crop lost
-
దేవుడే దిక్కు !
‘వర్షం జాడ కరువైంది.. అన్నదాత గుండె బరువైంది... చేసిన అప్పులు కళ్ల ముందు తిరుగుతుంటే... ఆకుపచ్చగా మారాల్సిన చేను అరకొరగా వచ్చిన మొలకలతో వెక్కిరిస్తోంది.’ ప్రస్తుతం జిల్లాలో వేరుశనగ సాగు చేసిన రైతుల పరిస్థితి ఇది. వర్షం రాక పంటకూడా సరిగ్గా పైకి రాకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. అనంతపురం రూరల్ మండలం ఉప్పరపల్లి, పూలకుంట, చియ్యేడు గ్రామాల సమీపంలో తీసిన ఈ చిత్రాలనే దీనికి ఉదాహరణ. - ఫొటోగ్రాఫర్, అనంతపురం -
పుస్తెలూ పోతున్నాయ్!
- మరో పంటకు పెట్టుబడి ప్రశ్నార్థకం - వరుస నష్టాల్లో అన్నదాతలు - టమాట రైతుకు ధరాఘాతం - వ్యవసాయంపై సన్నగిల్లిన ఆసక్తి -------------------------------------------- జిల్లాలో పంట మీద పంట దెబ్బ తింటూనే ఉండటంతో అన్నదాతలు ఆర్థికంగా చితికిపోయారు. పెళ్లాల పుస్తెలు కూడా తాకట్టులోనే పోతున్నాయని చాలామంది రైతులు ఆవేదన చెందుతున్నారు. వర్షాధారం కింద వేరుశనగ సాగు చేస్తే వరుణుడు కరుణించక ఊడలు దిగకమునుపే పంట పూర్తిగా ఎండిపోయింది. బోరుబావుల కింద వివిధ పంటలు సాగు చేసిన రైతుల పరిస్థితి మరింత అధ్వానంగా తయారైంది. ఉల్లి పంట సాగు చేస్తే ధరలు కుప్పకూలి కోలుకోలేని దెబ్బతీశాయి. చీడపీడలు, కల్తీ విత్తనాలతో పంట పూర్తిగా తుడిచి పెట్టుకుపోయింది. తెగుళ్లతో మొక్కజొన్న పంట దిగుబడి తగ్గిపోయి తీరని దుఃఖాన్ని మిగిల్చింది. ప్రస్తుతమున్న పంట టమాట. కాయలు చూసి సంబరపడిన రైతులు ధరలు కుప్పకూలిపోవడంతో కనీసం కూలీల ఖర్చు కూడా రావడం లేదని వాపోతున్నారు. ------------------------------------------------------------------------------ రాయదుర్గం రూరల్ : జిల్లావ్యాప్తంగా దాదాపు 20 వేల మంది రైతులు 7వేల హెక్టార్లలో టమాట సాగు చేశారు. ప్రస్తుతం 4వేల హెక్టార్లలో పంటకోత పూర్తయింది. మిగిలిన 3వేల హెక్టార్లలో పంట వివిధ దశల్లో ఉంది. నియోజకవర్గంలో గుమ్మగట్ట, రాయదుర్గం, డీ.హీరేహాళ్, బొమ్మనహాళ్, కణేకల్ మండలాల్లో 4,270 ఎకరాల విస్తీర్ణంలో 2,897 మంది రైతులు భార్యల పుస్తెలు తాకట్టు పెట్టి మరీ టమాట పంట సాగు చేశారు. కుటుంబీకులంతా రాత్రింబవళ్లూ అష్టకష్టాలు పడ్డారు. ఏపుగా పెరుగుతున్న చెట్లు, విరగ్గాసిన కాయలను చూసి మురిసిపోయారు. కానీ కాయ పక్వానికి వచ్చి విక్రయించే సమయంలో ధరలు కుప్పకూలిపోయాయి. బళ్లారి, మదనపల్లి, కోలార్, అనంతపురం మార్కెట్లలో కాయ నాణ్యతనుబట్టి 15 కేజీల బాక్సు రూ.20లు, 28 కేజీల బాక్సు రూ.30లకు అడుగుతున్నారు. అది టమాటాలను విడిపించే కూలీలకు కూడా సరిపోదు. అందువల్ల కొంతమంది కాయలను పొలంలోనే వదిలేస్తున్నారు. మరికొందరు మేకలు, గొర్రెలకు మేతగా వదిలేస్తున్నారు. దుక్కి దున్నేందుకు, టమాట నారు, రసాయనిక, క్రిమిసంహారక మందులు, కూలీల ఖర్చు, కట్టెలు పాతడానికి, కట్టడానికి వైర్ల కోసం ఎకరాకు రూ.50 వేల దాకా ఖర్చయింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ పెట్టుబడిలో ఒక్క రూపాయి కూడా తిరిగి వచ్చేలా లేదు. అంటే పెట్టుబడి మొత్తం అప్పుగా మిగిలిపోతోంది. దానికి వడ్డీ పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో పుస్తెలు తాకట్టు