అనంతపురం అర్బన్ : జిల్లాలో వరి, మిరప, పత్తి పంటలు సాగు చేసిన రైతులు కోట్ల రూపాయలు నష్టపోయారని, ప్రభుత్వం వీరికి తక్షణం పరిహారం ఇవ్వాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వి.రాంభూపాల్ డిమాండ్ చేశారు. బుధవారం స్థానిక సీపీఎం కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. హెచ్‌ఎల్‌సీ ఆయకట్టు కింద 14 వేల ఎకరాల్లో వరి, 3 వేల ఎకరాల్లో మిరప, పత్తి పంటను రైతులు సాగు చేశారన్నారు. నీటిని అందించకపోవడంతో పంటలు నష్టపోవాల్సి వచ్చిందన్నారు.
తుంగభద్రలో నీటి లభ్యత గురించి రైతులకు ముందస్తు సమాచారం ఇవ్వడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలం అయ్యిందన్నారు. నీరు పూర్తిగా అడుగంటిన తరువాత ఆఫ్–ఆన్ పద్ధతి ద్వారా రైతులను ఆదుకుంటున్నట్లు ప్రభుత్వం హడావుడి చేసిందని మండిపడ్డారు. ప్రస్తుతం వరి పంట వెన్నుదశలో ఉండగా నీటి సరఫరా పూర్తిగా ఆగిపోయిందన్నారు. దీంతో పంట చేతికి రాకపోగా రైతులపై అప్పుల భారం పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం ఇచ్చి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
రూ.కోట్లల్లో పంటల నష్టం
Published Wed, Oct 26 2016 10:54 PM | Last Updated on Mon, Aug 13 2018 8:12 PM
Advertisement