వెనుకబడిన ప్రాంతాలకు తీరని అన్యాయం
అనంతపురం సప్తగిరి సర్కిల్ : వెనుకబడిన ప్రాంతాలకు బడ్జెట్‌లో తీరని అన్యాయం చేశారని సీపీఎం జిల్లా కార్యదర్శి రాంభూపాల్ కేంద్రం పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సీపీఎం నగర కమిటీ ఆధ్వర్యంలో బుధవారం కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం 2017–18కి కేటాయించిన బడ్జెట్‌లో రాష్ట్రానికి మొండిచేయి చూపిందన్నారు. గత బడ్జెట్ కంటే పెద్ద బడ్జెట్ ఉన్న అంకెల్లో వెనుకబడిన ప్రాంతాలకు ఒరిగిందేమి లేదన్నారు. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో ఇచ్చిన హామీలు నెరవేర్చే చర్యలు ఇందులో లేవన్నారు.
రాయలసీమ ప్రాంతానికి రైల్వేజోన్, కడప ఉక్కు ఫ్యాక్టరీ, రాష్ట్ర బడ్జెట్ లోటు పూడ్చడానికి ఇస్తామన్న నిధులపై ఎలాంటి ప్రస్తావన చేయలేదన్నారు. రైతులకు ఫసల్‌బీమా యోజన కింద కేటాయించే మొత్తాన్ని రూ.13,240 కోట్ల నుంచి రూ.9000 కోట్లకు కుదించారన్నారు. డీమానిటైజేషన్ ద్వారా రైతులు, కూలీలు నష్టపోయిన పరిహారం బడ్జెట్‌లో చోటు చేసుకోలేదన్నారు. నీతి ఆయోగ్ పేరుతో ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ను రద్దు చేసిన ప్రభుత్వం బడ్జెట్‌లో ఆమేరకు కేటాయింపులు జరగలేదన్నారు.
దేశ జనాభాలో 17 శాతం ఉన్న ఎస్సీలకు 2.44 శాతం, 7 శాతం ఉన్న గిరిజనులకు 1.48 శాతం మాత్రమే కేటాయించడం బీజేపీ దళిత, గిరిజన వ్యతిరేక వైఖరికి అద్దం పడుతుందన్నారు. చేనేత రంగానికి గతేడాది రూ.604 కోట్ల నుంచి రూ.106 కోట్లకు కుదించడం దారుణమన్నారు. పెద్దలకు రాయితీలను అందిస్తూ సామాన్యులకిచ్చే సబ్సిడీల్లో కోత విధించిందన్నారు. కార్యక్రమంలో నగర కార్యదర్శి నాగేంద్ర కుమార్, గోపాల్, వెంకటనారాయణ, ప్రకాష్, రమేష్, నూరుల్లా, బాలకృష్ణ, నాగప్ప, వలి రైతు సంఘం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్‌రెడ్డి, డీవైఎఫ్‌ఐ నాయకులు ఆంజినేయులు, సూర్యచంద్ర, రాజు తదితరులు పాల్గొన్నారు.