తెగుళ్ల నివారణతోనే అధిక దిగుబడులు
ఉద్యానపంటల్లో సస్యరక్షణ చర్యలు తప్పనిసరి
ఏపీఎంఐపీ ఏపీడీ జి.చంద్రశేఖర్
అనంతపురం అగ్రికల్చర్: ప్రస్తుతం పరిస్థితుల్లో టమాట, వంగ, కర్భూజా, కళింగర పంటలకు ఆశించే చీడపీడలు, తెగుళ్ల నివారణకు సస్యరక్షణ చర్యలు చేపట్టాలని ఉద్యానశాఖ టెక్నికల్ అధికారి, ఏపీఎంఐపీ ఏపీడీ జి.చంద్రశేఖర్ తెలిపారు.
+ గాలిలో తేమ శాతం పెరగడం వల్ల టమాట పంటలో ఎండుతెగులు (అర్లీబ్లైట్స్, లేట్‌బ్లైట్స్) వ్యాపించి నష్టం కలిగించే అవకాశం ఉంది. దీన్ని సకాలంలో నివారించుకోకపోతే పంట దిగుబడులు బాగా తగ్గిపోతాయి. ఎండుతెగులు నివారణలో భాగంగా 1 గ్రాము థయోపిసోనేట్ మీథైల్ ఒక లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి. నాలుగైదు రోజల తర్వాత 1 మి.లీ డైకొనపెనజోల్ + 2 మి.లీ టెబుకొనజోల్ లీటర్ నీటికి కలిపి పిచికారి చేయాలి. తెగులు సోకిన మొక్కలు ఏరివేసి నాశనం చేసిన తర్వాత మందులు పిచికారి చేసుకోవాలి. ఆకాశం మేఘావృతమై మబ్బులు కమ్ముకుంటున్న ప్రస్తుత తరుణంలో టమాటలో కాయతొలచు పురుగు (పచ్చ పురుగు) అధికమయ్యే పరిస్థితి ఉంది. నివారణకు 0.3 మి.లీ రినాక్సిపిర్ లేదంటే 0.3 గ్రాములు ఎమాన్సెపిన్ ఒక లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి. పిచికారి సమయంలో మందుల్లో 0.5 మి.లీ బంక (జిగురు) కలిపితే సమర్థవంతంగా పనిచేస్తుంది.
+ వంకాయ తోటల్లో కాయ, కొమ్మ తొలిచే పురుగు ఆశించి నష్టం కలిగిస్తోంది. తెగులు సోకిన కొమ్మలను కత్తిరించి నాశనం చేయాలి. నివారణలో భాగంగా 1 మి.లీ డైఫ్లమెండబైడ్ లీటర్ నీటికి కలిపి పిచికారి చేయాలి. సాయంత్రం వేళల్లో పిచికారి చేస్తే మందు బాగా పనిచేస్తుంది.
+ కర్భూజా తోటల్లో బూడిద తెగులు సోకే అవకాశాలు ఎక్కువ. నివారణకు 1 గ్రాము మైక్లోబుటానిల్ లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి. ఆకుముడుత (వైరస్) తెగులు సోకిన తోటల్లో 0.5 గ్రాములు అసిటమాప్రిడ్ లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి.