పెద్ద నోట్ల రద్దుతో సామాన్యులకే ఇక్కట్లు
– ఆంధ్రా బ్యాంకు ఎదుట ధర్నాలో సీపీఎం జిల్లా కార్యదర్శి రాంభూపాల్
అనంతపురం అగ్రికల్చర్ : నల్లధనం నిర్మూలన పేరుతో పెద్ద నోట్లు రద్దు చేసి సామాన్య వర్గాలను తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టేశారని సీపీఎం జిల్లా కార్యదర్శి వి.రాంభూపాల్ ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మంగళవారం స్థానిక కోర్టు రోడ్డులోని ఆంధ్రాబ్యాంకు ఎదుట సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ కొత్త నోట్లు పెద్ద ఎత్తున చెలామణిలోకి వచ్చే వరకు పాత నోట్లను కొనసాగించాలన్నారు.
రోజంతా బ్యాంకుల వద్ద పడిగాపులు కాస్తున్నా కనీస అవసరాలకు కూడా డబ్బు లభించడం లేదన్నారు. బ్యాంకుల వద్ద నిలబడి ఇప్పటివరకు 70 మంది, పనిఒత్తిడితో 11 మంది బ్యాంకు సిబ్బంది ప్రాణాలు కోల్పోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాణాలు పోతున్నా పార్లమెంటులో కనీసం మృతులకు సంతాపం కూడా తెలపకపోవడం దారుణమన్నారు. నోట్ల రద్దు కేంద్ర ప్రభుత్వం, భాగస్వామ్య పక్షాలకు చెందిన నాయకులు ముందుగానే తెలిసిందన్నారు. ఈ క్రమంలో సెప్టెంబర్ 16 నుంచి 28 లోగా రూ.20.57 లక్షల కోట్లు డిపాజిట్లు చేశారని గుర్తు చేశారు. సీపీఎం నాయకులు గోపాల్, నాగేంద్రకుమార్, ఆర్వీనాయుడు, రామిరెడ్డి ,చండ్రాయుడు, తదితరులు పాల్గొన్నారు.