పెట్టినవారు వాడిని విడిపించుకోలేకున్నారు. మరోసారి పంట పెట్టాలంటే పెట్టుబడి కూడా దొరకదని ఇకపై వ్యవసాయం చేసేందుకు చాలామంది ఆసక్తి చూపడం లేదు. టమాటాకు మద్దతు ధర కల్పిస్తామని ఊరించిన పాలకులు చివరకు ఉసూరుమనిపించారు. ఇంతకన్నా దారుణం మరోటి లేదు అరకొరగా వస్తున్న నీటితో నాలుగు ఎకరాల్లో టమాట సాగు చేశా. లక్షా అరవై వేలు ఖర్చయింది. పంట చేతికి వచ్చేసరికి ధరలు పూర్తిగా పడిపోయాయి. ఒకసారి 80 బాక్సులను బళ్లారి మార్కెట్కు తీసుకెళితే ఆటో బాడుగ కూడా చేతి నుంచి ఇవ్వాల్సి వచ్చింది. ప్రభుత్వం మద్దతు ధర కల్పిస్తామని చెప్పిందిగానీ చెయ్యలేదు. ఇంతకన్నా దారుణం మరొకటి లేదు. ఇకపై వ్యవసాయం చేయడం మానేయాలని అనుకున్నాం. - కృష్ణనాయక్, ఆవులదట్ల గ్రామం తోట వద్దకు వెళ్లడం మానేశాం మాకున్న మూడు ఎకరాల్లో టమాట పంట సాగు చేశాం. కాయ పక్వానికి వచ్చింది. మార్కెట్లో 28 కేజీల బాక్సు రూ.30లకు అడుగుతున్నారు. కాయలను తొలగించాలంటే ఒక్కొక్కరికి రెండొందల రూపాయల కూలి ఇవ్వాలి. ఏ మాత్రం గిట్టుబాటు కాకపోవడంతో కాయలను తొలగించలేదు. పంటను చూసి గుండె తరుక్కుపోతుండటంతో తోట వద్దకు వెళ్లడం మానేశాం. టమాట సాగు చేసిన రైతులకు ప్రోత్సాహం కల్పించాలి. - కంకర బొజ్జన్న, కెంచానపల్లి -
ముందుకు "సాగే"నా..!
– గత 30 ఏళ్లలో తొలిసారిగా పడిపోయిన విస్తీర్ణం – కయాంక్ తుఫాను ఆశలు పెట్టుకున్న అనంత రైతులు అనంతపురం అగ్రికల్చర్ : ప్రకతి కన్నెర చేయడం, పాలకుల చిన్నచూపు కారణంగా ఖరీఫ్ పంట సంక్షోభంలో కూరుకుపోగా... రబీ కూడా ఆ దిశగానే పయనం సాగిస్తోంది. అందుబాటులో ఉన్న గణాంకాలను పరిగణలోకి తీసుకుంటే గత 30 సంవత్సరాల్లో ఎపుడూ లేని విధంగా రబీ వ్యవసాయం పూర్తీగా పడకేసింది. నైరుతీ దారుణంగా దెబ్బకొట్టగా కనీసం ఈశాన్యమైనా కొంతలో కొంత గట్టెక్కిస్తుందనే ఆశతో రంగంలోకి దిగిన రైతులను రబీ మరింత ఇబ్బందుల్లోకి నెట్టేస్తోంది. ఈ పాటికి కనీసం లక్ష హెక్టార్లలో పప్పుశెనగ, ఇతర పంటలు సాగులోకి రావాల్సివుండగా కేవలం 5 వేల హెక్టార్లలోపే పరిమితం కావడం విశేషం. అది కూడా ఈనెల 11న కురిసిన తేలికపాటి వర్షాలకు పుట్లూరు, యల్లనూరు, ఉరవకొండ డివిజన్లలో అరకొర తేమలోనే పంటలు వేయడంతో చాలా వరకు మొలకెత్తకపోవడం గమనార్హం. పప్పుశెనగ సాగుకు ఇక గరిష్టంగా వారం రోజులు మాత్రమే సమయం ఉండటంతో రైతుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. నవంబర్ మొదటి వారం తర్వాత పప్పుశెనగ వేసుకున్నా ఫలితం ఉండదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దెబ్బతీసిన వర్షాలు: పగలు ఎండలు, రాత్రి చలితో కూడిన విచిత్ర వాతావరణం నెలకొని ఉండటంతో మామూలుగా వర్షం పడే సూచనలు లేవంటున్నారు. రబీ సీజన్లో సాధారణ వర్షపాతం 155 మి.మీ కాగా అందులో అక్టోబర్ వర్షాలే కీలకం. అక్టోబర్లోనే 110.7 మి.మీ సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉంది. నవంబర్లో 38 మి.మీ, డిసెంబర్లో కేవలం 9 మి.మీ మాత్రమే సాధారణ వర్షపాతం. అక్టోబర్ నెల చివరి వారంలో అడుగిడినా ఇప్పటివరకు కేవలం 7.1 మి.