తిండి గింజలకూ తిప్పలే!
రబీలో భారీగా పడిపోయిన వరి సాగు
సాధారణ సాగులో 7 శాతానికే పరిమితం
ఇతర తిండి గింజలదీ ఇదే దుస్థితి
రానున్న రోజుల్లో బియ్యం ధరలు
పెరిగే అవకాశం మొత్తం సాగు విస్తీర్ణంలోనూ భారీగా తగ్గుదల
కర్నూలు : రానున్న రోజుల్లో తిండి గింజలకు తిప్పలొచ్చే ప్రమాదం పొంచి ఉంది. ఇప్పటికే సరైన వర్షాలు లేక ఖరీఫ్‌లో భారీగా పంటలు దెబ్బతిన్నాయి. పండిన పంటలకు కూడా గిట్టుబాటు ధర లభించక రైతులు ఇబ్బందులు ఎదుర్కొనాల్సి వచ్చింది. దీంతో రబీలో ప్రత్యేకంగా వరి పంటను సాగు చేసేందుకు రైతులు ససేమిరా అంటున్నారు. ఫలితంగా రబీ సీజనులో సాగు విస్తీర్ణం గణనీయంగా పడిపోయింది. దీంతో సాధారణ సాగులో కేవలం 10 శాతానికే ఈ పంట పరిమితమైంది. ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో జిల్లాలో బియ్యం ధరలకు రెక్కలొచ్చే ప్రమాదం నెలకొంది. మొత్తం మీద ప్రజలకు తిండి గింజలకు ఇబ్బందులు ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
సాగయింది 7 శాతమే...!
జిల్లాలో మొత్తం కర్నూలు మండలాన్ని మినహాయిస్తే 53 మండలాల్లో వరి సాగు అవుతోంది. జిల్లాలో రబీ సీజనులో సాధారణంగా వరి పంట సగటున 28,213 హెక్టార్లల్లో సాగు అవుతుంది. అయితే, ఈ రబీ సీజనులో మాత్రం వరి పంట వేసేందుకు జిల్లాలోని రైతన్నలు విముఖత చూపుతున్నారు. ఈ సీజనులో వ్యవసాయశాఖ సేకరించిన లెక్కల ప్రకారం వాస్తవికంగా సాగు అయ్యింది మాత్రం 2121 హెక్టార్లలో మాత్రమే. అంటే సాధారణ సాగు విస్తీర్ణంలో కేవలం 7 శాతం మాత్రమే సాగయ్యిందన్నమాట. అంతేకాకుండా జొన్నల సాగు పడిపోయింది. సజ్జ సాగు ఆశాజనకంగా సాగడం లేదు. జిల్లాలో సాధారణంగా రబీలో సజ్జ 496 హెక్టార్లల్లో సాగు అవ్వాల్సి ఉండగా... 56 హెక్టార్లకే పరిమితమైపోయింది. అన్ని తిండి గింజలదీ ఇదే పరిస్థితి. రబీ సీజనులో మొత్తం అన్ని పంటల సాగు విస్తీర్ణం కూడా 4,12,380 హెక్టార్లు సాగు కావాల్సి ఉండగా... 2,66,772 హెక్టార్లకే పరిమితమైపోయింది. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుంటే రానున్న రోజుల్లో తిండి గింజలకు తిప్పలు తప్పేలా లేవని వ్యవసాయరంగ నిపుణులు అంటున్నారు.
కేసీ కెనాల్ నీళ్లు రాకపోవడమూ కారణమే...!
భారీగా ఆశలు పెట్టుకుని ఖరీఫ్‌లో జిల్లాలోని రైతులు భారీగా సాగు చేశారు. వర్షాల రాక ఆలస్యం అయినప్పటికీ పంటల సాగు విస్తీర్ణం మాత్రం భారీగా పెరిగింది. ఉదాహరణకు వరి సాగును తీసుకుంటే ఖరీఫ్‌లో సాధారణ విస్తీర్ణం 88,645 హెక్టార్లు కాగా.. వాస్తవికంగా సాగయింది మాత్రం 91,568 హెక్టార్టు. అంటే సాధారణ సాగు కంటే పెరిగింది. అయితే, ఎంతో ఆశతో ఖరీఫ్‌లో సాగు చేసిన వరి పంటకు దోమపోటు సోకింది. దీంతో దిగుబడులు గణనీయంగా తగ్గిపోయాయి. పండించిన పంటకు కూడా గిట్టుబాటు ధర లభించడం లేదు. ప్రభుత్వం కల్పిస్తున్న గిట్టుబాటు ధర ఏ మాత్రమూ సరిపోవడం లేదని రైతన్నలు వాపోతున్నారు. అంతేకాకుండా కర్నూలు-కడప (కేసీ) కెనాల్ నీళ్లు ఖరీఫ్ సీజనుకే సరిగా అందే పరిస్థితి లేదు. అంతేకాకుండా రబీ సీజనుకు నీళ్లు ఇవ్వలేమని ముందుగానే ప్రభుత్వం తేల్చి చెప్పింది. దీంతో రబీలో పంటలను సాగు చేసేందుకు ధైర్యం చేయడంలేదు. మరోవైపు కేసీ కెనాల్ నీళ్లను అనంతపురం జిల్లాకు మళ్లించడం పట్ల జిల్లా రైతుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.