచ్చే రెండు నెలల్లో పూర్తి చేస్తామన్నారు.