మీ మాత్రమే వర్షపాతం నమోదైంది. కయాంక్ తుఫానుపై ఆశలు దుర్భర పరిస్థితులు నెలకొన్న ప్రస్తుత తరుణంగా జిల్లా రైతులు పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడిన కయాంక్ తుఫానుపై గంపెడాశలు పెట్టుకున్నారు. ఈనెల 28 నుంచి నవంబర్ మూడో తేదీ వరకు కయాంక్ తుఫాను ప్రభావం చూపనుందని చెబుతుండటంతో జిల్లాలో కనీస వర్షపాతం నమోదైనా రబీలో కొంత కదలిక వచ్చే పరిస్థితి ఉందంటున్నారు. లేదంటే పప్పుశెనగ సాగు ప్రశ్నార్థకమవుతుండగా నీటి వసతి కింద వేయనున్న వరి, వేరుశనగ, మొక్కజొన్న లాంటి పంటలు, వర్షాధారంగా వేయనున్న జొన్న, ఉలవ, పొద్దుతిరుగుడు లాంటి పంటల విస్తీర్ణం కూడా బాగా తగ్గే పరిస్థితి కనిపిస్తోంది. మొత్తమ్మీద చూస్తే ఈ ఏడాది ఖరీఫ్, రబీ జిల్లా రైతులకు భారీ నష్టాలు మిగిలిస్తున్నాయి. చరిత్రలో తొలిసారిగా రబీ విస్తీర్ణం దారుణంగా పడిపోయే పరిస్థితి నెలకొంది. -
రూ.కోట్లల్లో పంటల నష్టం
అనంతపురం అర్బన్ : జిల్లాలో వరి, మిరప, పత్తి పంటలు సాగు చేసిన రైతులు కోట్ల రూపాయలు నష్టపోయారని, ప్రభుత్వం వీరికి తక్షణం పరిహారం ఇవ్వాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వి.రాంభూపాల్ డిమాండ్ చేశారు. బుధవారం స్థానిక సీపీఎం కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. హెచ్ఎల్సీ ఆయకట్టు కింద 14 వేల ఎకరాల్లో వరి, 3 వేల ఎకరాల్లో మిరప, పత్తి పంటను రైతులు సాగు చేశారన్నారు. నీటిని అందించకపోవడంతో పంటలు నష్టపోవాల్సి వచ్చిందన్నారు. తుంగభద్రలో నీటి లభ్యత గురించి రైతులకు ముందస్తు సమాచారం ఇవ్వడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలం అయ్యిందన్నారు. నీరు పూర్తిగా అడుగంటిన తరువాత ఆఫ్–ఆన్ పద్ధతి ద్వారా రైతులను ఆదుకుంటున్నట్లు ప్రభుత్వం హడావుడి చేసిందని మండిపడ్డారు. ప్రస్తుతం వరి పంట వెన్నుదశలో ఉండగా నీటి సరఫరా పూర్తిగా ఆగిపోయిందన్నారు. దీంతో పంట చేతికి రాకపోగా రైతులపై అప్పుల భారం పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం ఇచ్చి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. -
సువర్ణముఖికి వరద.. భారీగా పంటనష్టం
వంగర (శ్రీకాకుళం): గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. వరద నీటి ప్రవాహం పెరగడంతో.. సువర్ణముఖి నదికి వరద పోటెత్తుతోంది. దీంతో నది తీరంలో ఉన్న గ్రామాలు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉందని గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. తీరంలో ఉన్న కొప్పర, కొండచాకరపల్లి గ్రామాలకు నీటి తాకిడి పెరగడంతో.. గ్రామస్థులు బిక్కుబిక్కుమంటున్నారు. ఒకవేళ వరద ఇలాగే కొనసాగితే.. రాత్రి వరకు గ్రామలు నీట మునిగే ప్రమాదముందని భయపడుతున్నారు. ఇప్పటికే 300 ఎకరాలలో పంట నీటమునిగింది. వరద ఇలాగే కొనసాగితే మా పరిస్థితి ఏంటి అని గ్రామస్థులు వాపోతున్నారు. -
కాల్వగేట్ల ఎత్తివేత..50 ఎకరాల్లో పంట నష్టం
ప్రకాశం: జిల్లాలోని సంతమాగులూరు మండలం కామేపల్లి సమీపంలో కొంతమంది దుండగులు మేజర్ కాల్వ గేట్లు ఎత్తివేయడంతో భారీ పంట నష్టం వాటిల్లింది. కొందరు ఈ దుశ్చర్యకు పాల్పడటంతో సమీపంలోని 50 ఎకరాల్లోని వరికుప్పలు నీటమునిగాయి. ఈ సంఘటనతో తీవ్రంగా నష్టపోయామని సంబంధిత రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తమను ఆదుకోవాలని వారు ప్రభుత్వాన్ని కోరారు.