కందిపప్పు మద్దతు ధర రూ.325 పెంపు
న్యూఢిల్లీ: పప్పుధాన్యాల ధరలు ఎగసిపడుతున్న నేపథ్యంలో రబీ సీజన్లో పప్పు ధాన్యాలకు మద్దతు ధరను రూ. 325 పెంపునకు కేంద్ర కేబినెట్ గురువారం ఆమోద ముద్ర వేసింది. గోధుమ మద్దతుధరపై మరో రూ.75 బోనస్ అందించేందుకు ఆర్థికవ్యవహారల కేబినెట్ కమిటీ(సీసీఎఫ్‌ఏ) ఆమోదం తెలిపింది. దీంతో 2015-16రబీ సీజన్‌కుగాను గోధుమ మద్దతుధర క్వింటాకు రూ.75 పెరిగి రూ.1,525కు చేరుకుంది. నూనెగింజల మద్దతు ధరను క్వింటాకు రూ.250 పెంచారు.
పెంపు తర్వాత కందిపప్పు మద్దతుధర రూ.3,325కు, శెనగల మద్దతుధర రూ.3,425కు చేరింది. వ్యవసాయ ఖర్చులు, ధరల సలహా మండలి కమిషన్(సీఏసీపీ) సూచించినట్లుగా ఆరు రబీ పంటలైన గోధుమలు, బార్లీ, శెనగలు, కందిపప్పు, ఆవాలు, కుసుమ నూనె గింజలకు మద్దతుధరను పెంచాలని నిర్ణయించారు. ఆహార బిల్లును ఇంకా అమలుచేయని రాష్ట్రాల్లో పేద, అత్యంత పేద వర్గాలకు 27లక్షల ధాన్యాలను కేటాయించేందుకు కేంద్రం ఓకే చెప్పింది.
ఇప్పటికి 20 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఆహార బిల్లు అమల్లో ఉండగా.. మిగిలిన రాష్ట్రాలు సెప్టెంబర్ 2015 కల్లా. అమలు చేయాలని కేంద్రం సూచించింది. రాష్ట్రాలనుంచి స్పందన రాలేకపోవడంతో కేంద్రమే పేద వర్గాలకు ధాన్యాన్ని ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ఇవ్వాలని నిర్ణయించింది. మద్దతు ధర పెంపుపై కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయంపై హరియాణా సీఎం ఖట్టర్ హర్షం వ్యక్తం చేశారు.
బెల్జియం, భారత్ మధ్య వివిధ రంగాల్లో అభివృద్ధికి సహకారం అందించుకోవటంతోపాటు.. పునరుత్పత్తి శక్తికి సంబంధించిన సాంకేతికత విషయంలో కుదుర్చుకున్న ఒప్పందాలకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది.