పుస్తెలూ పోతున్నాయ్!
- మరో పంటకు పెట్టుబడి ప్రశ్నార్థకం
- వరుస నష్టాల్లో అన్నదాతలు
- టమాట రైతుకు ధరాఘాతం
- వ్యవసాయంపై సన్నగిల్లిన ఆసక్తి
--------------------------------------------
జిల్లాలో పంట మీద పంట దెబ్బ తింటూనే ఉండటంతో అన్నదాతలు ఆర్థికంగా చితికిపోయారు. పెళ్లాల పుస్తెలు కూడా తాకట్టులోనే పోతున్నాయని చాలామంది రైతులు ఆవేదన చెందుతున్నారు. వర్షాధారం కింద వేరుశనగ సాగు చేస్తే వరుణుడు కరుణించక ఊడలు దిగకమునుపే పంట పూర్తిగా ఎండిపోయింది. బోరుబావుల కింద వివిధ పంటలు సాగు చేసిన రైతుల పరిస్థితి మరింత అధ్వానంగా తయారైంది. ఉల్లి పంట సాగు చేస్తే ధరలు కుప్పకూలి కోలుకోలేని దెబ్బతీశాయి. చీడపీడలు, కల్తీ విత్తనాలతో పంట పూర్తిగా తుడిచి పెట్టుకుపోయింది. తెగుళ్లతో మొక్కజొన్న పంట దిగుబడి తగ్గిపోయి తీరని దుఃఖాన్ని మిగిల్చింది. ప్రస్తుతమున్న పంట టమాట. కాయలు చూసి సంబరపడిన రైతులు ధరలు కుప్పకూలిపోవడంతో కనీసం కూలీల ఖర్చు కూడా రావడం లేదని వాపోతున్నారు.
------------------------------------------------------------------------------
రాయదుర్గం రూరల్ : జిల్లావ్యాప్తంగా దాదాపు 20 వేల మంది రైతులు 7వేల హెక్టార్లలో టమాట సాగు చేశారు. ప్రస్తుతం 4వేల హెక్టార్లలో పంటకోత పూర్తయింది. మిగిలిన 3వేల హెక్టార్లలో పంట వివిధ దశల్లో ఉంది. నియోజకవర్గంలో గుమ్మగట్ట, రాయదుర్గం, డీ.హీరేహాళ్, బొమ్మనహాళ్, కణేకల్ మండలాల్లో 4,270 ఎకరాల విస్తీర్ణంలో 2,897 మంది రైతులు భార్యల పుస్తెలు తాకట్టు పెట్టి మరీ టమాట పంట సాగు చేశారు. కుటుంబీకులంతా రాత్రింబవళ్లూ అష్టకష్టాలు పడ్డారు. ఏపుగా పెరుగుతున్న చెట్లు, విరగ్గాసిన కాయలను చూసి మురిసిపోయారు.
కానీ కాయ పక్వానికి వచ్చి విక్రయించే సమయంలో ధరలు కుప్పకూలిపోయాయి. బళ్లారి, మదనపల్లి, కోలార్, అనంతపురం మార్కెట్లలో కాయ నాణ్యతనుబట్టి 15 కేజీల బాక్సు రూ.20లు, 28 కేజీల బాక్సు రూ.30లకు అడుగుతున్నారు. అది టమాటాలను విడిపించే కూలీలకు కూడా సరిపోదు. అందువల్ల కొంతమంది కాయలను పొలంలోనే వదిలేస్తున్నారు. మరికొందరు మేకలు, గొర్రెలకు మేతగా వదిలేస్తున్నారు. దుక్కి దున్నేందుకు, టమాట నారు, రసాయనిక, క్రిమిసంహారక మందులు, కూలీల ఖర్చు, కట్టెలు పాతడానికి, కట్టడానికి వైర్ల కోసం ఎకరాకు రూ.50 వేల దాకా ఖర్చయింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ పెట్టుబడిలో ఒక్క రూపాయి కూడా తిరిగి వచ్చేలా లేదు. అంటే పెట్టుబడి మొత్తం అప్పుగా మిగిలిపోతోంది. దానికి వడ్డీ పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో పుస్తెలు తాకట్టు పెట్టినవారు వాడిని విడిపించుకోలేకున్నారు. మరోసారి పంట పెట్టాలంటే పెట్టుబడి కూడా దొరకదని ఇకపై వ్యవసాయం చేసేందుకు చాలామంది ఆసక్తి చూపడం లేదు. టమాటాకు మద్దతు ధర కల్పిస్తామని ఊరించిన పాలకులు చివరకు ఉసూరుమనిపించారు.
ఇంతకన్నా దారుణం మరోటి లేదు
అరకొరగా వస్తున్న నీటితో నాలుగు ఎకరాల్లో టమాట సాగు చేశా. లక్షా అరవై వేలు ఖర్చయింది. పంట చేతికి వచ్చేసరికి ధరలు పూర్తిగా పడిపోయాయి. ఒకసారి 80 బాక్సులను బళ్లారి మార్కెట్‌కు తీసుకెళితే ఆటో బాడుగ కూడా చేతి నుంచి ఇవ్వాల్సి వచ్చింది. ప్రభుత్వం మద్దతు ధర కల్పిస్తామని చెప్పిందిగానీ చెయ్యలేదు. ఇంతకన్నా దారుణం మరొకటి లేదు. ఇకపై వ్యవసాయం చేయడం మానేయాలని అనుకున్నాం.
- కృష్ణనాయక్, ఆవులదట్ల గ్రామం
తోట వద్దకు వెళ్లడం మానేశాం
మాకున్న మూడు ఎకరాల్లో టమాట పంట సాగు చేశాం. కాయ పక్వానికి వచ్చింది. మార్కెట్‌లో 28 కేజీల బాక్సు రూ.30లకు అడుగుతున్నారు. కాయలను తొలగించాలంటే ఒక్కొక్కరికి రెండొందల రూపాయల కూలి ఇవ్వాలి. ఏ మాత్రం గిట్టుబాటు కాకపోవడంతో కాయలను తొలగించలేదు. పంటను చూసి గుండె తరుక్కుపోతుండటంతో తోట వద్దకు వెళ్లడం మానేశాం. టమాట సాగు చేసిన రైతులకు ప్రోత్సాహం కల్పించాలి.
- కంకర బొజ్జన్న, కెంచానపల్లి