రాజంపేట : ఖరీఫ్, రబీ సీజన్‌లో వరుణుడు కరుణించక పోవడంతో జిల్లాలో రైతులు కష్టాల సుడిగుండంలో చిక్కుకుని విలవిల్లాడుతున్నారు. రాజంపేట వ్యవసాయ సబ్ డివిజన్ పరిధిలో చుక్క నీరు లేక చెరువులు, బావులు ఎండిపోయాయి. వాటి కింద ఉన్న భూములు బీడుగా మారాయి. బోరు బావుల్లోనూ నీరు ఇంకిపోవడంతో నిమ్మ, అరటి చెట్లు వాడుబట్టాయి. నదీ పరీవాహక ప్రాంతంలో అయితే ఫిల్టర్ పాయింట్లు వేసుకొని సేద్యం చేసుకుంటున్నటప్పటికి బోర్లలో నీరు అడుగంటిపోతోంది.
రాజంపేట, నందలూరు, పెనగలూరు, ఒంటిమిట్ట మండలాల్లో వేలాది ఎకరాల్లో వరి, అరటి, నిమ్మ, బొప్పాయి, మామిడి తోటలు సాగవుతున్నాయి. ఈ వేసవిలో తోటలను కాపాడుకునేందుకు ఎన్ని బోర్లు వేసినా ఫలితం కనిపించడం లేదు. ఒక్కో బోరుకు రూ.60 వేల నుంచి రూ లక్ష వరకు ఖర్చు వస్తోంది. బోర్లు వేసుకోవ డానికి అందినకాడల్లా అప్పులు చేస్తున్నారు.
అరకొర నీళ్లు పడినా సగం తోటను కాపాడుకోవచ్చనే ఆశతో రైతులు సాహసం చేస్తున్నారు. రాజంపేటలో 10, నందలూరులో 8, పెనగలూరులో 10, ఒంటిమిట్టలో 7 చెరువులు ఎండిపోవడంతో ఆయక ట్టు భూముల్లో సాగు చేపట్టేందుకు రైతులు మొగ్గు చూపడం లేదు. దీనికి తోడు ఉచిత విద్యుత్ సరిగా సరఫరా కాక కొందరు రైతులు ఇక్కట్లు పడుతున్నారు.
బోర్లు వేయలేకపోతున్నాం
సాగు నీటి కోసం బోర్లు వేయలేకపోతున్నాం. బోర్లు వేసినా నీరు పడుతుందన్న నమ్మకం లేకుండా పోయింది. వరుణుడు కరుణించకపోతే ఏప్రిల్, మే నెలల్లో తోటలు ఎలా కాపాడుకోవాలో అర్థం కావడంలేదు. దిగుబడి తగ్గిపోయి పంటకు పెట్టిన పెట్టుబడి కూడా చేతికి రాదేమోనని భయం వేస్తోంది.
- వేణురెడ్డి, హస్తవరం, రాజంపేట
1200 అడుగులు వేసినా..
నాకున్న రెండు ఎకరాల అరటి తోటకు నీరు అందించడం భారంగా మారుతోంది. వరుసగా ఏడు బోర్లు 1200 అడుగులు వే శాను. నీళ్లు పడలేదు. ఎనిమిదవ బోరులో నీళ్లు పడ్డాయి. అవి కూడా అంతంత మాత్రమే. వచ్చే రెండు నెలల్లో ఎండలు మండిపోతే ఈ అరకొర నీరు కూడా ఇంకిపోతుంది. వర్షం వస్తేనే కాసింత ఊరట ఉంటుంది.
-పచ్చ హనుమంతు నాయుడు, బావికాడిపల్లె, పుల్లంపేట
వరుణుడిపైనే ఆశలు
Published Tue, Mar 10 2015 2:18 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
Advertisement