ముందుకు "సాగే"నా..!
– గత 30 ఏళ్లలో తొలిసారిగా పడిపోయిన విస్తీర్ణం
– కయాంక్ తుఫాను ఆశలు పెట్టుకున్న అనంత రైతులు
అనంతపురం అగ్రికల్చర్ : ప్రకతి కన్నెర చేయడం, పాలకుల చిన్నచూపు కారణంగా ఖరీఫ్ పంట సంక్షోభంలో కూరుకుపోగా... రబీ కూడా ఆ దిశగానే పయనం సాగిస్తోంది. అందుబాటులో ఉన్న గణాంకాలను పరిగణలోకి తీసుకుంటే గత 30 సంవత్సరాల్లో ఎపుడూ లేని విధంగా రబీ వ్యవసాయం పూర్తీగా పడకేసింది. నైరుతీ దారుణంగా దెబ్బకొట్టగా కనీసం ఈశాన్యమైనా కొంతలో కొంత గట్టెక్కిస్తుందనే ఆశతో రంగంలోకి దిగిన రైతులను రబీ మరింత ఇబ్బందుల్లోకి నెట్టేస్తోంది. ఈ పాటికి కనీసం లక్ష హెక్టార్లలో పప్పుశెనగ, ఇతర పంటలు సాగులోకి రావాల్సివుండగా కేవలం 5 వేల హెక్టార్లలోపే పరిమితం కావడం విశేషం.
అది కూడా ఈనెల 11న కురిసిన తేలికపాటి వర్షాలకు పుట్లూరు, యల్లనూరు, ఉరవకొండ డివిజన్లలో అరకొర తేమలోనే పంటలు వేయడంతో చాలా వరకు మొలకెత్తకపోవడం గమనార్హం. పప్పుశెనగ సాగుకు ఇక గరిష్టంగా వారం రోజులు మాత్రమే సమయం ఉండటంతో రైతుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. నవంబర్ మొదటి వారం తర్వాత పప్పుశెనగ వేసుకున్నా ఫలితం ఉండదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
దెబ్బతీసిన వర్షాలు: పగలు ఎండలు, రాత్రి చలితో కూడిన విచిత్ర వాతావరణం నెలకొని ఉండటంతో మామూలుగా వర్షం పడే సూచనలు లేవంటున్నారు. రబీ సీజన్‌లో సాధారణ వర్షపాతం 155 మి.మీ కాగా అందులో అక్టోబర్ వర్షాలే కీలకం. అక్టోబర్‌లోనే 110.7 మి.మీ సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉంది. నవంబర్‌లో 38 మి.మీ, డిసెంబర్‌లో కేవలం 9 మి.మీ మాత్రమే సాధారణ వర్షపాతం. అక్టోబర్ నెల చివరి వారంలో అడుగిడినా ఇప్పటివరకు కేవలం 7.1 మి.మీ మాత్రమే వర్షపాతం నమోదైంది.
కయాంక్ తుఫానుపై ఆశలు
దుర్భర పరిస్థితులు నెలకొన్న ప్రస్తుత తరుణంగా జిల్లా రైతులు పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడిన కయాంక్ తుఫానుపై గంపెడాశలు పెట్టుకున్నారు. ఈనెల 28 నుంచి నవంబర్ మూడో తేదీ వరకు కయాంక్ తుఫాను ప్రభావం చూపనుందని చెబుతుండటంతో జిల్లాలో కనీస వర్షపాతం నమోదైనా రబీలో కొంత కదలిక వచ్చే పరిస్థితి ఉందంటున్నారు. లేదంటే పప్పుశెనగ సాగు ప్రశ్నార్థకమవుతుండగా నీటి వసతి కింద వేయనున్న వరి, వేరుశనగ, మొక్కజొన్న లాంటి పంటలు, వర్షాధారంగా వేయనున్న జొన్న, ఉలవ, పొద్దుతిరుగుడు లాంటి పంటల విస్తీర్ణం కూడా బాగా తగ్గే పరిస్థితి కనిపిస్తోంది. మొత్తమ్మీద చూస్తే ఈ ఏడాది ఖరీఫ్, రబీ జిల్లా రైతులకు భారీ నష్టాలు మిగిలిస్తున్నాయి. చరిత్రలో తొలిసారిగా రబీ విస్తీర్ణం దారుణంగా పడిపోయే పరిస్థితి నెలకొంది.