ఆధిపత్య పోరులో అధికార పార్టీ నేతలు
– సీపీఎం జిల్లా కార్యదర్శి వి.రాంభూపాల్ ధ్వజం
అనంతపురం అర్బన్ : జిల్లాలో ప్రజలు సమస్యల సుడిలో కొట్టు మిట్టాడుతుంటే... పరిష్కరించాల్సిన అదికార పార్టీ నేతలు ఆధిపత్య పోరులో ముగినిపోయారని సీపీఎం జిల్లా కార్యదర్శి వి.రాంభూపాల్ ధ్వజమెత్తారు. గురువారం ఆ పార్టీ కార్యాలయం గణేనాయక్ భవన్‌లో జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. అనంతరం విలేకరులతో రాంభూపాల్ మాట్లాడారు. జిల్లాలో తీవ్ర కరువు నెలకొంది. తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. నోట్ట రద్దు కొత్త సమస్యలు తెచ్చిపెట్టింది. ఇళ్ల స్థలాల సమస్య, ఉపాధి కూలీలకు, మరుగుదొడ్ల నిర్మాణానికి బిల్లులు చెల్లింపులు నిలిచిపోయాయి.
పంట నష్టపోయి రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయారు. భూములు కోల్పోయిన రైతులకు పరిహారం అందలేదు. రోడ్ల విస్తరణ ఆందోళన. ఇలా పలు సమస్యలతో జిల్లా ప్రజలు ఇబ్బంది పడుతుంటే అధికార పార్టీ నాయకులకు ఇవేవి పట్టలేదని ఆయన విమర్శించారు. ప్రజల సంక్షేమాన్ని, వారి సమస్యలను గాలికొదిలేసి ఆధిపత్యం కోసం పాకులాడుతున్నారన్నారు. ప్రజా సమస్యలు పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ప్రతిపక్ష పార్టీలను కలుపుకుని పెద్ద ఎత్తున ఉద్యమిస్తామన్నారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నల్లప్ప, కమిటీ సభ్యులు బీహెచ్‌రాయుడు తదితరులు పాల్గొన్నారు.