- ఆరు తడుల పంటలను ప్రోత్సహించండి
- సరిపడా విత్తనాలను అందుబాటులో ఉంచండి
- వ్యవసాయ శాఖ కమిషనర్ ధనుంజయరెడ్డి
రబీకి ప్రత్యామ్నాయ ప్రణాళిక
Published Sun, Nov 27 2016 1:34 AM | Last Updated on Mon, Sep 4 2017 9:12 PM
నెల్లూరు రూరల్ : వర్షాభావ పరిస్థితుల్లో రబీ ప్రత్యామ్నాయ ప్రణాళికను సమర్థవంతంగా అమలు చేయాలని వ్యవసాయ శాఖ కమిషనర్ కె.ధనుంజయరెడ్డి ఆ శాఖ జిల్లా అధికారులకు సూచించారు. స్థానిక గోల్డెన్ జూబ్లీహాల్‌లో మండల వ్యవసాయ శాఖ అధికారులతో శనివారం ప్రత్యేక సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. కమిషనర్ మాట్లాడుతూ జిల్లాలో గత రబీలో వర్షాలు ముంచెత్తగా ఈ రబీకి వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయన్నారు. సాగు నీరు అందుబాటులో ఉండే ప్రాంతంలో వరి, కరువు ప్రాంతాల్లో అపరాలు సాగు చేసేలా రైతులను ప్రోత్సహించాలన్నారు. వ్యవసాయ ఉత్పత్తిలో నెల్లూరు జిల్లా కీలకమని, పంటల నిర్దేశించిన లక్ష్యం చేరుకునేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. మండలంలో ఆయా ప్రాంతాల డిమాండ్‌కు అనుగుణంగా విత్తనాలను అందుబాటులో ఉంచాలని, విత్తన కొరత లేకుండా పూర్తిస్థాయిలో ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాకు అవసరమైన విత్తనాలు, ఎరువులు ఇన్‌డెంట్ పెట్టాలన్నారు. రైతులకు అందుబాటులో ఉండి సాగు విస్తీర్ణం పెంచాలని, పొలంబడి, పొలం పిలుస్తోంది కార్యక్రమం ద్వారా సూక్ష్మపోషకాల వాడకం, పురుగు మందులు తగ్గించడం, సరైన యాజమాన్య పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. బయోప్రొడక్ట్ పేరుతో నకిలీ మందులు మార్కెట్‌లోకి వచ్చాయని, రైతులను ఆర్థికంగా నష్టపరుస్తున్న నకిలీలపై దృష్టి సారించాలన్నారు. డీలర్ల వద్ద నుంచి శాంపిల్స్ సేకరించి ల్యాబ్‌కు పంపించాలని, నకిలీ అని తేలితే బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు. డీలర్లతో ఏఓకు కుమ్మక్కయి రైతులకు అన్యాయం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పంటలను కాపుడుకునేందుకు రెయిన్‌గన్స్ ఉపయోగించాలన్నారు. రాష్ట్ర అపరాల స్పెషలిస్టు ఎన్‌డీఆర్‌కే శర్మ, జేడీఏ హేమమహేశ్వరారవు, ఆత్మ పీడీ దొరసాని, డీడీఏలు విజయభారతి, నాగజ్యోతి, ఏడీఏలు, ఏఓలు పాల్గొన్నారు.
Advertisement