
మంచాల: ప్రజాస్వామిక విలువల కోసం ప్రతి ఒక్కరూ పోరాడాలని, హక్కుల సాధన కోసం ఐక్య ఉద్యమాలకు సిద్ధం కావాలని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు పిలుపునిచ్చారు. రంగా రెడ్డి జిల్లా మంచాల మండల పరిధిలోని ఆరుట్లలో శని వారం ఆ పార్టీ జాతీయ మహాసభల ప్రచార బస్సు యాత్రను ఆయన ప్రారంభించి మాట్లాడారు. బడుగు, బలహీన వర్గాల అభివృద్ధి పేరుతో అధికారంలోకి వచ్చిన పాలక వర్గాలు ఆయా వర్గాలపై నిరంకుశ ధోరణిని అవలంబించడం దారుణమన్నారు.
కేంద్ర ప్రభుత్వం మతోన్మాదాన్ని పెంచి పోషిస్తోందని, టీఆర్‌ఎస్ ప్రభుత్వం కూడా ఆ బాటలోనే నడుస్తోందన్నారు. సామాజిక న్యాయంతోనే తెలంగాణ సమగ్రాభివృద్ధి సాధ్యమవుతుందని రాఘవులు అన్నారు. కార్యక్రమంలో సీపీఎం జాతీయ నాయకుడు అరుణ్ కుమార్, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, చుక్కా రాములు, రాష్ట్ర కమిటీ సభ్యుడు కిల్ల గోపాల్, రాష్ట్ర రైతు సంఘం అధ్యక్షుడు పెసరగాయల జంగారెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment